ప్రధాని సొంత రాష్ట్రం, ముఖ్యమంత్రిగా ఎంతో కాలం పాలించిన గుజరాత్ లో కరెంటు కోతల గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ టిఆర్ ఎస్ ఆవిర్భావ సభలో ప్రసంగిస్తూ ప్రస్తావించారు. దేశమంతా కరెంటు లేక చీకట్లు కమ్ముకుంటుంటే తెలంగాణ ఒక్కటే కరెంటు వెలుగు జిలుగులతో మెరిసిపోతున్నదని చెబుూ తెలంగాణ దారిపట్టిఉంటే దేశానికి ఈ గతి పట్టి ఉండేది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఏమన్నారంటే…
“దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్లు. అందుబాటులో ఉన్నా వినియోగించలేని పరిస్థితిలో ఈ దేశం ఉంది. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ శక్తి ఉన్నప్పటికీ 2 లక్షలకు మించి వాడటం లేదు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. మన చుట్టూర ఉన్న రాష్ట్రాల్లో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిద్వీపంలా వెలుగుతున్నది తెలంగాణయే. ఏడేండ్ల క్రితం మనకు కూడా కరెంట్ కోతలే. కానీ మనం ఆ సమస్యను అధిగమించాం. వెలుగు జిలుగుల తెలంగాణగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణలా దేశం పని చేసి ఉంటే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ముంబై నుంచి కోల్కతా వరకు 24 గంటలకరెంట్ ఉండేది, కోతలు చీకట్లు ఉండేవి కాదు.. దేశంలో ఉన్న సీఎంల సమక్షంలో, ప్రధాని అధ్యక్షతన వహించే నీతి ఆయోగ్లోనూ ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పాను. కానీ లాభం లేదు.”