గుడిమల్లం శివలింగంపై రాహుల్ సాంకృత్యాయన్

తిరుపతికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం శివలింగరూపం ఇది. దేశంలోనే తొట్టతొలి శైవక్షేత్రం. ఇలాంటి శివలింగం మరెక్కడా లేదు

 

-రాఘవ శర్మ

ఒక చేతిలో నీటి కుండ…మరో చేతిలో మేకపిల్ల..
కండలు తిరిగిన బలిష్టమైన శరీరంతో బుజానికి వేలాడుతున్న గండ్రగొడ్డలి..
కంఠాభరణాలు, చెవులకు కుండలాలు, ముంజేతి కంకణాలు..
ప్రశాంత వదనంతో నాసికాగ్రాన్ని చూస్తున్న విశాల నేత్రాలు..
మోకాళ్ళ వరకు దిగి, మొలచుట్టూ కట్టిన పలుచని వస్త్రం..
ఉద్దేశ్యపూర్వకంగా బహిర్గతం చేసిన జననాంగం..
యక్షుడి బుజాలపై నిలబడి, భూమిలోకి అణగదొక్కుతున్న పరశురామేశ్వరుడు..
నిలువెత్తు పురుషాంగాన్ని పోలిన శివలింగం ఒక విభిన్నమైన దృశ్యం!

శివలింగాన్ని ఇలా నగ్నంగా చెక్కడం పట్ల మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ అసహనం వ్యక్తం చేశారు.
ఆ మహానుభావుడు రాసిన ‘జయయౌధేయ’ చారిత్రక నవలలో జయ యౌధేయ పాత్ర ద్వారా ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తారు.
తిరుపతికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం శివలింగరూపం ఇది. ఇది దేశంలోనే తొట్టతొలి శైవక్షేత్రం. ఇలాంటి శివలింగం మరెక్కడా లేదు.

ఈ శివలింగాన్ని క్రీస్తుపూర్వం 2, 3 శతాబ్దాలలో చెక్కి ఉండవచ్చని ఇక్కడ తవ్వకాలు జరిపిన ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త ఇంగువ కార్తికేయ శర్మ అభిప్రాయపడ్డారు.

రాహుల్ సాంకృత్యాయన్ దేశాటనలో భాగంగా తిరుపతి ప్రాంతాన్ని 1914 ప్రాంతంలో సందర్శించారు. ఆ సమయంలోనే కాంచీపురానికి వెళుతూ, గుడిమల్లం ఆలయాన్ని కూడా సందర్శించినట్టు ఈ నవల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నవల కథాంశం క్రీస్తు శకం 350-400 మధ్యకాలం నాటిది. అంటే నాల్గవ శతాబ్దం రెండవ అర్ధభాగం నాటిది.

Rahul Sankrityayan
Rahul Sankrityayan /wikipedia  రాహుల్ సాంకృత్యాయన్ , నిరంతర యాత్రికుడు. 30 భాషాల్లో పండితుడు తన యాత్ర అనుభవాలతో ఆయన 135 పుస్తకాలు రాశారు. అందులో నవలలు,చారిత్రక గ్రంథాలు, అనుభవాలు ఉన్నాయి.

యమునా నదికి, హిమాలయాలకు మధ్య ఉండే యౌధేయ ప్రజాస్వామిక గణ రాజ్యం . విదేశీయులైన కుషాణులను దేశం నుంచి పారద్రోలడంలో యౌధేయులది ప్రధాన భూమిక. అలాంటి యౌధేయ గణాన్ని గుప్తులు నాశనం చేసి అయివ శతాబ్దం వచ్చేసరికి చరిత్రలో ఆ గణానికి నామరూపాలు లేకుండా చేశారు. యౌధేయుల గొప్పదనాన్ని గుప్తులకు కట్టబెట్టడంలో కాళిదాసులాంటి వారు కూడా ప్రయత్నించారు. యౌధేయ గణాధ్యక్షుడు కుమార యౌధేయ.

ఆయన భార్య జయసేన, వారి కుమారుడు జయ యౌధేయ ఈ నవలలో ప్రధాన పాత్రగా తన స్వగతాన్ని చెపుతుంటాడు.
వారి ముఖ్య పట్టణం అగ్రోదక(ఆగ్రా).

యౌధేయ గణంపై సముద్రగుప్తుడి దాడి తరువాత ఓడిపోయిన రాజు కుమార యౌధేయ తన కుమార్తె దత్తాను సముద్రగుప్తుడికిచ్చి వివాహం చేయడంతో ఆమెను పట్టమహిషిని చేస్తారు. వారి రెండవ కుమారుడే చంద్రగుప్తుడు.

తన తల్లి జయసేన మరణించడంతో, అతని అక్క దత్తా వద్దనే చంద్రగుప్తుడితో పాటు జయయౌధేయ పెరుగుతాడు.
కాంచీపుర సంస్థానానికి చెందిన సింహవర్మ, జయయౌధేయ, అతని వదినె వాసంతి కలిసి దంతపురం నుచి బయలు దేరి కళింగ రాజధాని పిష్టపురానికి చేరుతారు.

అక్కడి నుంచి ద్రవిడ దేశంలోకి ప్రవేశిస్తారు. సింహవర్మకు ద్రవిడ భాష వచ్చు.
ద్రవిడ దేశంలో గుడిమల్లం శివాలయం చాలా ప్రసిద్ధమైందని జయయౌధేయ చెపుతుంటాడు.
సింహ వర్మ కూడా ఈ శివాలయం ప్రసిద్ధిని వింటూనే ఉంటాడు.

జయయౌధేయ ఇలా చెపుతాడు. “గుడిమల్లం శివాలయంలోని శిల్పకళ ప్రశస్త్యాన్ని చూడవచ్చని గుడిమల్లం వెళ్ళాం.
అక్కడ యాత్రికులు, భక్తులు అనేకులున్నారు. మేము ముగ్గురం పూలమాలలు తీసుకుని ఆలయంలోకి ప్రశేశించాం.
అక్కడి భక్తులు తన్మయత్వంతో పూజార్చనలో ఉన్నారు. మరికొంత మంది కన్నార్పకుండా ‘లింగం’ వైపు చూస్తున్నారు.
అక్కడి లింగం ఎలా ఉంది?

మూడు బారల ఒక పెద్ద శిలాఫలకం. ఎవరో నిపుణుడైన కళాకారుడాఫలకం మీద తన కళను వ్యర్థం చేసుకున్నాడు.
పురుషుడి మర్మావయవాన్ని ఉన్నదున్నట్టుగా చెక్కాడా ఫలకం మీద. ఈ లింగానికి పైన సుందరమైన విగ్రహం ఉంది.
ఆ విగ్రహపు మర్మావయవం కూడా బహిర్గతంగా ప్రదర్శితమవుతోంది. అతి బీభత్సంగా ఉన్నాయా దృశ్యాలు.
నేనక్కడ (జయయౌధేయ) ఎక్కువ సేపు నిలబడలేకపోయాను. వదినె ఒక్క చూపు చూసి కళ్ళు దించుకుంది.
పాంథశాలకు వచ్చాక అన్నాను.” “మానవుడి అవివేకం మీద జాలి కలుగుతోంది” అని.

“నేను చిన్నతనం నుంచి ఈ దేవాలయాన్ని గురించి చాలా గొప్పగా విన్నాను. మా కుటుంబం శైవ కుటుంబం అని మీకు తెలుసుగా!
ఈ లింగాన్ని దర్శిస్తే జన్మ తరిస్తుందని మా భావన” అన్నాడు సింహవర్మ.

“మరి ఇంకా అదే భావన ఉందా మీలో” అన్నాను.

“మరి అలాంటిది చెక్కవలసిన అవసరం ఏమొచ్చింది” అన్నది వదినె.

“ఇలాంటి విగ్రహాలను, దేవాలయాలను సామాన్య మానవులు ఎన్నటికీ నిర్మంచలేరు.
లక్షల దీనార్లను ఖర్చు పెట్టి ఇలాటివి నిర్మించగలరు. ఈ బీభత్స దృశ్యం ధనికుల జీవితానికి ప్రతిబింబంలాంటిది!
అబ్బ.. తల్లి దండ్రి తమ పుత్రికలను తీసుకుని ఈ లింగాన్ని చూడడానికి ఎలా వస్తారు?
వచ్చినా వారి మనస్సులో ఎలాటి భావాలు కలుగుతాయి?”

‘జయా నీవు ఈ మతాలకు వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు కేవలం ద్వేషం వల్ల మాట్లాడుతున్నామనుకునేవాడిని!
కానీ, ఇప్పుడీ లింగాన్ని చూశాక, మతం మానవుణ్ణి ఉద్దరించడానికి కాదు. అధోగతి పాలు చేయడానికని తెలుసుకుంటున్నాను.
ఇలాంటి లింగాలనూ, విగ్రహాలను పూజించిన తరువాత కూడా బ్రాహ్మణులు, శ్రేష్టులూ పశుతుల్యమైన కామాన్ని ప్రదర్శించకుండా ఉంటే, నిజంగా ఆశ్చర్యపడవలసిన విషయమౌతుంది. కానీ, ఈ సిగ్గూ ఎగ్గూ లేని కలాకారుడు ఎవడో!,
కళాకారుణ్ణ‌ని ప్రయోజనం ఏముంది? అతనికి దీన్ని చెక్కినందుకు కూలీ ఇచ్చి ఉంటారు.
ఒక వేళ దీన్ని తయారు చేయలేకపోతే శిక్ష పడవచ్చు.

అది కాదు గానీ, సోదరా ఇలాటి లింగాలకు సపరివారంగా పూజ చేసేవారు బ్రహ్మచర్యాన్ని గురించీ, ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చెబితే ఏమనేట్టు?”

“ఇది చాలా సిగ్గులేని విషయం. మన కళకే గొప్ప కళంకం.”

‘తీర్థంకరుడి నగ్న ప్రతిమల్ని నేను చూశాను. నాకు అవి అసహ్యమనిపించాయి కానీ, వాటిలో కాముకత ఇంత నగ్నంగా ప్రదర్శించబడలేదు” అంత వరకు వాసంతి వదిన మెదలకుండా కూర్చున్నది. అసలేం మాట్లాడగలదు?
కానీ, తీర్థంకరుడి విషయం వచ్చేసరికి తనూ నోరు విప్పింది.

“మరిదీ మేము(స్త్రీలము) మతం విషయంలో చాలా గుడ్డిగా మూర్ఖంగా ఉంటాము
నేను కూడా తీర్థంకరుడి నగ్న మూర్తుల్ని (విగ్రహాలను) చూడడానికి ఎప్పుడూ వెళ్తూ ఉండే దాన్ని.
విగ్రహాలు పసిపిల్లవాడిలాటి సరళత్వాన్ని కలిగి ఉన్నాయి. అయినా విగ్రహాన్ని చెక్కేటప్పుడు శిల్పకారుడి చేయి తప్పుదారి పట్టిందనిపిస్తోంది. కాముకత్వపు సూక్ష్మ అభివ్యంజనం ఆ శిల్పంలో గోచరిస్తోంది.
ఈ అనాకార శిల్పాలకు పథ భ్రష్టమైన ఆ తీర్థంకరుడి శిల్పం ప్రారంభం. ఈ శిల్పం అంత్యం అనవచ్చు” అంది వదినె.

జయయౌధేయ నవలలో గుడిమల్లం నగ్న శివలింగం గురించి సంభాషణ ఇలా సాగుతుంది.
జయయౌధేయ పాత్ర ద్వారా రాహుల్ సాంకృత్యాయన్ ఈ శిల్పం పట్ల తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు.
రాహుల్ సాంకృత్యాయన్ 1914 ప్రాంతంలో తిరుపతి పరిసరాలను సందర్శించిన తరువాత రాసిన నవల ఇది.
భారత ప్రభుత్వ శాసన పరిశోధకుడు(ఎపిగ్రఫిస్ట్) రాయ్ బహదూర్ వి. వెంకయ్య 1903లో ఈ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించారు.

గోపీనాథరావు అనే పండితుడు ఈ ఆలయంలోని శివలింగం గురించి తొలిసారిగా 1914లో రాశారు.
ఆ ఫలితంగానే రాహుల్ దీని గురించి యజయౌధేయలో ఇలా చర్చించి ఉందవచ్చు. పరిరక్షించవలసిన అత్యంత విలువైన జాతి సంపదగా దీన్ని 1963లో భారత పురావస్తు శాఖ ప్రకటించింది.

గుడిమల్లంలోని ఆలయం గురించి అప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను శాస్త్రీయంగా పరిశీలించి, నిజాలను నిగ్గుతేల్చడానికి ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త (ఆర్కియాలజిస్ట్) ఇంగువ కార్తికేయ శర్మ 1973లో రంగంలోకి దిగారు.
వ్యక్తిగతంగా వైదిక సంప్రదాయాలను విశ్వసించే ఇంగువ కార్తికేయ శర్మ సత్యాన్వేషణకోసం ఆలయం గుర్భగుడిలో కూడా తవ్వకాలు జరపడానికి వెనుకాడ లేదు.

తొలుత గ్రామస్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అభ్యంతరాలతో పాటు ఆయనను శాపనార్థాలు కూడా పెట్టారు.
వాటిని ఆయన లెక్కచేయలేదు. ఇంగువ కార్తికేయ శ‌ర్మ ప‌రిశోధ‌న చేసి వెల్ల‌డించిన వివ‌రాలిలా ఉన్నాయి.

‘ఆలయానికి చుట్టూ ఎత్తైన ప్రాకారం ఉంది. ఈ ప్రాకారాన్ని పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు.
సహజంగా ఆలయాలన్నీ తూర్పు అభిముఖంగా ఉంటాయి. ఇక్కడి మూలవిరాట్టు తూర్పు అభిముఖంగా ఉన్నప్పటికీ, ఆలయ ప్రవేశ ద్వారం మాత్రం దక్షిణం వైపు ఉంది. ఈ ఆలయ ప్రాకారానికి ప్రవేశ ద్వారం పడమర దిక్కున ఉంది.
ఆలయంలోకి ప్రవేశించాక ఒక పెద్ద ఆరాధనామండపం వస్తుంది. ఈ ఆరాధనా మండపం నుంచి గర్భగుడి ముందున్న ముఖమండపంలోకి ప్రవేశించవచ్చు. ఈ ముఖ మండపం నుంచే తూర్పు అభిముఖంగా ఉన్న గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు.
ముఖమండపం కంటే గర్భగుడి పల్లంలో ఉంటుంది. గర్భగుడిలో ఎదురుగా ముదురు గోధుమ వర్ణంలో అయిదున్నర అడుగుల ఎత్తైన పురుషాంగాన్ని పోలిన నున్నటి శివలింగం కనిపిస్తుంది. ఆ శివలింగం పైన పరశురామేశ్వరుడి విగ్రహాన్ని చక్కగా చెక్కారు.

విగ్రహానికి విరబోసిన వెంట్రుకలపై ఆడవి ఆకులతో కట్టిన తలపాగా, చప్పడి ముక్కు, నాసికాగ్రాన్ని చూస్తున్నట్టున్న చేపల్లాంటి విశాలమైన నేత్రాలు, గుబురైన కనుబొమ్మలు, లావైన పెదాలు, ఉబ్బెత్తుగా చెంపలు, చక్కని చుబుకం, చెవులకు ఘటి కుండలాలు, చేతులకు అయిదు వజ్రాలు పొదిగినట్టున్న కంకణాలు, భుజానికి, మోచేతికి మధ్య భుజకీర్తులు, మెడలో కంఠాభరణం ఉన్నాయి.

‘ఒక చేతిలో వేలాడుతున్న మేకపిల్ల, మరో చేతిలో సన్నని మూతిగల సొరకాయ బుర్రలాంటి నీటి కుండ, బలమైన బుజానికి వేలాడుతున్న గండ్రగొడ్డలి. మొల నుంచి చుట్టి మోకాళ్ళవరకు దిగిన సన్నని వస్త్రం. వస్త్రం ముడతలు కూడా స్పష్టంగా రాతిపై చక్కగా చెక్కారు. ఉద్దేశ్యపూర్వకంగా బహిర్గతం చేసిన జననాంగం. మూడు తలలు, నాలుగు చేతులు అన్న కాల్పనిక పౌరాణిక రూపం కాదు.
సౌమ్యంగా ఉన్న శివుడి తొలిరూపం ఇది. మానవ దేహానికి వాస్తవ రూపం.బ్రాహ్మణ దేవతల తొలి ఆకారం.
ఇక్కడ శివుడికి మూడవ కన్ను లేదు. యజ్ఞోపవీతం కూడా లేదు. కనుక ఇది రుగ్వేదకాలం నాటి రూపం అయివుండవచ్చు.
రుగ్వేద కాలంలో యజ్ఞోపవీతం లేదు.

‘సమపాదక స్థానక మూర్తి’ గా నిలబడిన పురుష దేవతలకు ప్రధానమైన ఆకారం.
తొలినాటి ఆలోచనల్లో ఉన్న భగవద్రూపాన్ని చెక్కారు. యక్షుడి బుజాలపై నిర్భయంగా నిలబడి అతన్ని భూమిలోకి అణగదొక్కుతున్న పరశురామేశ్వరుడు. యక్షుడంటే భూతలంపై సార్వభౌమాధికారం ఉన్న దేవుడు.శివుడి శ్వేదం నుంచే ఇతను పుట్టాడని ప్రాచీనుల నమ్మకం. యక్షుడు మోకాళ్ళపై ఉన్నాడు. శరీరం కుంగిపోయి ఉంది. పరశురామేశ్వరుడు అతని భుజాల పైకెక్కి తొక్కడం వల్ల బాధతో పళ్ళు బిగించి పెట్టాడు.

‘ముడిచిన కనుబొమ్మలు, అతని మెడలో రుద్రాక్షమాల, చేతికి కంకణాలు.
అగ్నిపర్వతం బద్దలై ఏర్పడిన లావా ఘనీభవించి శిలగా మారినప్పుడు ఆ శిల చాలా బలంగా ఉంటుంది.
అలాంటి ముదురు గోధుమవర్ణపు శిలతోనే ఈ శివలింగాన్ని, దాని పైన పరశురామేశ్వరుడి విగ్రహాన్ని, దాని చుట్టూ ఉన్న శిలాప్రాకారాన్ని అత్యద్భుతంగా చెక్కారు.

ఈ విగ్రహం అద్దమంత నునుపు తేలి ఉంటుంది.
పురాతన రచనల్లో రుద్రుడు, శివుడు దిగంబరుడే!
ఈ దిగంబర రూపం రుగ్వేదంలో ‘శిశ్నదేవ’ ‘మహానగ్న’ అయి ఉండవచ్చు.
భిక్షువు రూపం కూడా అయి ఉండవచ్చు.
శివలింగంపైన చెక్కిన దేవత పేరు పురాతన శాసనాల్లో ఎక్కడా లేదు.
క్రీస్తుశకం 1127లో విక్రమ చోళుడి కాలంలో ఆలయం గోడలపై ‘మహాదేవ పరశు రామేశ్వర’ అని చెక్కడం వల్ల దీనికి పరశురామేశ్వరాలయంగా పేరు వచ్చింది.

కళాత్మకమైన ఈ వేషధారణ అటవిక జీవితాన్ని తెలియచేస్తుంది.
పౌరాణిక రూపంకంటే కూడా వేదకాలపు మత ప్రతీకగా ఈ విగ్రహం కనిపిస్తుంది.
పొడవాటి ఈ శివ లింగానికి, అంగస్తంభనకు సంబంధం లేదు.
ఇందులో వ్యక్త, అవ్యక్త భావనలు మిళితమై ఉన్నాయి.
ఈ నగ్నరూపం ఎన్నో సందేహాలను లేవనెత్తుతోంది.
ఈ లింగానికి కింద యోని ఆకారంలో ఉన్న పానవట్టం లేదు.
దీన్ని నిలిబెట్టడానికి రెండు పీఠాలను అమర్చారు.

గుండ్రటి పీఠాల మధ్య పెద్ద రంద్రం చేసి, దానిలో నిలబెట్టారు.
ఈ రెండు రాతి పీఠాలు లింగం చేసిన కఠిన శిలతో కాకుండా ఇసుకరాయితో చేసినవి.
వాటి కింద భాగం దీర్ఘచతురస్రాకారపు పీఠం లాగా ఉంటుంది.
శివలింగం అసలు ఎత్తు అయిదున్నర అడుగులు.
పైకి కనిపించేది మాత్రం అయిదు అడుగుల అరఅంగుళం.
శివలింగం పైన దిగంబరంగా ఉన్న పరశురామేశ్వరుడి విగ్రహం 80 సెంటీమీటర్లుంటుంది.
అతని పాదాల కింద భూమిలోకి తొక్కుతున్నట్టున్న యక్షుడి విగ్రహం కేవలం 46 సెంటీమీటర్లుంటుంది.
శివలింగానికి చుట్టూ రాతితో శిలాప్రాకారం (రెయిలింగ్) ఏర్పాటు చేశారు.

ఈ శివలింగాన్ని చెక్కినప్పుడే క్రీస్తుపూర్వం 2, 3 శతాబ్దాలనాడే ఈ శిలాప్రాకారాన్ని కూడా నిర్మించారు.
బ్రాహ్మణీయ దేవాలయాల్లో ఇలా శిలాప్రాకారాన్ని నిర్మించడం ఇదే ప్రథమం.
లింగం చెక్కిన రాతితోనే ఈ శిలాప్రాకారాన్ని కూడా చెక్కారు.
తూర్పువైపున ఉన్న శిలాప్రాకారం కొంత మేరకు దెబ్బతిని ఉంది.
కొంత భాగం భూమిలోకి ఉంది. బహుశా ఈ శిలాప్రాకారం అభిషేకం చేయడానికి అయి ఉండవచ్చు.
దీని పైన పద్మ వృత్తాలు చెక్కి ఉన్నాయి. ఈ లింగాన్ని ప్రతిష్టించినప్పుడు దీనికి ఆలయం లేదు.
ఈ దేవతాకారం ముందు జంతుబలులిచ్చేవారు. శివుడు, రుద్రుడు సమానార్థాలు.
రుద్రుడు జంతుబలులను కోరేవాడు. అతని కోపాన్ని తగ్గించడానికి ఈ విగ్రహం ముందు జంతుబలులిచ్చేవారు.

క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నాటికి కప్పు లేకుండా ఆలయాలు నిర్మించేవారు.
క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నాటికి కూడా తిరుమలలో వేంకటేశ్వరుడి విగ్రహం కప్పు లేకుండా ఉంది.
కనుక ఈ లింగాకారానికి కూడా తొలుత పైకప్పు కానీ, చుట్టూ ఆలయం కానీ లేదు.
శాతవాహనుల కాలంలో మాత్రమే ఈ లింగానికి ఇటుకలతో ఆలయం నిర్మించారు.
ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా ఎలా ఉందో తెలియదు.
కాకపోతే ఈ ఆలయం నిర్మించిన తొలినాళ్ళలో ఆగమశాస్త్రాలు లేవు కనుక, ఆ తరువాత ఆగమ శాస్త్ర పద్ధతి ప్రకారం పునర్నిర్మించినట్టు భావించవచ్చు.

క్రీస్తుశకం 1127లో వేసిన శాసనం ప్రకారం విక్రమచోళుడు సింహాసనాన్ని అధిష్టించిన 9 సంవత్సరాలకు ఈ ఆలయాన్ని రాతితో పునర్నిర్మించాడు.

ఈఆలయం నిర్మించాక మూలవిరాట్టును కానీ, దాని చుట్టూ ఉన్న శిలాప్రాకారాన్ని కానీ ఏ మాత్రం మార్చలేదు.
ఏనుగు వెనుక భాగంలో ఉన్నట్టు అర్ధచంద్రాకారంలో గర్భగుడిలో మూలవిరాట్టుకు వెనుక గోడ నిర్మించారు.
ఆలయం అంతా చక్కగా చెక్కిన రాతితోనే నిర్మించారు.

గర్భగుడిని, దాని ముందున్న ముఖ పండపాన్ని, పైకప్పునూ రాతితోనే నిర్మించారు.
మహామండపాన్ని కూడా రాతితోనే నిర్మించారు.గర్భగుడిలో సున్నంతో చేసిన గచ్చును తీసేసి రాతిని పరిచారు.
ఈ సమయంలో మూలవిరాట్టును కానీ, దాని చుట్టూ ఉన్న శిలాప్రాకారాన్ని గానీ ఏమాత్రం కదల్చలేదు.
కాకపోతే శిలాప్రాకారంలో ఉన్న హెచ్చుతగ్గులను సరిచేశారు. పల్లవులు, చోళుల కాలంలో ఆలయ నిర్మాణంలో గణనీయమైన మార్పులు జరిగాయి.

ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆగమశాస్త్ర ప్రకారం అభిషేకాలు క్రమం తప్పకుండా జరగడం వల్ల నీళ్ళు బైటికి పోవడానికి మూలవిరాట్టుకు వెనుకభాగంలో పడమర దిశగా శిలాప్రాకారానికి కింద నుంచి స్నపన ద్రోణిని (సన్నని తూము) ఏర్పాటు చేశారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నృత్యగణపతిని చెక్కారు.

గర్భగుడికి వెలుపల, ఆరాధనా మండపానికి లోపల పై భాగంలో గాలి, వెలుతురు కోసం గవాక్షాలు ఏర్పాటు చేశారు.
ఆలయానికి తూర్పువైపున, నైరుతి వైపున ఉన్న ద్వారాలను గ్రానైట్ రాళ్ళతో మూసివేశారు.
దక్షిణ దిశగా ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

గర్భగుడి పల్లంలో ఉండడం వల్ల స్వర్ణముఖి పొంగినప్పుడల్లా ఈ తూముగుండా నది నీళ్ళు ఆలయంలోకి వచ్చేవి.
దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న మహామండపాన్ని కూడా రాతితో నిర్మించారు.
పై కప్పు అంతా రాతితో కప్పి ఉంది. ఆలయానికి సహజంగా ఉండే ద్వారపాలకులు లేరు.
ఈ ఆలయ నిర్మాణం అంతా చోళుల కాలం నాటి వాస్తు పద్ధతిననుసరించి ఉంది.
గర్భగుడి పైన ఉన్న గోపురంపైన లింగాకారంలో విమానం ఉంటుంది.
ఆలయం చుట్టూ ఎత్తైన ప్రాకారాన్ని చెక్కిన రాతితో నిర్మించారు. ప్రాకారంలో ప్రధాన ఆలయం చుట్టూ అనేక చిన్న చిన్న ఉపదేవతల ఆలయాలు ఉన్నాయి.

స్వర్ణముఖినది ఒడ్డున జరిపిన తవ్వకాల్లో దొరికిన వెండినాణేలు మౌర్యుల కాలం నాటివి.
ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు శాతవాహనుల కాలం నాటివి.

గుడి వద్ద దొరికిన శాసనాలను బట్టి క్రీస్తు శకం 845 నుంచి క్రీస్తు శకం 1801వరకు ; రాజా దామెర వెంటప్ప నాయుడి పాలన వరకు ఈ లింగం నిత్య పూజలందుకుంది.

క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు పూజలందుకుంటున్న ఏకైక హైందవ దేవాలయం గుడిమల్లం పరశురామేశ్వరాలయం.
క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి, క్రీస్తు శకం మూడవ శతాబ్దం వరకు ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా తూర్పు ఆంధ్ర తీరప్రాంతంలో ఆంధ్రుల సాంస్కృతిక జీవితంలోకి బౌద్ధ మతం ప్రవేశించింది.
బౌద్ధం ప్రవేశించడానికి ముందు గాని, ప్రవేశిస్తున్న సమయంలో గాని శివలింగం పైన చెక్కిన పరశురామేశ్వరుడి విగ్రహం ఉనికిలోకి వచ్చింది.
సింధూనాగరికతా కాలంలో లింగారాధన ఉన్నదని మనం కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, మొహెంజదారో తవ్వకాల్లో రాతితో చెక్కిన లింగం, యోని ఆకారాలు బైటపడ్డాయని సంకాలియా అనే పురాతత్వ శాస్త్రవేత్త అంటారు.

మొహెంజదారో తవ్వకాల్లో బైటపడిన పశుపతికి ఈ పరమేశ్వరుడికి పోలికలున్నాయని సర్ జాన్ మార్షల్ అనే చరిత్రకారుడు అంటారు.
ఈ శివలింగం గురించిన ఎన్ని ఆలోచనలు సంఘర్షించినప్పటికీ బ్రాహ్మణ దేవతల్లో ఇది తొలినాటి రూపమనడంలో ఎటువంటి సందేహం లేదు.

లింగం చుట్టూ ఉన్న శిలాప్రాకారం చుట్టూ చెక్కిన కమలం లాంటి గుర్తులు అశోకుడి ధర్మచక్రాన్ని పోలి ఉన్నాయి.
ఈ రకమైన ఆనవాళ్ళు ఎక్కువగా బౌద్ధ నిర్మాణాల్లోనే కనిపిస్తాయి. సాంచి, అమరావతి, బర్హట్ వంటి బౌద్ధ చైత్యాలను ఈ దేవాలయం పోలి ఉంది. ఇలాంటి నిర్మాణాలు హైందవ దేవాలయాల్లో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి.

మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ జయయౌధేయ రాసే నాటికి గుడిమల్లం నగ్న శివలింగం గురించిన పురావస్తు తవ్వకాలు జరగలేదు. సరైన చారిత్రక విషయాలు బైటికి రాలేదు.
అందుకునే ఈ నగ్న రూపాన్ని చూసి అసహనంతో ఈ నవలలో పేర్కొన్నట్టు భావించవచ్చు.

(గ‌మ‌నిక – కాకినాడ‌లో శ‌నివారం ఆవిష్క్ర‌త‌మైన రాహుల్ సాంకృత్యాయ‌న్ (వ్యాస సంక‌ల‌నం)లో అచ్చ‌యిన క‌థ‌నం)

Aluru Raghava Sarma
Aluru Raghava Sarma

 

(ఆలూరు రాఘవ శర్, రచయిత, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *