(టి. లక్ష్మీనారాయణ)
1. మా స్వగ్రామం కె.కందులవారిపల్లి, కోడూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని చిట్వేలి మండలంలో ఉన్నది. 2022 ఏప్రిల్ 4వ తేదీ వరకు కడప జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఉన్నది.
2. ప్రజల సౌకర్యార్థం, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల పునర్విభజన చేయడం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, మా కోడూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం పర్యవసానంగా జిల్లాల పునర్విభజన చాలా అసౌకర్యంగా పరిణమించింది.
3. రాజకీయ వాసనలులేని, పద కవితా పితామహుడు అన్నమయ్య పేరు జిల్లాకు పెట్టడం ముదావహం. కోడూరు, రాజంపేట, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లి శాసనసభ నియోజకవర్గాలతో కక్షలు – కార్పణ్యాల చరిత్ర వాసనలులేని ప్రాంతాలతో నూతన జిల్లా ఆవిర్భవించింది.
4. అన్నమయ్య జిల్లాలో ప్రకృతి అందాలకు, ఖనిజ మరియు అటవీ సంపదకు కొదవలేదు. అడవులు, కొండలు, కోనలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టి పడుతున్న ప్రాంతం. పెన్నా నదికి ఒక ప్రధాన ఉపనది అయిన చేయ్యేరుకు ఉపనదులైన పింఛా, గుంజన వంటి చిన్న చిన్న నదుల సోయగాలు జిల్లా రామణీయకతను కనుల విందు చేస్తున్న ప్రకృతి వరప్రసాదాలు. మా గుంజన వ్యాలీ ప్రాంతం కొనసీమను తలపించేది. రెండు, మూడు దశాబ్దాల నుండి వరుస కరవులతో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల కొన్ని గ్రామాల పరిధిలో దాదాపు వెయ్యి అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్ళు లభించని దుస్థితి నెలకొన్నది. త్రాగు నీళ్ళు కూడా కొనుక్కొని కాలం గడుపుతున్నారు. గడచిన రెండేళ్లు వర్షాలు బాగా పడి, గుంజన ప్రవహించి, కాస్తా ఊరట లభించింది.
5. మా జిల్లా కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దులు కలిగి ఉన్నది. దట్టమైన అడవుల మధ్య నిర్మించబడిన, వొంపు సొంపులు వలకబోస్తున్న చిట్వేలి – రాపూరు, గువ్వల చెరువు – కడప “గాట్ రోడ్డులు”, బాలుపల్లి అడవులను చీల్చుకొంటూ తిరుపతి వైపు పరుగులు తీస్తున్న రైలు – రోడ్డు మార్గాలు, నందలూరు – ఒంటిమిట్ట మార్గంలో ఉన్న చిట్టడవులు – కొండల వరుస, పీలేరు – తిరుపతి మార్గంలోని తలకోన అటవీ ప్రాంతం, దర్శనీయ స్థలాలైన తాళ్ళపాక, అత్తిరాళ్ల, గుండాలకోన, వాగేటికోన, వగైరా అన్నమయ్య జిల్లా అందచందాలకు వన్నె తెస్తున్నాయి. ఇరుగు పొరుగు జిల్లాలలోకి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ప్రయాణించేటప్పుడు వర్ణనాతీతమైన అనుభూతిని పొందవచ్చు.
6. కోడూరు, రాజంపేట ప్రాంతాలు పచ్చదనం తొణికిసలాడే ఆహ్లాదకరమైన తోటలు మనసునెంతో హాయిగొలుపుతాయి. రైతులు బహుళ పంటలు పండించే ప్రాంతం. అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ వంటి పండ్ల ఉత్పత్తికి, పసుపు లాంటి వాణిజ్య పంటలు, ధాన్యం, వగైరా వ్యవసాయ ఉత్పత్తులకు రైతులు ప్రాధాన్యత ఇస్తుంటారు. ‘ఫ్రూట్ నర్సరీ’కి కోడూరు ప్రాంతం ప్రసిద్ధి గాంచినది. కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్య జీవన్మరణ సమస్యగా పరిణమించింది.
7.”అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని” అన్న నానుడిగా భూగర్భ జలాలు నానాటికి అంతరించి పోవడం, పాలకుల పుణ్యమాని కృష్ణా నదీ జలాల తరలింపులో క్షమించరాని జాప్యం పర్యవసానంగా అన్నమయ్య జిల్లాలోని కోడూరు, రాజంపేట, రాయచోటి, మదనపల్లి ప్రాంతాలకు తీరని అన్యాయం జరిగింది. భూగర్భ జలాలపై ఆధారపడిన బావుల క్రింద సేద్యమే జీవనాధారం. చెరువులున్నా వర్షాభావ పరిస్థితులు, మరమ్మత్తులు చేయకపోవడం పర్యవసానంగా చాలా వరకు నిరుపయోగంగా మారిపోయాయి.
8. చేయ్యేరు, వెలిగల్లు, పింఛా పథకం లాంటి చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నా వాటి ప్రయోజనాలు చాలా పరిమితం. ఇటీవల, చాలా అరుదుగా సంభవించిన భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహించిన వరద నీటిలో పింఛా, చేయ్యేరు ప్రాజెక్టులు తెగిపోయి, ముప్పయ్ మందికిపైగా వరద నీటిలో కొట్టుకుపోయారు.
9. మదనపల్లి – రాయచోటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే హంద్రీ – నీవా సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణం నత్తలతో పోటీ పడుతుంటే, రాజంపేట – కోడూరు ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే గాలేరు – నగరి సుజల స్రవంతి రెండవ దశ నిర్మాణాన్ని ప్రభుత్వం అటకెక్కించింది. జిల్లాను సమగ్రాభివృద్ధి వైపు అడుగులు వేయించాలన్నా, సస్యశ్యామలం చేయాలన్నా, మూడున్నర దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న గాలేరు – నగరి (రెండవ దశ) మరియు హంద్రీ – నీవా ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
10. జిల్లా ప్రజానీకానికి వ్యవసాయమే జీవనాధారం. స్థిరమైన జలవనరులు లేకపోవడంతో సేద్యం చేసి, బ్రతికి బట్టకట్టలేక, గల్ఫ్ దేశాలకు, మన దేశంలోని వివిధ మహానగరాలకు పదుల వేల సంఖ్యలో వలసలు వెళ్లారు. ఒక విధంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస కార్మికుల ఆదాయమే కోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల ప్రజలకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్నదనడంలో అతిశయోక్తి కాదు.
11. పాలకుల వివక్షతకు ఈ ప్రాంతం దశాబ్దాలుగా గురౌతున్నది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రయివేటు రంగంలో కూడా చెప్పుకోతగ్గ పరిశ్రమ ఒక్కటీ లేదు. నందలూరు ఆల్విన్ రిఫ్రిజిరేటర్స్ ఫ్యాక్టరీని దశాబ్దాల క్రితమే మూసేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్న “మంగంపేట గ్రే-బెరైటీస్” ఖనిజ సంపద నిక్షేపాలకు నిలయం. స్వర్ణ కలపగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన “ఎర్రచందనం” నల్లమల అడవుల్లో పుష్కలంగా లభిస్తుంది. ఖనిజ నిక్షేపాలు, అటవీ సంపద, వ్యవసాయోత్పత్తులను ముడిసరుకుగా వినియోగించుకొని పలు పరిశ్రమలు స్థాపించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నా గత ప్రభుత్వాలు ఆ వైపు ఆలోచనే చేయలేదు. భవిష్యత్తులోనైనా అందుబాటులో ఉన్న ఈ వనరుల ఆధారంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలోనైనా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కార్యాచరణను అమలు చేయాలి. ప్రజా చైతన్యం మీదే ఈ జిల్లా ప్రగతి ఆధారపడి ఉన్నది.
12. విద్యా రంగంలోను బాగా వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్నది. విశ్వవిద్యాలయం లేదు. వైద్య కళాశాల లేదు. మదనపల్లి శానిటోరియం క్షయ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ చికిత్స అందిస్తున్న ఆరోగ్య కేంద్రంగా ప్రఖ్యాతిగాంచింది. 1915లో ఊడ్స్ నేషనల్ కాలేజీగా నెలకొల్పబడి, తర్వాత కళాశాల వ్యవస్థాపకులు డా.అనీ బీసెంట్ మరణానంతరం బీసెంట్ థియొసాఫికల్ కాలేజీ(బి.టి. కాలేజీ)గా నామకరణం చేయబడిన దాదాపు 107 సం. చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థ అన్నమయ్య జిల్లాలో ఉన్నది. కానీ, ఇప్పుడు ఆ కాలేజీ మనుగడే ప్రశ్నార్థకంగా మారి, తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది.
ఇది కూడా చదవండి
13. సాహిత్య – సాంస్కృతిక రంగాల్లో ప్రసిద్ధి చెందిన నేల. అన్నమాచార్యుల జన్మస్థలం తాళ్ళపాక, రాజంపేట సమీపంలో ఉన్నది. ప్రసిద్ధి చెందిన సురభి నాటక సమాజానికి పుట్టినిల్లు సురభి గ్రామం రాయచోటి ప్రాంతంలోనే ఉన్నది. ఒకనాడు తెలుగు నాట ప్రసిద్ధిగాంచిన కమ్మూ సాహెబ్ – శ్యామల బుర్రకథ దళం రాజంపేట. కోడూరు – రాజంపేట ప్రాంతం జనం పలుకు ఓ తీరున ఉంటే మదనపల్లి జనం మాట మరో తీరున ఉంటుంది. వాడుక భాష మాండలికంలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది.
14. రాజంపేట లోక్ సభ నియోజకవర్గం. విజయవాడ, హైదరాబాదు, ముంబాయి, చెన్నయ్, తిరువనంతపురం నగరాలకు రైలు మార్గం ఉన్నది. హైదరాబాదు – చెన్నయ్ జాతీయ రహదారి ఉన్నది. రాజంపేటను జిల్లా కేంద్రం చేసి ఉంటే సముచితంగా ఉండేది. మదనపల్లి, తంబళ్లపల్లె, పీలేరు శాసన సభ నియోజకవర్గాల ప్రజలకు రాజంపేట దూరమే. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాకు రాయచోటి నడిబొడ్డులో ఉన్నది. అదొక్కటి మినహా మరొక సానుకూల అంశమే లేదు.
15. రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం అసౌకర్యం అనుకొన్నప్పుడు మదనపల్లిని జిల్లా చేసి, శాసనసభ నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకొని రాయచోటిని మదనపల్లి జిల్లాలోను, రాజంపేటను కడప జిల్లాలోను (ప్రస్తుతం ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను ఎటూ కడప జిల్లాలో చేర్చారు), కోడూరును తిరుపతి జిల్లాలో చేర్చి ఉంటే (కోడూరు – తిరుపతి 50 కి.మీ., కోడూరు – రాయచోటి 90 కి. మీ.) హేతుబద్ధంగాను, అందరికీ సౌలభ్యంగాను ఉండేది. భవిష్యత్తులో జరిగే శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతనే ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆకాంక్షిస్తున్నాను.
(టి. లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)