‘నల్లమల బిలం గుహ’ యాత్ర ఇలా సాగింది (1)

(అరణ్య శేఖర్)

బండేరు కోన, పెద్దగాడి, తిరుమల, మల్లెంకొండ యాత్ర అంటూ ఒకదాని తరువాత ఒకటి వరుసబెట్టి తిరుగుతూనే ఉన్నం.  తర్వాత ఏంటబ్బా అని అనుకుంటూ ఉండగా వివేక్ అన్న ఫోన్ చేసి మల్లేపల్లి దగ్గర నల్లమల కొండల్లో ‘బిలం గుహ’కు పోదాం అన్నాడు.  ఏ రోజు అయితే బాగుంటుంది అని అడిగాడు.  శని ఆదివారాలలో నాకు ఇబ్బంది లేదు అని చెప్పాను, ఇదే విషయాన్ని గ్రూపులో ప్రస్తావించగా మెజారిటీ సభ్యులు ఆదివారానికే మొగ్గు చూపారు. అనుకున్నదే తడవుగా లంకమల గిబ్స్ ‘ బిలం ఛలో ‘ అంటూ పోస్టర్ రిలీజ్ చేశాడు.

 

ఆ గుహ గురించి సన్నపురెడ్డి సార్ రాసిన కథను గ్రూప్ లో పోస్టు చేయగా చదివిన మాకు ఎప్పుడెప్పుడు వెళ్దామురా నాయనా అనే ఆత్రుత కలిగింది. అదిగాక బాహ్య ప్రపంచానికి ఈ గుహను పరిచయం చేసిన కొండపొలం రచయిత సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి సారు కూడా వస్తున్నాడని తెలియగానే మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

బిలం గుహదగ్గిర భూమన్

మరో సీనియర్ రచయిత బత్తుల ప్రసాద్ గారి రాకతో ఈ యాత్రకు ఎక్కడ లేని బలం పెరిగింది. అంతేకాదండోయ్ వీరికి తోడు సీనియర్ జర్నలిస్టుల కలయిక కూడా తోడైంది అందులో భాగంగా హైదరాబాద్ నుండి కాశీపురం ప్రభాకర్ రెడ్డి, మైదుకూరు నుండి నాగ శివారెడ్డి అన్నలు వస్తున్నట్లు తెలిసింది.

తాడిపత్రి నుంచి హరి ప్రసాద్ రెడ్డి అన్న, మొలక ఆంజనేయరెడ్డి అన్న, దినేష్ రెడ్డి, శ్యామ్ తో ఎనిమిది మందితో కూడిన సిమ్మాలు సై సై అంటుంటే వివేక్ అన్నతో కలిసి నడిచేందుకు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసే ఒంగోలు గిత్త సాయి వద్దన్నా వినకుండా రైస్ ప్యాకెట్, స్వీట్లు పట్టుకుని ఎనిమిది మందితో దండయాత్రకు సిద్ధమని తెలిపాడు.

దండయాత్రలో అలసి సొలసి మూలుగుతున్న జీవ పీనుగల దాహార్తిని తాటికల్లుతో తీర్చేందుకు ప్రొద్దుటూరు ప్రకృతి ప్రేమికుడు వెంకట్ బావ రామచంద్రా రెడ్డి అన్న వాసు అన్నలతో కూడిన సైన్యం వస్తోందని తెలిసింది. మైదుకూరు నుండి శివ బ్యాచ్, యార్రగుంట్ల బ్యాచ్ సిద్దమవుతున్నారు.

గుంటూరు, విజయవాడల నుండే కాకుండా బెంగళూరు, మహబూబ్ నగర్ నుండి కూడా కడప వైపు అడుగులు పడుతున్నాయి. కడప నుండి సునీల్ కుమార్ రెడ్డి అన్న, లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న, పవన్ కుమార్ రెడ్డి అన్న, మిత్రుడు వెంకటేష్, శ్రీనాథ్ రెడ్డిలు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఇంతలో తిరుపతి నుండి రాయలసీమ ఉద్యమకారుడు, సీనియర్ రచయిత, అభ్యుదయవాది, ప్రముఖ వక్త, ట్రెక్కింగ్ అనగానే మొదట గుర్తుకు వచ్చే శేషాచల విహారి అయిన భూమన్ గారు తనతో పాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు అయిన ప్రభాకర్ రెడ్డి, రమణా రెడ్డి గార్లతో పాటు కుదాసి ప్రభాకర్ అన్నతో కలిపి మొత్తం 13 మంది వస్తున్నారని తెలిసింది. అంతేకాకుండా నెల్లూరు నుండి విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వస్తున్నారని తెలిపారు.

వెంటనే భూమన్ సార్ కి ఫోన్ చేసి వారి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటామని తెలుపగా ఎలాగూ ఇంతదూరం వస్తున్నాము ఒక రోజు కాకుండా రెండు రోజులు ప్రోగ్రామ్ ఉంటే బాగుంటుంది కదా దగ్గరలో ఏదైనా ప్లేస్ ఉంటే శనివారం వెళ్లి రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే లేచి బిలం గుహకు వెళ్దామని ఇదే విషయం వివేక్ కు చెప్పగా లంకమలకు వెళ్దామన్నాడని నువ్వు కచ్చితంగా రావాలని చెప్పారు.

గతంలో భూమన్ సార్ తో శేషాచలం కొండల్లో ఒకసారి ప్రయాణం చేసిన అనుభూతి ఒక్కసారిగా కళ్ళముందు కదిలింది. ఎత్తయిన కొండలనైనా, లోతైన లోయలనైనా, గలగలపారే వన్ వంకలనైనా, దట్టమైన పొదలనైనా, సవాలు విసిరే దారులనైనా ఇట్టే దాటగలరు. యువకులు సైతం ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఆయన నడక.

అలసటయే ఎరుంగని భూమన్…

ఉదయాన్నే తిరుపతి నుండి భూమన సైన్యం బయలుదేరి దారమ్మడి ప్రకృతిని ఆస్వాదిస్తూ పురాతన కట్టడాలను సిద్ధవటం కోటలను దర్శించుకుంటూ, నెల్లూరు నుండి విజయ భాస్కర్ రెడ్డి గారు, కడప నుండి సరుకులు తీసుకుని నేను శ్రీనాథ్ కారులో మధ్యాహ్నానికి బద్వేలు దగ్గర నందిపల్లె లోని వివేక్ అన్న ఇంటికి వెళ్ళాము.

అందరికీ రాగి సంగటి, చెనిక్కాయ ఊరిమిండి, ఊరించే చికెన్ ఫ్రై తో అందరికీ తనదైన శైలిలో రాయలసీమ ఆతిథ్యాన్ని అందించాడు. వివేక్ అన్న వాళ్ళ అమ్మ కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆహా ఏమి రుచి తినరా మైమరచి అని మనసులో అనుకుంటూ ఆవురావురుమని లొట్టలేసుకుంటూ వారి ఆతిథ్యాన్ని స్వీకరించడం అందరి వంతయింది.

అందరూ తిన్న తరువాత సకల కళా వల్లభుడు, యువ రచయిత వివేకానంద రెడ్డి (వివేక్ లంకమల) గురించి, ఇటీవల తాను తీసిన #అరణ్యవాసం సినిమా గురించి దానికోసం ఆయన పడ్డ శ్రమ గురించి అక్కడ ఉన్న వారందరికీ భూమన్ సారు వివరిస్తూ శాలువా కప్పి సన్మానం చేసి తన వెంట తీసుకొని వచ్చిన పుస్తకాలను బహుమతిగా అందించారు (పై ఫోటో).

ఈ క్రమంలో అక్కడ ఉన్న ప్రముఖులతో పాటు నాకు కూడా పుస్తకాలను బహూకరించారు.

నాకు పుస్తకాలు కానుకగా ఇచ్చారు

ఈ తిండిలో పడి ఎక్కడ లంకమలకు పిలుచుకు పోవడం మర్చిపోతామో అనుకున్నాడో ఏమో భూమన్ సారు లంకమలకు వెళ్లాలి అని పదే పదే గుర్తుచేస్తూనే ఉన్నాడు.

అటు శేషాచలం, ఇటు పాలకొండల యాత్రికుల కలయికతో లంకమల కొండల వైపుగా అడుగులు పడ్డాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *