ఎస్.వి.రామారావు (శిరందాసు వెంకటరామారావు) అంతర్జాతీయంగా ప్రశస్తి పొందిన చిత్రకారుడు. ఆయనకు ఇరవై ఒకటో శతాబ్దపు పికాసో అని కూడా పేరుంది. భారత ప్రభుత్వం ఆయనని పద్మశ్రీతో సత్కరించింది. గుడివాడకు చెందిన రామారావు 1962లో కామన్ వెల్త్ ఫెలోషిప్ చిత్రకళను అధ్యయనం చేసేందుకు ఇంగ్లండు వెళ్లి ఆపైన అమెరికా వెళ్లారు. అమెరికా షికాగో యూనివర్శిటీలో మాడ్రన్ ఆర్ట్ ప్రొఫెసర్ గా రిటైరయ్యారు. చిత్రకారుడిగా సెటిల్ అయ్యారు. ఆయన చిత్రించిన కళాఖండాలు ప్రపంచంలోని అన్ని ప్రఖ్యాత గ్యాలరీలలో దర్శనమిస్తాయి. అయితే, మరొక పార్శ్వం ఉంది. అది ఆయన కవిత్వం. ఆయన తెలుగులో చాలా కాలంగా కవిత్వం రాస్తున్నారు. చాలా పుస్తకాలు కూడా వెలువడ్డాయి. ఇంగ్లీష్ లోకి కూడా అనువాదమయ్యాయి. ఆయన కవిత్వానికి మంచి పేరుకూడా వచ్చింది. అధ్యాత్మిక ,మానవతా వాద తాత్వికత ఆయన కవిత్వంలో నిండుగా ప్రవహిస్తుంటాయి. ఆయన చిత్రాలలో రంగులకు ఒక ప్రత్యేకత ఉంది. రంగులను నున్నటి సిల్క్ వస్త్రంగాలా తీసుకురాగలరు ,పాదదర్శక పదార్థాలుగా మార్చగలరు. నిఘాతో చూస్తే ఈ రంగుల పారద్శకతలోనుంచి ఆయన ఫిలాసఫికల్ ప్రపంచం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. దీన్నే ఆయన కవిత్వంలో నుంచి కూడా చూపగల దిట్ట. ఆయన ‘మనిషి’కి, మనసుకు, వర్ణ చిత్రాలకు, కవితలకు ఉన్న ఉమ్మడి లక్షణం సాత్వికత. ప్రశాంతంగా ఉంటాయి. నిమ్మళంగా ఆలోచించ చేస్తాయి. అందులో నుంచి పెద్దగా నిట్టూర్పులు, ఆవేశాలు, కోపతాపాలు పెల్లుబుకి, అరుపులు, కేకలు వస్తూ ఉండవు. చుట్టూర ప్రపంచ ఎలా ఉంది, ఏం పోగొట్టుకుంటున్నాం, ఏం మిగిలింది, ఏం కాపాడుకోవాలి… అనే విషయాలను ఆయన చాలా సున్నితంగా చెబుతారు.
ఇపుడు ఆయన మరిన్ని కవితలను ‘ఆలోలాంతరాళాలలో..’ సంపుటిగా వెలువరించారు. నిన్న ఆ పుస్తకాన్ని బి.నరసింగరావు విడుదల చేసారు. ఆ ఆవిష్కరణ సభకి కె.రామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా, ఆనంద్, తల్లావఝ్ఝుల శివాజీ, పున్నా కృష్ణమూర్తి, గిరిధర గౌడ్ వంటి మిత్రులు రామారావు గురించీ, ఆయన చిత్రకళ గురించీ మాట్లాడేరు.
ఆ సభలో కవితా సంపుటిని ప్రముఖ రచయిత, మాజీ ఐఎఎస్ అధికారి డా. చినవీరభద్రుడు పరిచయం చేశారు.
ఇదే ఆ పరిచయం …
కవులు చిత్రకారులుగా, చిత్రకారులు కవులుగా కూడా తమ సృజనాత్మక కృషిని కొనసాగించడం చాలా పూర్వకాలం నుంచీ ప్రపంచవ్యాప్తంగా కనవస్తున్నది. పాశ్చాత్య ప్రపంచంలో ఈ విషయంలో మనకి అందరికన్నా ముందుగా స్ఫురించేది మైకెలాంజిలో. ఇటలీలో ఫ్లోరెన్సుకి చెందిన మైకెలాంజిలో శిల్పి, చిత్రకారుడూ మాత్రమే కాక, గొప్ప ప్రేమకవిత్వాన్ని కూడా వెలువరించాడు. ఇంగ్లిషు కవుల్లో విలియం బ్లేక్ మిస్టిక్ కవి మాత్రమే కాదు, మిస్టిక్ చిత్రకారుడు కూడా. డాంటే గాబ్రియేలు రోజెట్టి ప్రి-రాఫలైట్ ధోరణికి చిత్రకారుడు, కవి కూడా. ఆధునిక చిత్రకారుల్లో పికాసో, పాల్ క్లీ వంటివారు కూడా కవిత్వం రాయకుండా ఉండలేకపోయారు. మధ్యప్రాచ్య సాహిత్య ప్రపంచంలో చిత్రకారుడు-కవి అనే నమూనాకి చప్పున స్ఫురించే ఉదాహరణ ఖలీల్ జిబ్రాన్. ఆయన సుప్రసిద్ధ రచన ‘ప్రవక్త ‘కు ఆయనే వేసుకున్న బొమ్మలు మన కళ్ళల్లో కదలాడుతూనే ఉంటాయి. తూర్పు దేశాల్లో చీనా, జపాన్ సాహిత్య రంగంలో అటు చిత్రకళలోనూ, ఇటు కవిత్వంలోనూ కూడా సమాన సాధన చేసిన కవి పరంపర ఒకటి ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. చీనా కవుల్లో తాంగ్ కాలానికి చెందిన వాంగ్ వెయి చిత్రాలు కవితలుగానూ, కవితలు చిత్రాలుగానూ ఉంటాయని నానుడి. సోంగ్ యుగానికి చెందిన సు-షి మరొక ఉదాహరణ. ఇక భారతదేశానికి వచ్చినట్లయితే, చిత్రలేఖక-కవీశ్వరుల జాబితాలో అందరికన్నా ముందు గుర్తొచ్చేది టాగోర్. కవిగా, రచయితగా, తాత్త్వికుడిగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన తరువాత ఆయన ఒక పైస్బాలుడిలాగా చిత్రలేఖనం మొదలుపెట్టాడు.
తెలుగులో కూడా అటు కవిత్వం ఇటు చిత్రలేఖనం సాధన చేసిన సృజనకారులకు కొదవలేదు. అడవి బాపిరాజు, మా గోఖలే, బుచ్చిబాబు, సంజీవదేవ్, శీలా వీర్రాజు వంటి వారు ఉజ్జ్వలమైన ఉదాహరణలు. చివరికి విశ్వనాథ సత్యనారాయణ కూడా బందరులో జాతీయకళాశాలలో పనిచేస్తున్నప్పుడు తన సహోద్యోగి ప్రమోద్ కుమార్ ఛటర్జీ దగ్గర కొన్నాళ్ళు చిత్రలేఖనం నేర్చుకున్నారని విన్నాను.
ఒక కవి చిత్రలేఖనం వైపుగా మొగ్గడానికి అతణ్ణి రంగులు ఎంతో కొంత ప్రలోభపరిచాయని చెప్పుకోవచ్చు. కాని ఒక చిత్రకారుడు కవిత్వం కూడా రాయాలాని ఎందుకు ఆసక్తిపడుతున్నాడు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఇంతదాకా ఎవరూ చెప్పినట్టు లేదు. అసలు మన దగ్గర చిత్రకళకు సంబంధించిన విశ్లేషణలే తక్కువ. ఇక సాహిత్య-చిత్రకళా రంగాలకు చెందిన ఉమ్మడి కృషి చేసినవాళ్ళ గురించిన విశ్లేషణ ఎక్కడ? కాని ఇప్పుడు రామారావు వంటి చిత్రకారుడు, ఎనభయ్యేళ్ళ వయసులో, కవితలు రచించి మనముందుకు రావడంతో ఆ ప్రశ్న మళ్ళా మనముందు కొత్తగా నిలబడుతున్నది.
చిత్రకారుడిగా రామారావు ఒక కాస్మిక్ చిత్రకారుడు. మిస్టిక్ చిత్రకారుడు. విశ్వరహస్యాన్ని, విశ్వాన్ని నడిపిస్తున్న గతిరహస్యాన్ని తన చిత్రలేఖనాల్లో పట్టుకోడానికి తపించినవాడు. డా.కలాం వంటి శాస్త్రవేత్త ఆయన చిత్రలేఖనాలు చూసినప్పుడు వాటిలో ఒక అంతరిక్ష అన్వేషణ కనిపిస్తున్నదని భావించడంలో ఆశ్చర్యం లేదు. కాని తన రంగులు, రేఖలు, వాటి విన్యాసాల ద్వారా తాను ప్రకటించలేని, వ్యక్తీకరించలేని ఏ కోణాలు మిగిలిపోయాయని ఆయన ఇప్పుడు అక్షరాల వైపు ఆశగా చూస్తున్నాడు?
ముందు పుస్తకం శీర్షిక చూద్దాం. ఆలోల అంటే లయబద్ధమైన కదలికతో కూడినది అని అర్థం. ‘ఆలోల ‘ ‘కల్లోల ‘కాదు. అంటే అక్కడ కదలిక ఉన్నదిగాని, అది agitated కాదు. సంతోషభరితమైనది, తనలో తాను సంతోషిస్తూ ఉన్నది. ఇక అంతరాళమంటే ఒక్క అంతరంగం మాత్రమే కాదు, బయట ప్రపంచం, అంతరిక్షం, విశ్వం-అన్నిటి అంతరాళం కూడా. ఒక్క అంతరాళం కాదు. అంతరాళాలు-అంటే బహువచనం. తన మనసునుంచి విశ్వమానసందాకా అనేక అంతరంగాలు. సాధారణంగా తెలుగు కవి తన ప్రాతం గురించీ, కులం గురించీ, రాజ్యం గురించీ, సమాజం గురించీ రాస్తూ ఉంటాడు. కాని ఈ చిత్రకవి ఏకకాలంలో అనేక అంతరాళాల గురించి రాస్తున్నాడు.
చిత్రకారుడు రాస్తున్న కవిత్వం కాబట్టి ఇందులో తాను చూస్తున్న దృశ్యాల్నో, తాను పొందుతున్న అనుభూతినో రంగుల్లో వర్ణిస్తున్నాడేమో అని చూసానుగాని, ఆయన అటువంటి ప్రయత్నం చేయలేదు. తన చిత్రలేఖనాల నీడ తన కవితలమీద పడనివ్వలేదు. ఆయన ఒక చిత్రకారుడు కాకపోయినా, అసలు ఇవి ఆయన రాసిన కవితలని తెలియకపోయినా, ఆయన సంతకం లేకపోయినా కూడా, ఇవి మనల్ని ఆకట్టుకోకమానవు. ఆ సంగతే చెప్పాను నిన్న. ‘ నా నవ్వులు ‘ అనే ఈ కవిత చూడండి:
అందరికీ వినిపించే
నా నవ్వులు,
తాటిమట్ట రంపపు
వాడి అయిన పండ్లతో
గొంతులోని స్వరపేటికను
గిట్టని వారెవరో
బలంగా కోస్తుంటే
వస్తున్న ధ్వనులని
నాకే తెలుసు.
ఈ సంపుటిలోని 41 కవితలూ ఇదే సాంద్రతతో ఉన్నాయని చెప్పలేను గాని, వాటి వెనక ఉన్న హృదయస్పందన మాత్రం ఒక్కలానే నిజాయితీగా ఉన్నదని చెప్పగలను. తన అనుభవాన్నో, అభిప్రాయాన్నో సూటిగా, ఒక ప్రకటనలాగా చెప్పే కవితలే ఎక్కువ భాగం ఉన్నప్పటికీ, ఆ ప్రకటన మాత్రం సంకోచరహితంగా, కొన్ని సార్లు సత్యాగ్రహంగా వినిపించడం గమనించాను.
ఈ సంపుటికి ముందుమాట రాసిన డా. కాత్యాయనీ విద్మహే ఆసక్తికరమైన పరిశీలన ఒకటి చేసారు. ఈ కవికి కృష్ణుడంటే ఇష్టమని చాలా కవితల్లో ‘శ్రీకృష్ణుడికి సంబంధించిన లీలామనోహర సందర్భం ఏదో ఒకటి ఉపమానంగా హఠాత్తుగా కవితనంతా మెరిపించడం గమనించవచ్చు ‘అని రాసారు. బహుశా మిస్టిక్ చిత్రకారుడు రామారావు తన అనుభూతిలోని మార్మికతను మనతో పంచుకోవలసి వచ్చినప్పుడు కృష్ణస్మరణలోకి వెళ్ళిపోతున్నాడని మనం చెప్పుకోవచ్చు.
తెల్లవారిలేస్తే రాజకీయ ఆరోపణలో, వ్యాపార ప్రకటనలో తప్ప మరొకటి వినిపించని మన జీవితంలో కోకిల కూత విన్నప్పుడూ, కొత్త కవిత్వ సంపుటి వెలువడినప్పుడూ నాకు ప్రాణం లేచొస్తుంది. ఇక ఆ కవిత్వ సంపుటి ఒక చిత్రకారుడి ఆలోలాంతరాళానిదైతే అంతకన్నా చల్లనివార్త మరేముంటుంది?