వరి పంట తగ్గించడం మంచిదే, కానీ…

(కన్నెగంటి రవి)

రాష్ట్ర వ్యవసాయం పై ఇటీవల జరిగిన సమీక్షలో రెండు మంచి మాటలు వెలువడ్డాయి. జిల్లాల స్థాయిలో పంటల ప్రణాళికలు తయారు చేయాలని , వానాకాలం సీజన్ లో కూడా వరి సాగు తగ్గించాలని ఈ మాటల సారాంశం . ఇవి రెండూ ఆహ్వానించాల్సిన విషయాలు. కోటి ఎకరాల మాగాణం , పుష్కలంగా నీళ్లున్నాయి అనే భ్రమాజనిత మాటలకు రైతులను గురిచేయకుండా ప్రభుత్వం , వరికి ప్రత్యామ్నాయ పంటల గురించి మాట్లాడడం మంచి పరిణామం.

ఈ ప్రకటనను తప్పు పడుతూ , ప్రతిపక్షాలు యాగీ చేయడం కూడా మానుకోవాలి. నియంత్రిత సాగు రైతుల స్వేచ్ఛకు ఆటంకమనీ, రైతులకు తమ ఇష్టమొచ్చిన పంటను వేసుకునే అవకాశం ఉండాలనీ చెప్పే మాటలు ప్రపంచీకరణ యుగంలో అత్యంత ప్రమాదకరం. రైతు కుటుంబం తమ స్వంత వినియోగం కోసమే పంటలు పండించుకుంటే , వాళ్ళ స్వేచ్ఛకు ఏ ఆటంకమూ ఉండదు. నియంత్రణ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది.

కానీ రైతులు కేవలం మార్కెట్ కోసం పంట సాగు చేస్తున్నప్పుడు , అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ స్వభావాన్ని, ఒడిదుడుకులను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కాకుండా , బడా కంపెనీల కోసం ఎగుమతి, దిగుమతి విధానాలు రూపొందిస్తున్నప్పుడు, ప్రభుత్వ సంస్థలు కేవలం ఒకటి రెండు పంటలనే ఎం‌ఎస్‌పి కి సేకరిస్తూ , మిగిలిన పంటలను మార్కెట్ శక్తులకు , ప్రైవేట్ వ్యాపారులకు వదిలేస్తున్నప్పుడు, మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత లేనప్పుడు , ప్రభుత్వమూ , రైతాంగమూ కలసి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక చేసుకోవడం ఎప్పుడూ ఆరోగ్యకరం.

అయితే ఈ పంటల ప్రణాళిక జిల్లా స్థాయిలో అధికారులు కూర్చుని , తమ పాత ఆలోచనా ధోరణిలోనే తయారు చేస్తే ఉపయోగం లేదు . ఈ ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేయాలి. మరీ ముఖ్యంగా , రైతులను, గ్రామీణ మహిళలను సంఘటితం చేసిన ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు, మండల మహిళా సమాఖ్యల నాయకులను మండల స్థాయిలో ఈ చర్చల ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. పంటల మార్పిడికి వాళ్ళు చెప్పే సమస్యలను సావధానంగా వినాలి. అడవి జంతువుల బెడదతో సహా ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏ నిర్ధిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో కూడా చర్చించాలి.

వాతావరణంలో వస్తున్న మార్పులను , పెరుగుతున్న ఉష్ణోగ్రతలను , వాటి ఫలితంగా ప్రతి సంవత్సరం పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని కూడా అధికారులు,శాస్త్రవేత్తలు ఈ చర్చలలో భాగంగా రైతు ప్రతినిధుల దృష్టికి తీసుకు రావాలి . ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) లో అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాలు , భారత దేశ వ్యవసాయానికి వ్యతిరేకంగా లేవనెత్తుతున్న వివాదాలు , కేంద్ర ప్రభుత్వ ఎగుమతి ,దిగుమతి విధానాలు భారత దేశ రైతులపై చూపుతున్న దుష్ప్రభావాలు లాంటి అంశాలను కూడా రైతుల అవగాహనలో ఉంచాలి. ఈ అవగాహన వ్యవసాయ అధికారులలో లేకుండా , ఈ ప్రక్రియ అంతా కొనసాగించకుండా, రైతులకు ఈ విషయాలు బోధించడం, రైతులను పంటల మార్పిడికి ఒప్పించడం అసాధ్యం .

వీటితో సమాన ప్రాధాన్యత కలిగిన అంశం – ఆయా పంటల సాగులో రైతులకు అయ్యే సమగ్ర ఉత్పత్తి ఖర్చులు, పంట అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో వ్యత్యాసం గురించి లోతైన చర్చ జరగాలి . పంటల మార్పిడి గురించి బయట వాళ్ళు ఎన్ని కబుర్లు చెప్పినా, రైతులు “ ఒక పంట సాగు చేస్తే తనకు ఎంత లాభం వస్తుంది, నికరంగా చేతికి ఎంత మిగులుతుంది” అనే అంశాలు తప్పకుండా చూస్తారు . అది తప్పు కూడా కాదు. సామాజిక రీతి అదే. రైతులు అన్ని పంటలూ మానేసి వరి, పత్తి పంటల వైపు మళ్లడానికి, అనేక ఇతర కారణాలతో పాటు, ఎం‌ఎస్‌పి తో ప్రభుత్వ సేకరణ , మిగిలిన పంటలతో పోల్చినప్పుడు ఈ రెండు పంటలలో నికర మిగులు ఎక్కువగా ఉండడం అనేవి ముఖ్యమైన కారణాలు .

ప్రతి సంవత్సరం 23 పంటలకు ఎం‌ఎస్‌పి ప్రకటించే సి‌ఏ‌సి‌పి సంస్థ , తెలంగాణా లో 2021-2022 సంవత్సరానికి వివిధ పంటల సాగు ఖర్చులను లెక్కించి , నికర మిగులును కూడా తేల్చింది . సి‌ఏ‌సి‌పి నివేదిక ప్రకారం పంట సాగు ఖర్చు (ఏ2 +ఎఫ్‌ఎల్ )ను , ప్రకటించిన ఎం‌ఎస్‌పి నుండి తీసి వేస్తే , ఆయా పంటల సగటు దిగుబడులను బట్టి ప్రతి ఎకరానికి – వరిలో 13,666 , జొన్నలో 4375, మొక్క జొన్నలో 13,260 ,రాగిలో 5,404 , కంది లో 6,638 , పెసరలో 5,941 ,మినుములో 8,495, వేరు శనగ లో 15,863 , సోయాబీన్ లో 9,298 , పొద్దు తిరుగుడు లో 6,015, నువ్వులు లో 1948 , పత్తిలో 13,557 రూపాయలు మిగులుతాయి. సి‌ఏ‌సి‌పి అంచనా వేసిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు ( సి2 ) ప్రకారం లెక్క వేస్తే , వివిధ పంటలలో కేవలం 523 నుండీ 7010 రూపాయలు మాత్రమే మిగులుతాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అంచనా ఖర్చు ప్రకారం అయితే , ఒక్క పెసర లో తప్ప, వరి,పత్తి సహా మిగిలిన అన్ని పంటల లోనూ రైతులు నికర నష్టాలనే మూట గట్టుకుంటున్నారు .
పైగా సి‌ఏ‌సి‌పి చెప్పిన ఈ నికర మిగులు ఉండేది , రైతులకు, రాష్ట్ర సగటు దిగుబడులతో సమానంగా పంట పండి, ఆయా పంటలకు ఎం‌ఎస్‌పి అందినప్పుడు మాత్రమే . ఏ కారణం చేత అయినా అంత పంట పండక పోయినా , రైతులకు ఎం‌ఎస్‌పి రాకపోయినా నికర నష్టాలే మిగులుతాయి. ప్రస్తుతం వరి, పత్తి పంటలను ఎం‌ఎస్‌పి తో ప్రభుత్వ శాఖలు సేకరిస్తున్నాయి కనుక , ఆ పంటల వైపే రైతులు వెళుతున్నారు . మిగిలిన పంటలు వేసిన రైతులు నష్ట పోతూ , నిరాశలో కూరుకుపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుండా , రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసే అవకాశమే లేదు. పైగా ఈ సమస్యకు పరిష్కారం స్థానిక, జిల్లా వ్యవసాయ అధికారులు చూపించలేరు .

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలలో విధాన నిర్ణయం తీసుకుంటే తప్ప , పంటల ప్రణాళిక అనుకున్నట్లుగా ముందుకు పోదు . అంటే ఒక రైతు కుటుంబానికి , ఒక ఎకరం సాగులో ఎక్కువ మిగులు ఉండే పంటలతో పోల్చినప్పుడు సమానంగా కనీస మిగులు ఉండేలా ఈ నిర్ణయాలు ఉండాల్సి ఉంటుంది . అంటే దిగుబడి తక్కువ , ఖర్చు ఎక్కువ అయ్యే కొన్ని పంటలకు ప్రత్యేక బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు కేటాయించుకోవాల్సి ఉంటుంది. నాఫెడ్ ,మార్క్ ఫెడ్ లాంటి సంస్థలు, కొన్ని పంటలను సేకరించడానికి పూనుకోవాల్సి ఉంటుంది .

