రాయలసీమకు మళ్ళీ అన్యాయం!

 

ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పునర్వ్యవస్థీకరణ స్ఫూర్తికి విరుద్ధం. రాయలసీమ లో జిల్లాల సంఖ్యను పెంచకుండా ప్రభుత్వం  వివక్ష చూపింది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి

 

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదిక వెనుకబడిన తరగతులు , ప్రాంతాల అభివృద్ధికి అనుకూలంగా , మొత్తం ప్రక్రియలో రాష్ట్ర నిష్పత్తిలో కొంత వెసులుబాటు కూడా ఇవ్వాలి.

కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. రాష్ట్ర జనాభాలో రాయలసీమ విస్తీర్ణం 42 శాతం , జనాభా 32 శాతం కాగా ఎమ్మెల్యేల సంఖ్య రిత్యా 35 శాతం ఉన్నది. ఏ కోణంలో చూసినా 12 జిల్లాలు చేయాలి.

అందుకు భిన్నంగా ప్రభుత్వం 8 జిల్లాలకు పరిమితము చేయడం వల్ల రాయలసీమకు నష్టం జరిగింది. రాయలసీమకు మినహాయింపు ఇచ్చి జిల్లాల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం ఆచరణలో వివక్ష చూపింది.

26 జిల్లాల తర్వాత రాష్ట్ర సగటు విస్తీర్ణం 6 వేల చదరపు కిలోమీటర్లు ఉంటే రాయలసీమ జిల్లాలు 9 వేల చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లా 11 వేల చదరపు కిలోమీటర్లుగా ఉండటం అభ్యంతరకరం.

వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ మండలాలు. అభివృద్ధి చెందిన జిల్లాల్లో తక్కువ మండలాలు.

సాధారణంగా పరిపాలన వెనుకబడిన ప్రాంతాలు , తరగతులు ఉన్న చోట కేంద్రీకరణ ఉండాలి. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ ముఖ్యం. అందుకుగాను పరిమితమైన ప్రాంతంతో జిల్లాలు ఉండాలి.

కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా చేసింది. వెనుకబడిన రాయలసీమ , ప్రకాశం , శ్రీకాకుళం జిల్లాలలో 30 మండలాలు దాటితే అభివృద్ధి చెందిన కోస్తా ఆంధ్రలో 20 – 25 మండలాలు ఉండేలా చేయడం విచిత్రంగా ఉంది. ఫలితంగా ఏ మంచి ఉద్దేశ్యంతో చారిత్రక నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రయోజనం కలగదు.

కేంద్రం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం విడుదల చేసే నిధులను అందుకోవడంలో నష్టం జరుగుతుంది.

ప్రజాభిప్రాయానికి కనీస విలువ లేదు..

కీలకమైన జిల్లాల ఏర్పాటు అందరి ఆమోదంతో జరగాలి. అపుడే దాని మనుగడ ఉంటుంది. వైసిపి ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఎక్కడా ప్రజాస్వామ్య పద్ధతి పాటించలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో హేతుబద్ధమైన వాటిని పరిశీలించి అలాంటి వారితో నేరుగా చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఒక్క చోట కూడా అమలు కాలేదు.

రాయలసీమ మేధావుల ఫోరంగా బాద్యతయుత ప్రయత్నం చేసి శాస్ర్తియ పద్దతిలో 10 జిల్లాలను ప్రతిపాదించింది.

ఈ క్రమంలో మదనపల్లె , ఆదోని లను జిల్లాలుగా , నందికొట్కూరును కర్నూలులో కలపాలని అదేవిధంగా మరో వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లాలో వెనుకబడిన మార్కాపురంను జిల్లాగా కందుకూరును ఒంగోలు జిల్లాలో కలపాలని ప్రతిపాదించాము.

రాయలసీమను 10 జిల్లాలుగా చేసినా 7 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం , 20 లక్షల జనాభా ఉంటుంది. ఇది కూడా రాష్ట్ర సగటుకు ఎక్కువే అయినా ఏ అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా మాకు అధికారం ఉంది చేస్తాం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించిందే తప్ప ఏ కోసానా రాజనీతిని ప్రదర్శించాలేదు.

ప్రభుత్వం వ్యవహారశైలిని పరిశీలిస్తే సాంకేతిక అవసరం కోసం ముసాయిదా , అభ్యంతరాలను స్వీకరించింది తప్ప ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వడానికి కాదన్నది అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి నిర్ణయాలు పది కాలాల పాటు నిలబడవు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో రాయలసీమ ప్రాంతానికి చేసిన అన్యాయానికి రాజకీయ ప్రతిఫలం వైసిపి చెవిచూడక తప్పదు.

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *