డాక్టర్ కావాలన్నది బయాలజీ తీసుకున్న చాలా మంది విద్యార్థుల జీవితాశయం. తల్లితండ్రుల కోరిక కూడా అదే. సమాజంలో డాక్టర్ కు ఉన్న గౌరవం, హోదా, ఉద్యోగం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకపోవడం, స్వేచ్ఛ రాబడి… దీనికి కారణం. అయితే, డాక్టర్ కోర్స్ చదువుతుండగా విద్యార్థుల లక్ష్యాలు మారిపోతున్నాయి. ఎంబిబిఎస్ అయిపోగానే, చాలా మంది డాక్టర్లు పిజి చేసి స్పెషలిస్టు కావాలనుకునే బదులు కలెక్టర్ కావాలనుకుంటున్నారు. సివిల్స్ పరీక్షల వైపు మొగ్గే డాక్టర్లు సంఖ్య ఈ మధ్య పెరుగుతూ ఉంది. ఇంజనీరింగ్ లో డిసిప్లిన్స్ నుంచి కూడా ఇలాంటి మైగ్రేషన్ కనబడుతున్నా, మెడికల్ సైన్సెస్ నుంచి ఇదొక ట్రెండ్ గా మారుతూ ఉండటమే ఆశ్చర్యం.
ఇటీవల సివిల్స్ (Civils) వైపు మళ్లే డాక్టర్ల సంఖ్య పెరుగుతూన్నట్లు లెక్కలు చెబుతాయి. అంతేకాదు, సివిల్స్ ఆప్షనల్స్ విషయంలో ఉన్న భ్రమలను తుత్తునియలు చేస్తూ మెడికల్ సైన్సెస్ ఆప్షనల్స్ తీసుకుని డాక్టర్లు సివిల్స్ కి సెలెక్టవుతున్నారు.
అంటే, సివిల్స్ లో సైన్సెస్ ఆప్షనల్ గా పనికి రావని, వాటిని తీసుకుంటే గట్టెక్కడం కష్టమనేనేది కేవలం భ్రమ మాత్రమేనని వారు రుజువు చేస్తున్నారు.
డాక్టర్లు సివిల్స్ కి ఎంపిక కావడం ఎపుడూ ఉన్నా ఈ మధ్య ఆదొక ట్రెండ్ మారింది. మీడియా రిపోర్టుల ప్రకారం సివిల్స్ కు ఎంపికయిన వారిలో మెడికల్ సైన్సెస్ ఆప్షనల్స్ తీసుకున్నవారి శాతం ఎక్కువగా ఉంది. పరీక్షకు హాజరయిన వారు సెలెక్టయిన వారి నిష్పత్తి తీసుకుంటే మెడికల్ సైన్సెస్ అభ్యర్థుల యుపిఎస సి (UPSC) సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది.
ఇదేదో ఒక సంవత్సరంలో ఎదురయిన విషయం కాదు. 2014 నుంచి తీసుకుంటే చాలా సంవత్సరాలలో మెడికల్ డాక్టర్లు సివిల్స్ కి ఎంపిక కావడం ఒక ట్రెండ్ అయినట్లు కనిపిస్తుంది. 2014లో మెడికల్ అభ్యర్థుల సక్సెస్ రేటు 20 శాతం. ఆ యేడాది సివిల్స్ మెయిన్ కు మెడికల్ సైన్సెస్ సబ్జక్ట్స్ తీసుకుని అప్పియర్ అయిన 356 మంది అభ్యర్థులలో 71 మంది ఎంపికయ్యారు. అంటే ఇది 20 శాతం. ఆ యేడాది మెడికల్ అభ్యర్థులు 19.9 శాతం మంది పాస్ అయే, లా తీసుకుని పాస్ అయిన వారు 17 శాతం, సైకాలజీ తీసుకుని నెగ్గిన వారు 15.8 శాతం.
ఇక 2015లో మెడికల్ సైడ్ నుంచి వచ్చి సివిల్స్ ఉత్తీర్ణులయిన వారు 20.2 శాతం. మొత్తం 327 మంది మెడికల్ సైన్సె స్ తో మెయిన్ రాస్తే 66 మంది సెలెక్టయ్యారు. ఆ యేడాది లా నుంచి 16.7 శాతం, ఫిజిక్స్ నుంచి 16.6 శాతం మంది పాస్ అయ్యారు. 2016లో 17 శాతం మంది మెడికల్ సైన్స్ సబ్జక్టు తీసుకుని సివిల్స్ కు ఎంపికయ్యారు. ఆయేడాది 368 మంది మెడికల్ సైన్సెస్ తీసుకుని మెయిన్స్ రాస్తే, ఇంటర్వ్యూ తర్వాత ర్యాంకులు పొందిన వారిలో డాక్టర్లు 61 మంది ఉన్నారు. మొత్తం సరాసరి తీసుకుంటే మెడికల్ అభ్యర్థుల 16.6 శాతం మంది పాస్ అవుతున్నారు. ఇది ఇతర అప్షనల్స్ కంటే చాలా ఎక్కువ. తర్వాతి స్థానాలు సైకాలజీ (15.6), కన్నడ లాంగ్వేజీ(15.6)లవి.
ఇలా డాక్టర్ కోర్సు పూర్తి చేసి సివిల్స్ ఎంపికయిన ఒక డాక్టర్ ఆకాంక్షా భాస్కర్. ఆమె పశ్చిమ బెంగాల్ క్యాడర్ ఐఎఎస్ అధికారి. డాక్టర్ ఆకాంక్ష కూడా ఈ ట్రెండ్ మొదలయిన 2015 బ్యాచ్ నుంచే వచ్చిన ఐఎఎస్ అధికారి
ఇంతకీ డాక్టర్లు ఎందుకు ఐఎ ఎస్ వైపు వస్తున్నారు?
పశ్చిమబెంగాల్ కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఎంవి రావు ఆమెకు ఇదే ప్రశ్న వేశారు. ఈ మధ్య డాక్టర్ రావు యువ ఐఎఎస్ అధికారులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్లు సివిల్స్ ఎందుకురాయాలనుకున్నారు, ఎవరు ఇన్ స్పిరేషన్, ఏ సబ్జక్టులు ఆప్షనల్స్ గా తీసుకున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు, కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ కావచ్చా, ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కొన్నారు, ఎంపికయ్యాక ఉద్యోగానికి ఎలా ఎడ్జస్ట్ అవుతున్నారు, ఉద్యోగంలో సవాళ్ల ఎదుర్కొంటున్నారనే విషయాల మీద ఇంట్వర్యూ చేస్తున్నారు. ఒక సీనియర ఐఎఎస్ అధికారి ఇలా జూనియర్ ల ను ఇంటర్వ్యూ చేయాలనుకోవడం,అంత తీరుబడి చేసుకోవడం ఎపుడూ జరిగి ఉండదు. డాక్టర్ ఇపుడు చీఫ్ సెక్రెటరీ ర్యాంకులో ఉన్నారు. అయినా సరే, ఆయన కిందికి దిగివచ్చి, జూనియర్ అధికారులను ఇంటర్వ్యూ చేస్తూ సివిల్స్ యాస్పిరాంట్స్ కు ప్రేరణ ఇస్తున్నారు. బహుశా యుపిఎస్ సి చరిత్రలో ఇలాంటి జరిగి ఉండదు. ఎంపికయినవారిని కోచింగ్ సెంటర్లు వాళ్లు, న్యూస్ పేపర్ల వాళ్లు ఇంటర్వ్యూ చేస్తారు గాని, సీనియర్ ఐఎఎస్ అధికారులు ఇంటర్వ్య చేయడం ఇదే మొదటి సారి అని నిర్ద్వంద్వంగా చెబుతున్నాం.
డాక్టర్ రావు ప్రశ్నకు డాక్టర్ ఆకాంక్ష ఏం సమాధానం చెప్పారు. ( అన్నట్లు డాక్టర్ రావు మెడికల్ డాక్టర్ కాదు.)
డాక్టర్ ఆకాంక్ష IAS సమాధానం
“ ఈ మధ్య చాలా మంది మెడికల్ గ్రాజుయేట్స్, పోస్టు గ్రాజుయేట్స్ సర్వీస్ (ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్)లోకి వస్తున్నారు. ఇది అభిలషనీయ పరిణామం. నేను కలకత్తాలో డాక్టర్ గా శిక్షణ పొందుతున్నపుడు, డాక్టర్ గా వారికి చికిత్స అందిస్తున్నపుడు వచ్చిన ఆలోచన ఇది. రోగాలకు చికిత్స చేయడమే కాదు, వీళ్ల జీవితాలలో మార్పులు తీసుకువచ్చే పొజిషన్ లో నేనుంటే బాగుంటుంది, ఆ రోగులను చూశాక నాకు అనిపించింది. అసలు ఈ రోగాలు రాని పరిస్థితి సృష్టిస్తే బాగుంటుంది కదా. అంటే వీళ్లకి సరైన మంచి నీళ్ల వసతి వుంటే విరేచనాల వంటి జబ్బు రాదు. అలాగే మంచి రోడ్లు ఉంటే యాక్సిడెంట్స్ కావు. ఇలాంటి వసతులు కల్పించే హోదా గురించి నేను అప్పటినుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకువచ్చే శక్తి ఉండే హోదా గురించి కలకనడంమొదలయింది. అలాంటి హోదాలో ఉంటే నా సేవాపరిధి కూడా పెరుగుతుంది. ఈ ఆలోచన నన్ను సివిల్స్ వైపు లాగింది. దానికితోడు, ఇతర రంగాలను కూడా ప్రతిభావంతంగా పనిచేయించగల అవకాశం సర్వీస్ కు ఉంది. మరొక ముఖ్యమయిన విషయం, డాక్టర్ కోర్స్ చాలా టఫ్ కోర్స్. దీనికి డెడికేషన్ అవపరం. ఇలాంటి రంగం నుంచి వచ్చిన నేను సర్వీస్ లో ప్రవేశిస్తే డాక్టర్ల సేవాగుణం సర్వీస్ కు అందించవచ్చు, పరిపాలనలో సైంటిఫిక్ టెంపర్ ప్రవేశపెట్టవచ్చు, పరిపాలనకు కూడా ఎమోషనల్ కోణం ఆపాదించవచ్చు. అందువల్ల ప్రొఫెసన్ కోర్సుల నుంచి అంటే ఇంజనీర్స్ , లాయర్స్ సర్వీస్ లోకి వస్తే,ప్రతి ఒక్క రంగం నుంచి ఒక అనుభవం జోడయి, సర్వీస్ సుసంపన్నంఅవుతుంది.”
డాక్టర్ ఆకాంక్ష చాలా చక్కగా సమాధానం చెప్పారు. చికిత్సలో గాని, ఆపరేషన్ లోగాని డాక్టర్ కి ప్రెసిషన్ నిఖరత్వం ఉండాలి. దాన్ని అలవర్చుకుంటారు. వేలాది మంది ప్రజల జీవితాలతో ముడివడిన నిర్ణయాలు తీసుకునే అడ్మినిష్ట్రే షన్ లో కూడా డాకర్స్ ప్రెసిషన్ అవసరం, అది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా, రోగాలులేని పరిసరాలను సృష్టించడమే గొప్ప చికిత్స అని ఆమె భావించారు. అదీ విశేషం.