కొన్ని పంటలను స్థానికంగా రైతు సహకార సంఘాలు సేకరించుకుని, నేరుగా మార్కెట్ చేసుకోవడానికి వీలుగా , ఆయా సహకార సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ కూడా సమకూర్చాల్సి ఉంటుంది . ఈ సహకార సంఘాల ఆధ్వర్యంలో గిడ్డంగులు, శీతల గిడ్డంగులు లాంటి మౌలిక వసతులు , ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయగలిగితే, ఆయా జిల్లాలలో అన్ని పంటలకు అవసరమైన వసతులు సమకూరినట్లు అవుతుంది.

వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలంటే , ఆయా పంటలకు నాణ్యమైన విత్తనాలు , తక్కువ ధరలకు దొరకాల్సి ఉంటుంది . రాష్ట్ర విత్తన కార్పొరేషన్ , హాకా లాంటి సంస్థలు , రైతు సహకార సంఘాలు , ఎఫ్‌పి‌ఓ ల ద్వారా ఈ విత్తనాలను సకాలంలో రైతులకు అందించడానికి చర్యలు చేపట్టాలి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల గురించి మాట్లాడుతూనే , రెండు ప్రమాదకర ప్రకటనలు చేసింది. ఒకటి, రాష్ట్రంలో పత్తి విస్తీర్ణాన్ని పెంచడం . ఇరవై లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయడం. మన రాష్ట్రంలో పత్తి దిగుబడి బాగా వచ్చే భూములు 20-25 లక్షల ఎకరాలకు మించి లేవు. మిగిలిన భూములన్నీ లోతు తక్కువ నేలలు . ఆయా భూములు నిస్సారమైనవి. నీటిని పట్టి ఉంచే గుణం లేనివి. నీళ్ళు ఎక్కువ అవసరమయ్యే పత్తి లాంటి పంటలను, విద్యుత్ అవసరమయ్యే బోర్లు , ఎత్తిపోతల పథకాల నీళ్ళతో పండించాలని అనుకోవడం సరైంది కాదని , ఇప్పటికే నాబార్డ్ అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే , ఆయిల్ పామ్ సాగుకు సంవత్సరంలో 12 నెలలూ విస్తరించేలా 1500 -1800 మిల్లీ మీటర్ల వర్షపాతం, 85-90 శాతం గాలిలో తేమ , సాధారణంగా 25-30 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు అవసరం. ఇవన్నీ సమకూరే మండలాలలో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు . మిగిలిన చోట్ల ఆ పంట రిస్క్ లో పడుతుంది.

వానా కాలంలో కూడా వరి విస్తీర్ణం తగ్గించుకోవడంతో పాటు, మన రాష్ట్రంలో ప్రజలు రోజు వారీ బియ్యంగా వినియోగించే వరి రకాలనే రైతులు పండించేలా ప్రోత్సహించడం అవసరం . ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయిలో సేకరించి, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ఎఫ్‌సి‌ఐ కి కూడా ఇవ్వవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశలో ఆయా జిల్లాల ప్రజలు వినియోగించే బియ్యం ఆధారంగా వరి విత్తన రకాలను ఎంపిక చేసి , వాటినే పండించేలా చూడడానికి ఒక జీవో జారీ చేసింది .
రాష్ట్రంలో ఎన్‌ఎస్‌ఎఫ్ ,ఎన్‌సి‌ఎస్‌ఎఫ్ లాంటి చక్కర ఫ్యాక్టరీలను ప్రభుత్వ, సహకార రంగంలో పునరుద్ధరించడం ద్వారా చెరకు సాగును ప్రోత్సహించవచ్చు .

ఆలుగడ్డల కు అవసరమైన ప్రర్హ్యెక కోల్డ్ స్టోరేజ్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ పంట సాగును ప్రోత్సహించవచ్చు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కూరగాయలు ,పండ్లు సాగును పెంచడంతో పాటు, కోటి పశువులకు అవసరమైన మేత / దాణా తయారీ పంటల సాగుకు కూడా ఆయా మండలాలలో భూమిని ఉంచుకోవడం అవసరం . ముఖ్యంగా పత్తి మాత్రమే పండే ప్రాంతాలలో ఎండు గడ్డికి కూడా అవసరమైన మార్కెట్ అందుబాటులో ఉంది.

ప్రభుత్వం మొక్కుబడిగా జిల్లా స్థాయి పంటల ప్రణాళికలు చేసినా, రైతులతో చర్చించకుండా, బెదిరింపులతో ఈ ప్రణాళికలు అమలు చేయాలనుకున్నా అది బెడిసి కొడుతుంది.

(కన్నెగంటి రవి ,రైతు స్వరాజ్య వేదిక , ఫోన్: 9912928422)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *