(అరణ్య శేఖర్)
ఉదయాన్నే లంకమలలో నిద్ర లేచి సూర్యోదయంతో మొదలై మధ్యాహ్నం నల్లమలలో బువ్వ తిని సాయంత్రం బ్రహ్మం సాగర్ లో సూర్యాస్తమయంతో ముగిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశావా గిబ్స్ ఇప్పుడు ఆ అనుభూతిని, దారి పొడవునా పొందిన అనుభవాలను చూసి అనుభవిద్దాం రాండి..
సూరీడు లంకమల కొండలను ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తూ తన కిరణాలకు అడ్డుగా నిల్చున్న చెట్లను, తెల్లవారు జాము కురిసిన మంచు దుప్పట్లను చేధించుకుంటూ వెచ్చటి కిరణాలను మాపై ఏకధాటిగా ప్రయోగించడం మొదలెట్టాడు. వెచ్చదనం కోసం ఎదురుచూసిన కుర్రతనాన్ని పొంది ఒళ్ళు విల్లులా విరుస్తుంటే ఈ వేషాలకేం తక్కువలేదు బిలం కోసం అక్కడ వెయిటింగ్ బ్రో అంటోంది మనసు. మిగిలిన వాళ్ళను త్వరగా రెఢీ అయ్యి రమ్మని చెప్పి అర్జున్ రెడ్డి హీరోలా బండి స్టార్ట్ చేసి వివేక్ అన్నను ఎక్కించుకుని నందిపల్లెకు బయల్దేరగా ఓరి మీ దుంపల్ తెగా మీరు ఆ సినిమాలో హీరో కాదు నేను బుల్లెట్ బండి అంతకన్నా కాదు అన్నట్లు ఆగిపోయింది..
అంతలో దాని వాలకం గమనించిన సిన్నోడు పోలీస్ సుబ్బాడ్డి అన్నకు ఫోన్ చేసి మేము ఎలాగోలా కిందా మీదా పడి కొత్త చెరువు దగ్గరకు వస్తాం రమ్మని చెప్పాడు. అక్కడ బండి పెట్టేసి వివేక్ అన్న ఇంటికి వెళ్ళగా రాయలసీమ పాతకాలపు ఫ్యాక్షన్ తరం నుండి నేటి ప్రకృతి ప్రేమికుల తరం వరకు ప్రతీదీ దగ్గర నుండి చూసిన అనుభవం ఉన్న కాశీపురం ప్రభాకర్ రెడ్డి అన్న వేడి వేడి కాఫీ తాగుతూ ప్రత్యక్షమయ్యాడు..
చక చకా రెడీ అయ్యి కాఫీలు, టిఫిన్లు చేసేసి బయల్దేరే సమయానికి ఒంగోలు గిత్త సాయి రాగా సింబాకు టాటా చెప్పి బ్రహ్మంగారి మఠం మీదుగా మల్లేపల్లి చేరాము. మాకంటే ముందుగా వచ్చిన భూమన్ సార్ ని కలిసి అక్కడి నుండి దూదెమ్మ కోన ఆర్చి వద్దకు ఎవరో వీఐపీ వస్తున్నట్లు కారెనక కారు వరుసగా రాగా ఎదురుగా మేరుపర్వతం వలే ధగ ధగా మెరుస్తూ కనిపించాడు నల్లమల సన్నపురెడ్డి సారు.
అప్పటికే అక్కడికి చేరిన మిత్రులందరినీ కలుసుకున్నాము. చూపరులకు అక్కడ పరిస్తితి ఎలా ఉంది అంటే మేము యాత్ర కోసం వచ్చినట్లు లేదు నల్లమల ప్రకృతి అందాలను దోచుకోవడానికి ఇచ్చిన దండయాత్ర పిలుపులా ఉంది. చిన్న చిన్న కార్లలోని వాళ్ళను అప్పటికే అక్కడికి వచ్చిన మిగిలిన కార్లలో ట్రాక్టర్లలో ఎక్కించి అందరూ వెళ్లారు అని నిర్ధారించుకున్న తర్వాత సన్నపురెడ్డి సారు బుల్లెట్టు బండిమీద వివేక్ అన్నతో పాటు నేను బయల్దేరాను.
మాకంటే ముందు వెళ్తున్న బండ్లు రేపుతున్న దుమ్ము కాస్తా మా ముఖాలకు పౌడర్ రాసినట్లు అవుతుండటంతో బిలం వద్దకు చేరాక మనల్ని ఎవరూ గుర్తుపట్టడం పక్కనపెడితే ఏ అడవి జంతువో వచ్చిందని కొట్టినా కొడతారు గిబ్స్ అని మా రథాన్ని ఉరికెత్తించగా త్వరగానే మా ముందున్న అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటేశాము.
నాకు సఫారీ జర్నీ కొత్త కాబట్టి అక్కడి ప్రదేశాలను మదిలో లిఖించుకుంటూ వస్తుంటే వివేక్ అన్న తన వాక్చాతుర్యంతో తన గత సఫారీ అనుభవాలను దీనితో పోలుస్తూ ప్రభుత్వం కాస్త బాధ్యత తీసుకుంటే మన రాష్ట్ర పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా త్వరగా అభివృద్ధి చెందుతుందని వివరించసాగాడు..
కొద్ది దూరం వరకు సాఫీగా సాగిన ప్రయాణం కాస్తా సుబ్బారెడ్డి అన్న పోటీకి రావడం వల్ల రెండు చిరుతల మధ్య పోటీకి నల్లమల వేదికలా అయ్యింది. ఆకురాలిన చెట్ల మధ్యలో అడవంతా బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఈ సమయంలో పెద్ద పులి ఒకసారి కనిపిస్తే ఎంత బాగుంటుందో అని ఊహల్లో తేలిపోతూ, అనకొండలా నల్లమల నోరు తెరవగా అందులో మెలికలు తిరుగుతూ ఉన్న దారిలో మండు వేసవిలో సైతం రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు తోరణంలా మేము వెళ్తున్న మార్గాన్ని అల్లేసి స్వాగతం పలుకుతున్నట్లుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక తొలకరి చినుకులు పడ్డాక లేలేత ఇగుర్లతో అడవి ఇంకెంత అందంగా ఉంటుందో అనుకుంటూ ఆ ఆనంద క్షణాలను వర్ణించడానికి మాటలు రాక ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టడం మా పనయ్యింది..
భూమన్ సార్ ముందే ఫారెస్ట్ అధికారులకు విషయం చెప్పగా వారు అక్కడ కనిపించగానే దాదాపు 16 కిలోమీటర్ల ప్రయాణం క్షణాల్లో కనుమరుగైంది ఇంకా ఉంటే బాగుండు అనిపించింది ఆ క్షణం.. (సశేషం)
యాత్ర రెండో భాగం ఇక్కడ చదవండి