పాక్ అవిశ్వాస తీర్మానంలో కలవరపరిచే కోణం!

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

మన పొరుగు దేశం పాకిస్థాన్ లో కొత్త హాట్ టాపిక్ అట్టుడికి పోతోంది. అదే  బెదిరింపు లేఖ (Threat letter) వార్త!

ఇప్పుడు ఏ దిన పత్రిక తిరగేసినా, అంతర్జాతీయ వార్తల్లో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ పై పాకిస్థాన్ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై వార్తలే మనకు కనిపిస్తున్నాయి.

నేషనల్ అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఉన్నాయో, ఎవరెవరు కలిస్తే, ఈ అవిశ్వాస తీర్మానం వీగుతుందో లేదంటే నెగ్గుతుందో వివరాలతో వార్తలు వస్తున్నాయి. ఈ సంచలన వార్తల మధ్య మరో ముఖ్యమైన వార్త మరుగున పడుతోంది. అది ఉద్దేశ్యపూర్వకమా? లేదా యాదృచ్చికమా? అనేది ఆలోచించాల్సిన విషయమవుతుంది. తీర్మానం ఈ రోజు సాయంకాలం పార్లమెంటులో చర్చకు వచ్చింది.

ఆయా దేశాల్లో ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు సహజమే. నిజానికి ఇవేవీ విశేష వార్తలు కావు. అదో సామాన్య వార్త మాత్రమే! పైగా పాకిస్థాన్ మాటకు వస్తే, అదో అతి సాధారణ విషయమే! దానికంటే పాకిస్థాన్ రాజకీయాల్లో వినిపించే తాజా Threat Letter వార్త అనేకరెట్లు ప్రాధాన్యత గలది. నేడు సామాన్య వార్త (simple news) అసాధారణ వార్త (Abnormal news) గా ప్రాచుర్యం పొందుతోంది. పాకిస్థాన్ లో అసాధారణ వార్త భారత్ లో కనీస వార్తగా కూడా ప్రచారం కావడం లేదు. అందుకే దీన్ని పరిశీలిద్దాం.

నా సర్కార్ ఎవరి వత్తిళ్ళకి తలవంచక స్వతంత్ర విదేశాంగ విధానం చేపట్టింది. నా సర్కార్ పై కొంత కాలం గా బయటి నుండి తీవ్ర వత్తిళ్ళు వస్తున్నాయి. వాటికి లొంగడం లేదని నా సర్కార్ కూల్చివేతకి కుట్ర జరుగుతోంది. నా సర్కార్ పై అవిశ్వాస తీర్మానం వెనక బయటి దేశపు  కుట్ర ఉంది.


పార్లమెంటు వాయిదా

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం గురించి చర్చించేందుకు నేషనల్ అసెంబ్లీ సాయంకాలం ఆరు గంటలకు సమావేశమయింది.అయితే, ప్రతిపక్ష పార్టీ గొడవ చేయడంతో  స్పీకర్ సభని ఏప్రిల్ మూడో తేదీకి వాయిదా వేశారు.

 


గత ఆదివారం ఒక బహిరంగ ప్రదర్శనని ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధానమంత్రి చేసిన సంచలన వ్యాఖ్య యిది.

పాకిస్థాన్ అంటేనే అమెరికాకి ఓ పోస్టాఫీసు గా, అమెరికా అంటేనే పాకిస్థాన్ కి ఓ రాజకీయ ఊపిరిగా ఇంతవరకూ ప్రచారంలో ఉంది. ఇంకా పాకిస్థాన్ అంటే మూడు “A” లకు (అమెరికా, అల్లా, ఆర్మీ) ప్రతీక అనే ఒక రాజకీయ నానుడి ఉంది. అలాంటి పాకిస్థాన్ దేశానికి చెందిన ప్రధాని స్వయంగా పై ఆరోపణ చేయడం అసాధారణ రాజకీయ పరిణామం.

ఇమ్రాన్ ఖాన్ మరో అడుగు ముందుకు వేసి, తన సర్కార్ పై అవిశ్వాస తీర్మానం ఒకవేళ వీగిపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని ఒక పెద్ద దేశం చేసిన హెచ్చరికను వెల్లడి చేసాడు. పేరును ఉదహరించక పోయినా, ఆ పెద్ద దేశం అమెరికా అని అందరికీ తెల్సిన సత్యమే. దాన్ని నిన్న పాక్ జర్నలిస్టుల దృష్టికి కూడా తేవడం జరిగింది. దానికి సంబంధించిన Threat Letter ఒకటి ఉందని కూడా చెప్పాడు. దాన్ని ఈరోజు బహిర్గతం చేస్తానని కూడా వెల్లడి చేసాడు. దాని కోసం పాకిస్థాన్ ప్రజలు నేడు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

అవిశ్వాస తీర్మానాల్లో తమ సర్కార్లు వీగిపోయే ప్రతి సందర్భంలో ప్రతి సర్కార్ ప్రతిపక్షాల వెనక కుట్ర ఉందని ఇలాంటి ఆరోపణ చేయడం సహజమే. ఐతే ఇది తేలిగ్గా కొట్టిపారేసే సందర్భం కాదు. వర్తమాన ప్రపంచ రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని సాపేక్షిక దృష్టితో ఆలోచించాల్సిన సమయమిది. నేటి స్థల, కాలాదుల పై ఆధారపడి పరిశీలించాల్సిన నిర్దిష్ట సమయమిది.

మదపుటేనుగు వంటి ప్రపంచ పోలీసు అమెరికా మీద చలిచీమల వంటి ఒక బడుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ పేద ప్రజల సాయుధ తిరుగుబాటు విజయం పొందింది. ఆ నేపథ్య స్థితి వర్తమాన భౌగోళిక స్థితిగతుల్లో మౌలిక మార్పుల్ని తెస్తోంది. అనేక దేశాల విదేశాంగ విధానాల్లో అనూహ్యంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికాతో అంటకాగిన అనేక దేశాలు తమ పూర్వ విదేశాంగ విధానాల్ని క్రమంగా మార్చుకుంటున్నాయి. (దీనికి ఇండియా కూడా మినహాయింపు కాదు) అలా తన సాంప్రదాయ విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ కూడా ఇటీవల మార్చుకుంటోంది. ఈ నేపధ్యం నుండి ఇమ్రాన్ ఆరోపణను చూడాల్సి ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *