భారత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ రు. 150 వైపు దూసుకుపోతున్నాయి.దీన్నెవరూ ఆపలేరు. ఆపే ఉద్దేశం కూడా కేంద్రానికి గాని, రాష్ట్రాలకు గాని ఉన్నట్లు కనిపించదు. ఉత్తర ప్రదేశ్ తో పాటు మరొక నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నపుడు ధరలను కేంద్రం నిలకడగా ఉంచింది. ఇపుడు ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక ప్రధాని మోదీ ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ధరలకు కళ్లెం వదలేసింది. దీనితో ఈ ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా ఏడో రోజు పెరిగాయి. గత 9 రోజుల్లో ఎనిమిదో సారి ధరలు పెరిగాయి. ఎన్నికల కారణంగానో,మరో కారణంగానో మొత్తానికి 5 నెలల పాటు పెట్రోలు, డీజిల్ ధరలు పెరగలేదు. ఈ ఏడాది మార్చి 22 నుంచి పెరగడం మొదలయింది. ఇప్పటి వరకు వరసగా పెరుగుతూ లీటర్ కు . రు. 4.80 పైసలు పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీ గత ఏడాది జూలై 7న పెట్రోలు ధర రు. 100.21 చేరింది. అపుడు అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వాట్ ధరని 30 శాతం నుంచి 19.4 శాతానికి తగ్గించడంతో ధర రు. 100 కిందికి పడిపోయింది. ఈ ఉత్సాహం ఎక్కువ కాలంఉండలేదు. ఇపుడు మళ్లీ రు. 100 దాటింది.
నేడు లీటర్ పెట్రోల్‌పై 90పైసలు డీజల్ పై 87పైసలు పెరిగాయి.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.114.51, డీజిల్ లీటర్ రూ.100.70.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 101.01 & లీటర్ డీజిల్ రూ. 92.27.
ముంబైలో పెట్రోల్ రూ. 115.88/ltr, డీజిల్ రూ .100.10/ltr.
కోల్‌కతాలో పెట్రోల్ రూ. 110.52/ltr & డీజిల్ రూ. 95.42/ltr.
చెన్నైలో పెట్రోల్ రూ .106.69/ltr & డీజిల్ రూ. 96.76/ltr.