ఆంధ్రా కొత్త జిల్లాలు, మంచి- చెడు

OPNION

(టి.లక్ష్మీనారాయణ)

జిల్లాల పునర్విభజన స్థూలంగా మంచి చర్య. పదమూడు నూతన జిల్లాల ఆవిష్కరణ తదనంతరం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “గ్రామం మొదలు రాజధానుల వరకు వికేంద్రీకరణే మా విధానమని”, పునరుద్ఘాటించడం అర్థరహితం, బాధ్యతారాహిత్యం, అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హైకోర్టు తీర్పుపై ధిక్కార స్వరం వినిపించినట్లుగా భావిస్తున్నాను.

జిల్లాల పునర్విభజన అంశానికి సంబంధించి భవిష్యత్తులో విధిగా కొన్ని మార్పులు చేసుకోవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ప్రకారం శాసన సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ముందుగా పూర్తి చేసిన మీదట శాసన సభ నియోజకవర్గాల ప్రాతిపదికపైన జిల్లాల పునర్విభజన చేసి ఉంటే మరింత సహేతుకంగా, హేతుబద్ధంగాను ఉండేది.

గతంలో లోక్ సభ నియోజకవర్గాలు మాత్రమే రెండు జిల్లాలలో విస్తరించి ఉండేవి. నేడు చేసిన జిల్లాల పునర్విభజనతో 12 శాసనసభ నియోజకవర్గాలు రెండు జిల్లాలలో విస్తరించి ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు. అందువల్ల, ఈ కారణంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తదనంతరం అనివార్యంగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలపై ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా చేసిన విజ్ఞప్తులపై రాగద్వేషాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించలేదని స్పష్టమయింది. దీనికి ప్రబల నిదర్శనాలు, మార్కాపురం జిల్లా, రాజంపేట మరియు హిందూపురంలను జిల్లా కేంద్రాలుగా చేయాలన్న ప్రజల డిమాండ్ల పట్ల తృణీకారభావంతో ప్రభుత్వం వ్యవహరించింది.

T Lakshminarayana
T Lakshminarayana

(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *