చించెట్టు కింద టిఫిన్, ఏమిటి దాని వశీకరణ శక్తి ?

-భూమ‌న్‌

స్ట్రీట్ ఫుడ్ ఎక్క‌డెక్క‌డ దాగుందో క‌నిపెట్ట‌డం నాకు ఒక ఇష్ట‌మైన వ్యాప‌కం.
అందు కోసం ఎంత దూర‌మైనా ఫ‌ర‌వాలేదు, పోయి ఆర‌గించి రావ‌ల్సిందే.

ఎంత‌యినా చెప్పండి మ‌నిషికి ఆహారం చాలా చాలా ముఖ్యం క‌దా! ఆహార‌మే మ‌న ఆరోగ్య హేతుకు.
తిరుప‌తికి 30 కిలోమీట‌ర్ల దూరంలో, ముంబ‌యి, చెన్నై ప్ర‌ధాన ర‌హ‌దారిలో మామండూరులో ఈ టిఫిన్ సెంట‌ర్ ఉంది.

మ్యాపులో మామండూరు

మామండూరు గురించి  మరింత చదవండి ఇక్కడ

కెన్నెత్ యాండర్సన్ కథల్లో విహరిస్తారా, అయితే మామండూరు అడవికి రండి…


 

మామండూరు అంటేనే ప్ర‌కృతి బాట‌.

చుట్టూ కొండ‌లు, అడ‌వుల మ‌ధ్యన‌ ప‌క్షులు, జంతువుల‌న్నీ నిద్ర లేచి, వాటి వాటి తావుల‌కు పోయినాక ఈ టిఫిన్‌సెంట‌ర్ తెరుచుకుంటుంది. గత రెండేళ్ళుగా నెల‌కొక‌సారి పోతున్నా, టేస్ట్ ప్ర‌తిసారీ కొత్తే.
ప‌ద‌హైదేళ్ళుగా పెంచ‌ల‌య్య‌, సుశీల‌మ్మ‌, వారి అబ్బాయి దీన్ని న‌డుపుతున్నారు.

ప్రొద్దున తెల‌తెల‌వార‌గా తెరిచిన కొట్టు 11 గంట‌ల‌కంతా ముగుస్తుంది.
ఎంత సంతృప్తిగా ఆ లెక్క‌తో బ‌తుకుతున్నార్రా అనిపిస్తుంది.
క‌ష్ట‌ప‌డితే ఫ‌లితం అంటామే, ఇదిగో ఇట్లాంటి వాళ్ళ‌ను చూసి నేర్చుకోవాలి.
మాక‌య్యే బిల్లు 50 రూపాయ‌లు దాట‌దు.

 

తొలి నుంచీ క‌ట్టెల పొయ్యిమీదే వంట‌లు

సాదా దోసె 10 రూపాయ‌లు, ఇడ్లీ 5, వ‌డ 5, గుడ్డు దోసె 25, కారం దోసె 15 రూపాయ‌లు మాత్ర‌మే.
చెనిగ్గింజ‌ల ఊరుబిండి, ఎర్ర‌కారం, సాంబారు ఉంటాయి.

అన్నీ నోట్లో వేసుకుంటే మృదువుగా క‌రిగిపోయేట‌ట్టు ఉంటాయి.
ముగ్గురూ ముగ్గురే ఎంతో సౌమ్యంగా, విసుగు లేకుండా, చేతుల‌కు విడుప‌నేది లేకుండా, క‌డుపాత్రంగా వ‌చ్చిన ప్ర‌తివారినీ సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే వీరి ధ్యేయంగా ఉంది.

ఆ 50 రూపాయ‌ల టిఫిన్ కోసం 50 కిలోమీట‌ర్లు పోయి వ‌స్తున్నారంటే మ‌మ్మ‌ల్ని ఆక‌ర్షిస్తున్న‌దేమిటి మీకు తెలియ‌డంలా?

మీరు ఒక మారు ట్రై చేయండి.
చిన్న చిన్న కొట్ల వాళ్ళ‌ను బ‌తికించండి.
చ‌క్క‌టి రుచిక‌ర‌మైన ఆల్పాహారాన్ని రుచి చూడండి.

 

(భూమన్,చరిత్ర పరిశోధకుడు, సామాజిక ఉద్యమకారుడు, అన్నింటికి మించి ప్రకృతి ప్రేమికుడు, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *