అరుదైన లేఖ
ప్రఖ్యాత కమ్యూనిస్టు విప్లవ నాయకుడు తరిమెల నాగిరెడ్డి (ఫిబ్రవరి 11, 1917- జులై 27,1976) మృతి చెందినప్పుడు సంతాపం తెలుపుతూ మరొక కమ్యూనిస్ట్ యోధుదు, సీపీఎం నేత పుచ్చలపల్లి సుందరయ్య (మే 1,1913-మే 19,1985) రాసిన లేఖ.
తేదీ 5/8/76
ప్రియమైన శ్రీ సంజీవరెడ్డి గారికి
కామ్రేడ్ నాగిరెడ్డి , జూలై 27వ తేదీన రాత్రి ఉస్మానియా హాస్పిటలులో మరణించినట్లు ఇంగ్లీష్ పత్రికలో 29వ తేదీన చూచినాను. మరణ వివరాలు, ఇతర విషయాలు దొరికిన మేరకుపత్రికలలోనే చదివాను. నేనున్న పరిస్థితులలో సరాసరి నా సంతాపాన్ని చెల్లెలు లక్ష్మిగారికి గాని, సుజాతకు గాని, మీకు గాని తెలియచేయలేకపోయాను.
గత ఎనిమిదేండ్లుగా కామ్రేడ్ నాగిరెడ్డి మా రాజకీయాలతో విభేదించి విప్లవ కమ్యూనిస్టు పార్టీని వేరొక దానిని నిర్మించడానికి పూనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే మూడు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, నేటి అత్యవసర పరిస్థితిలో రహస్య జీవితం గడుపుతూ, రహస్యంగానే తన జీవితాన్ని కోల్పోయారు. తానెవరో ఎవరికీ చెప్పకుండానే అజ్ఞాతవాసిగా మరణించారు. తాను నమ్మిన రాజకీయపంథాలో ఏ రీతిగా పనిచేయాలో చనిపోయే సమయంలో కూడా ఏ దీక్షతో చనిపోవడానికి కూడా తయారుకావాలో చూపారు.
1938 నుండి 30 సంవత్సరాల మేమిద్దము కలసి మెలసి ఆంధ్రదేశంలో విశాలాంధ్రలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి గట్టిగా క్రుషి చేసిన ఆకాలము, ఆస్మ్రుతులు విజయాలు…..
కామ్రేడ్ నాగిరెడ్డి మాతో (సిపిఎం) కలసి ఉండాలని, ఆయన తీసుకోబోతున్న రాజకీయపంథా ఉద్యమానికి ఎంతో హాని కలిగిస్తుందనీ నేను ఒప్పించడానికి ప్రయత్నించాను. లాభం లేకపోయింది.
జీవితమంతా నూతన సమాజ నిర్మాణానికి, కష్టజీవుల రాజ్యం కోసం, సోషలిజం కోసం కృషి చేసి సర్వస్వాన్ని ఆఖరుకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన కామ్రేడు నాగిరెడ్డికి నా జోహార్లు.సోదరి లక్ష్మికి సంతాపం తెలియచేయడం తప్ప మరేమి చేయగలను.
భవధీయుడు
పుచ్చలపల్లి సుందరయ్య
ఇది కూడా చదవండి
అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీకి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టండి