“మనమిప్పుడు దేశంలో పెద్దఎత్తున సాగుతున్న విద్వేష విధ్వంసానికి సాక్షులుగా ఉన్నాం. ఇక్కడ బలి పీఠం మీద ఉన్నది కేవలం ముస్లింలో, ఇతర మైనారిటీ మత సమూహాలకు చెందినవారో మాత్రమే కాదు, మన రాజ్యాంగమే బలి పీఠం మీద ఉన్నది.”
అంటూ అఖిల భారత సర్వీస్ లకు చెందిన 108 మంది 108 మంది మాజీ అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
రాజ్యాంగ ప్రవర్తనా బృందం – కాన్ స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్ – అనే పేరుతో పని చేస్తున్న ఈ బృందం తరఫున తయారైన ఈ లేఖ మీద 70 మంది మాజీ ఐఎఎస్ అధికారులు, 10 మంది మాజీ ఐపిఎస్ అధికారులు, స్వీడన్, ఇటలీ, పోర్చుగల్, యుకె, మయన్మార్, మెక్సికో, ఈజిప్ట్, నెదర్లాండ్, జపాన్, ఈస్తోనియా, ఫిన్లాండ్, ఇండోనేషియా, కొలంబియా, ఈక్వడార్, కోస్టారికాలలో భారత రాయబారులుగా పనిచేసిన పది మంది మాజీ ఐఎఫ్ఎస్ అధికారులు, ఇరవై మంది మాజీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారులు సంతకం చేశారు. వీరందరూ పదవీ విరమణ చేసిన అధికారులు గనుక రాష్ట్ర ప్రభుత్వాలలోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ అత్యున్నత స్థాయి అధికారులుగా పని చేసినవారు.
ఈ 108 సంతకాల పేర్లు జాగ్రత్తగా చూస్తే తెలుగు మాజీ అధికారులు లేకపోవడమో, అతి తక్కువ మంది ఉండడమో, ఉన్నవారిని వీరు సంప్రదించకపోవడమో జరిగిందన్నమాట. అంత మాత్రమే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ కాడర్ లోనో, తెలంగాణ కాడర్ లోనో చేసినవాళ్లు కూడా ఈ జాబితాలో కనబడలేదు. ఒకే ఒక్కరు, ఈష్ కుమార్ అనే మాజీ ఐపీఎస్ అధికారి, మాత్రమే మినహాయింపు. ఆహా, ఏమి తెలుగు రాష్ట్రాల ఘనత!!!
ఇక ఆ చరిత్రాత్మకమైన ఉత్తరం చదవండి.
26 ఏప్రిల్ 20222
ప్రియమైన ప్రధాన మంత్రి గారూ,
మనమిప్పుడు దేశంలో పెద్దఎత్తున సాగుతున్న విద్వేష విధ్వంసానికి సాక్షులుగా ఉన్నాం. ఇక్కడ బలి పీఠం మీద ఉన్నది కేవలం ముస్లింలో, ఇతర మైనారిటీ మత సమూహాలకు చెందినవారో మాత్రమే కాదు, మన రాజ్యాంగమే బలి పీఠం మీద ఉన్నది.
పదవీ విరమణ చేసిన ప్రభుత్వోద్యోగులుగా మాకు సాధారణంగా అంత తీవ్రమైన పదజాలంలో వ్యక్తీకరించే అలవాటు లేదు. కాని మన జాతి స్థాపక పితామహులు నిర్మించిన రాజ్యాంగ నిర్మాణం ఈ విధంగా విధ్వంసం అవుతుంటే, మాకిక మాట్లాడక తప్పడం లేదు. మా ఆగ్రహాన్నీ, ఆవేదననూ వ్యక్తీకరించక తప్పడం లేదు.
మైనారిటీ సమూహాలకు, ప్రత్యేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా అస్సాం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో పెచ్చరిల్లుతున్న హింసాకాండ భయానకమైన పరిమాణాలకు చేరుకున్నది. ఈ రాష్ట్రాలలో, ఢిల్లీ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉన్నది. ఢిల్లీలో కూడ పోలీసు శాఖ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. ఈ హింసాకాండను ఇంకెంతమాత్రమూ తనను తాను గట్టిగా నొక్కి చెప్పదలచుకున్న హిందుత్వ అస్తిత్వ రాజకీయాలకు సంబంధించినదిగా చూడలేం. అది మతోన్మాద జ్వాలలను చల్లారకుండా చూసే ప్రయత్నం మాత్రమే కాదు. అవి గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్నవే. కొన్ని సంవత్సరాలుగా మామూలైపోయినవే. కాని ఇప్పుడు భయం గొల్పుతున్న అంశమేమంటే మన రాజ్యాంగ మౌలిక సూత్రాలనూ, చట్టబద్ధ పాలన మౌలిక సూత్రాలనూ ఆధిక్యవాద శక్తులకు అధీనం చేస్తున్నారు. ఈ పనిలో రాజ్యం సంపూర్ణంగా మిలాఖత్తు అయినట్టు కనబడుతున్నది.
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పాలనా వ్యవస్థలలో, సంస్థలలో, ప్రక్రియలలో అన్ని కోణాలలోనూ ముస్లింల పట్ల ద్వేషం, దురభిప్రాయాలు చాల లోతుగా నెలకొని ఉన్నాయని అనిపిస్తున్నది. న్యాయ పాలన అనేది సమాజంలో శాంతి సామరస్యాలను నిర్వహించే సాధనంగా ఉండే బదులు, మైనారిటీలను నిరంతర భయ భీతావహ స్థితిలో ఉంచే సాధనంగా మారిపోయింది. తమ సొంత విశ్వాసాలు కలిగి ఉండడానికీ, తమ సొంత ఆచారాలు, ఆహార్యం, వ్యక్తిగత చట్టాలు పాటించడానికీ, తమ ఇష్టం వచ్చిన ఆహారం ఎంపిక చేసుకోవడానికీ వారికి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు విచారణాతీత శక్తిగా మారిన మూకల హింసాకాండ ద్వారా మాత్రమే కాదు, మైనారిటీల ఎంపిక హక్కుల మీద ఆంక్షలు విధిస్తున్న, దురభిప్రాయాలున్న, మతావేశపరులైన అధికారులు రాజ్య అధికారాన్ని తమ ఇష్టానుసారంగా వినియోగించడానికి వీలుగా చట్టాన్ని తారుమారు చేస్తున్నారు. అంటే రాజ్య అధికారాన్ని ఒక సమూహానికి వ్యతిరేకంగా సాగుతున్న మూక హింసకు వీలు కల్పించడానికి వాడుతున్నారు. అంతే కాదు, అధికారవర్గానికి అందుబాటులో ఉన్న చట్టబద్ధమైన సాధనాల (మతాంతరీకరణ వ్యతిరేక చట్టాలు, గోమాంస వినియోగాన్ని నిషేధించే చట్టాలు, ఆక్రమణ తొలగింపు, విద్యా సంస్థలలో ఒకే రకమైన దుస్తుల నిబంధనలు) ద్వారా ఒక మత సమూహంలో భయం కల్పించడానికి, వారి జీవనోపాధులను రద్దు చేయడానికి, వారు తాము తక్కువ జాతి పౌరులమే అనీ, అధిక సంఖ్యాక ఆధిపత్యవాదుల రాజకీయాధికారానికీ, ఆధిపత్యవాద సాంఘిక, సాంస్కృతిక పద్ధతులకూ లొంగి ఉండవలసిందేననీ వారి చేత ఒప్పించడానికీ వీలు కల్పిస్తున్నారు. మన దేశం క్రమ క్రమంగా తన పౌరులలోనే కొన్ని భాగాలను, మైనారిటీలను, దళితులను, పేదలను, అంచులలో ఉన్న సమూహాలను ఒక పద్ధతి ప్రకారం ద్వేష లక్ష్యాలుగా మార్చి, ఉద్దేశపూర్వకంగా వారిని వారి ప్రాథమిక హక్కుల నుంచి దూరం చేసే దిశలో సాగుతున్నదనేది అంతకంతకూ ఎక్కువగా భయానకంగా నిజం అవుతున్నది.
ప్రస్తుత మతోన్మాద ఉధృతిని రాజకీయ నాయకత్వం సమన్వయ పరుస్తున్నదనో, మార్గదర్శకత్వం వహిస్తున్నదనో చెప్పడానికి మాదగ్గర సమాచారం లేదు గాని, ఈ దుర్మార్గ అరాచక మూకలు భయం లేకుండా తమ అకృత్యాలు సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, స్థానిక స్థాయిలో అధికార యంత్రాంగాలే అనువైన వాతావరణాన్ని మాత్రం కల్పిస్తున్నాయనేది స్పష్టమే. ఈ అనువైన వాతావరణాన్ని ఏర్పరచడం, మద్దతు ఇవ్వడం స్థానిక పోలీసు, పాలనా అధికారులకు మాత్రమే పరిమితం కావడం లేదు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో అత్యున్నత రాజకీయ స్థాయిల నుంచి కూడ బైటికి చెప్పని ఆమోదం ఉందని అనిపిస్తున్నది. స్థానిక స్థాయి నిరంకుశత్వానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సానుకూల విధాన, వ్యవస్థాగత వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. వాస్తవంగా హింసాకాండకు పాల్పడుతున్నది కిరాయికి పెట్టుకున్న ఆకతాయి మూకలు కావచ్చు. కాని ఆ మూకల చర్యలకు అనువుగా నేలను సారవంతంగా మార్చినదెవరో, వారిలో ప్రతి ఒక్కరూ ఎలా పైనుంచి తయారయిన బృహత్ప్రణాళికను తు.చ. తప్పకుండా పాటిస్తారో, వారందరూ ఒకే ‘సాధన సంపత్తి’ని ఎలా వినియోగిస్తారో, ఒక పార్టీకి చెందిన ప్రచార యంత్రాంగమూ, ప్రభుత్వ ప్రచార యంత్రాంగమూ వారి చర్యలను సమర్థించుకోవడానికి ఎలా వీలు కల్పిస్తున్నాయో సందేహమే లేదు.
గతంలో జరిగిన మత కల్లోలాలకూ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకూ తేడా ఏమంటే, ఒక హిందూ రాష్ట్రం కోసం భూమికను సిద్ధం చేసే ప్రయత్నాల మహా ప్రణాళిక ఆవిష్కృతం కావడం మాత్రమే కాదు, అటువంటి పరిణామాం జరగకుండా అడ్డుకోవడానికి రూపొందించిన రాజ్యాంగ, చట్ట వ్యవస్థా చట్రాన్ని చిందరవందర చేయడం, తలకిందులుగా మార్చడం జరుగుతున్నది. అలా దాన్ని ఒక ఆధిపత్య నిరంకుశత్వ సాధనంగా మారుస్తున్నారు. ఈ స్థితిలో వాచ్యంగానూ, ప్రతీకగానూ బుల్డోజర్ అనేదే రాజకీయ, పాలనాధికారపు వినియోగానికి కొత్త ప్రతీకగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు. “చట్టం నిర్దేశించిన ప్రక్రియ”, “చట్టబద్ధ పాలన” అనే భావనల చుట్టూ నిర్మించిన సౌధం ఇప్పుడు కూల్చివేతకు గురవుతున్నది. జహంగీర్ పురి ఘటనలు చూపుతున్నట్టు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానపు ఆదేశాల పట్ల కూడా కార్యనిర్వాహకవర్గం కనీస గౌరవం చూపుతున్నట్టు లేదు.
ప్రధానమంత్రి గారూ, రాజ్యాంగ ప్రవర్తనా బృందం (కాన్ స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్) సభ్యులమైన మేమందరమూ మాజీ ప్రభుత్వాధికారులం. రాజ్యాంగ సేవలో దశాబ్దాలు గడిపినవాళ్లం. ఇవాళ దేశం ఎదుర్కొంటున్న ప్రమాదం కనీవినీ ఎరగనిదని భావిస్తున్నాం. ఇవాళ ప్రమాదంలో ఉన్నవి రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ ప్రవర్తన మాత్రమే కాదు. అసలు మన మహత్తర నాగరికతా వారసత్వమైన విశిష్ట సంకీర్ణ సామాజిక కలనేత వస్త్రం చీలికలు పీలికలు అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నాం. ఆ మహత్తర నాగరికతా వారసత్వాన్ని పరిరక్షించడానికి మన రాజ్యాంగం అతి జాగ్రత్తగా రూపొందించబడింది. ఇంత బ్రహ్మాండమైన సామాజిక ప్రమాదం కళ్ల ముందర ఉండగా మీ మౌనం చెవులను బద్దలు గొడుతున్నది.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అని మీరు చేసిన వాగ్దానాన్ని మేం మా మనసుకు పట్టించుకున్నాం. అందువల్ల మీ అంతరాత్మకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో మీరు మీ పాక్షిక పరిగణనలను అధిగమించి, మీ పార్టీ అదుపులో ఉన్న ప్రభుత్వాలు అకుంఠితంగా అమలుచేస్తున్న ద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపు ఇవ్వాలని ఆశిస్తున్నాం. మన జాతి నిర్మాతలు ఊహించిన, పోరాటం సలిపిన భారతదేశం అనే భావన విలసిల్లాలంటే సౌభ్రాతృత్వ, మత సామరస్య వాతావరణం కావాలి. ద్వేషం ద్వేషానికే దారి తీస్తుంది. తద్వారా అసలు భారతదేశం అనే భావనే మనుగడ సాగించలేని విషపూరిత వాతావరణం నెలకొంటుంది.
సత్యమేవ జయతే.
భవదీయులు
కాన్స్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్
108 సంతకాలు
(source: social media)