ఫూలే గురించి అంతా తెలుసుకోవాలి, ఎందుకంటే…

ఈ దేశంలో విద్యని సార్వ జనీనం చేసేందుకు అంటే అన్ని కులాలకు, మహిళలకు నేర్పాలని  పోరాడిన సంస్కర్త మహాత్మా జ్యతిరావు ఫూలే.  ఏప్రిల్ 11వ తేది ఆయన జయంతి.

ఫూలేను పరిచయం చేసుకుందాం-పది మందికి పరిచయం చేద్దాం’

(మలసాని శ్రీనివాస్)

 

“ఇప్పుడు అయితే విద్య సర్వ సమస్యలనుండి విముక్తం చేసే ఏకైక సాధనం” అని అందరూ అంగీకరిస్తున్నారు. మనిషిని నిండైన వ్యక్తిగా తీర్చిదిద్దే అంతటి ముఖ్యమైన చదువు  200 క్రితం వరకూ ఈ దేశంలో ఎస్సీ,బీసీ, ఎస్టీలుగా పిలవబడే పనిచేసే కులాలకు నిరాకరించబడింది. ఈ దేశంలో విద్యని సార్వ జనీనం చేసేందుకు అంటే అన్ని కులాలకు, మహిళలకు నేర్పాలని  పోరాడిన సంస్కర్త మహాత్మా జ్యతిరావు ఫూలే.  ఏప్రిల్ 11వ తేది ఆయన జయంతి.

జంధ్యాలు ధరించే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులస్థులకు మాత్రమే చదుకునే హక్కు ఉందని మన సామాజిక వ్యవస్థ శాసించింది.

ఆ దుర్మార్గ శాసనానికి ఆధారం వేదాలు, పురాణాలు, శాస్త్రాలలో ఉందని నాటి బ్రాహ్మణులు నిస్సిగ్గుగా ప్రచారం చేసేవారు. దాని ఫలితమే శ్రమ చేసినా మంచి బతుకు దక్కని జీవితం అనుభవించారు మన పేద కులాల ముత్తాతలు,ముత్తమ్మలు.

చరిత్రలో జరిగిన ఆ నేరమే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో మెజారిటీ ప్రజలకు నేటికీ శాపమై పీడిస్తోంది. శిలను శిల్పంగా చేసినట్టు మనిషిని తీర్చిదిద్దే విద్యా హక్కునే లేకుండా చేసిన వాళ్ళు ఈ కులాలకు ఆస్థి హక్కు మొదలు ఏ హక్కులు లేకుండా ధర్మశాస్త్రాల పేరిట సమాజాన్ని పాలించారు.

అదిగో…..ఆ దుర్మార్గ పరిస్థితులు నుంచి ఒక అగ్ని పర్వతం బద్దలైనట్లు 1827లో ఒక మహాత్ముడు జనించాడు. నల్లనిబురదలోంచి తెల్లని తామర ఉద్భవించి “మనుషులందరూ సమానమే”అన్నాడు. ఈ సమానత్వం సాధన కోసం మొదటిగా విద్య అందరూ నేర్చుకోవాలన్నాడు.

ఆ హక్కు అందరికీ దక్కడం కోసం విప్లవకారుడై మహోజ్వలమైన పోరాటం నడిపాడు. అప్పుడు పోరాటం చేసి చదువుకునే హక్కును సాధించిన ఈ దేశపు పేద కులాల ఉద్ధారుకుడు మహాత్మా జ్యతిరావు ఫూలే జయంతి ఏప్రిల్ 11వ తేది. ఫూలే చనిపోయిన ఒక ఏడాది తర్వాత జన్మించి సమసమాజ స్ధాపనకు మార్గం చూపిన డాక్టర్ అంబేద్కర్ ఫూలేను తన గురువుగా స్వీకరించి కీర్తించారు. ఫూలే పోరాట లక్ష్యం ఈ దేశంలో ఇంకా నెరవేరలేదు. అది నెరవేర్చుకోవలసిన బాధ్యత సమాజ అభివృద్ధిలో వెనుక ఉంచబడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలమైన మనపైవుంది. ఫూలే జయంతి సందర్భంగా ఆయన బోధించిన విషయాలను తెలుసుకుందాం, మన జనానికి తెలియజేద్ధాం. రండి….వాడవాడలా పండుగలా ఫూలే జయంతోత్సవాలు నిర్వహిద్దాం. జోహార్ మహాత్మా ఫూలే.

(ఈ నెల ఏప్రిల్ 11వ తేది ఫూలే జయంతి సందర్భంగా రాసిన కరపత్రం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *