తప్పక చూడాల్సిన మన పొరుగూరు ‘సిద్దవటం కోట’

(కుందాసి ప్రభాకర్)

దక్షిణ భారత దేశానికి చెందిన  ఒక ఉజ్వల చారిత్రక ఘట్టానికి  సిద్దవటం కోట సాక్ష్యం.   ఈ విలువైన చారిత్రక సంపదను కాపాడుకోవాలని,ప్రజలందరికి చేరువచేయాలనే ప్రయత్నాలు పెద్దగా జరగలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ టూరిజం మ్యాప్ లోగాని, ఇంక్రెడిబుల్ ఇండియా టూరిజం మ్యాప్ లోగాని సిద్దవటం కోటకు స్థానం దొరకలేదు.

వెదికి వెదిక ఎక్కడెక్కడో ఉన్న కోట గోడలను, శిధిలాను చూసేందుకు ఉత్సాహం చూపే వారంతా ముందుగాచూడాల్సిన చారిత్రక శకలం సిద్దవటం కోట.

సిద్దవటానికి చేరుకోవడం చాలా సులభం. తిరుపతి నుంచి రావచ్చు.  కడప నుంచి రావచ్చు. తిరుపతి, కడపలకు  బస్సు, రైలు, విమాన సౌకర్యలు చక్కగా ఉన్నాయి. అందువల్ల ప్రయాస లేకుండా సిద్దవటం చేరుకుని,  ఇక్కడి చారిత్రప్రదేశాలను చూసి వెళ్లిపోవచ్చు. లేదా కడప జిల్లాలో గండికోట తో పాటు మరెన్నో అద్భుతమయిన చారిత్రక, అధ్యాత్మిక ప్రదేశాలను చూడవచ్చు. కడప జిల్లా చారిత్రకంగా చాలా సుసంపన్నమయింది.

మైసూరు విశ్వవిద్యాలయం విశాంత్ర చరిత్ర, పురాతత్వ శాస్త్ర ఆచార్యుడు ఫ్రొఫెసర్ ఎం. వి నరసింహ మూర్తి ప్రకారం సిద్ధవటం అనే మాట సిద్ధ, వట అనే రెండుపదాల నుంచి వచ్చింది. సిద్ధ అంటే దేవుడి నుంచి సిద్దించినది. వట అంటే వట వృక్షం, రావిచెట్టు.  పవిత్రమయిన రావిచెట్టు అని అర్థం. భారతదేశంలో చాలా వూర్ల పేర్లు ఇలా ఏదో ఒక కథతో జోడయి ఉంటాయి. ఎపుడో చరిత్రలో ఇక్కడొక రావిచెట్టు పూజలందుకుంటూ ఉండేదని, అదేక్రమంగా వూరయి సిద్ధవటం అయిందని ఆయన చెప్పారు.

కడప జిల్లా, బాకరాపేట -బద్వేల్ మధ్యలో ఉంటుంది సిద్దవటం… సిద్ధవటం ఫోర్ట్ విషయానికి వస్తే…  దక్షిణ భారత చరిత్రలో  స్వర్ణయుగమని పేరున్న విజయనగర రాజుల కాలంలో ఈ కోట నిర్మాణమయింది. తుళువ నాయకులు  ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నపుడు 1303 లో కోట నిర్మాణమయిందని ప్రొఫెసర్ మూర్తిచెప్పారు. కోటలోని విశేషాలను పరిశీలించే ముందు కోటల గురించి రెండు ముక్కలు తెలుసుకుందాం. ‘ కోటలు కేవలం మిలిటరీ పర్పస్ కోసమే కట్టరు. వ్యాపారం, పౌర జీవితం, అధ్యాత్మికం, గుడులు గోపురాల పరిరక్షణ కూడా కోటల నిర్మాణంలో భాగం. అందుకే చాలా కోటల్లో పౌరజీవితం అంటుంది. ఆలయాలుంటాయి.  విజయనగర రాజులు నిర్మించిన సిద్ధవటంలో కూడా చాలా ఆలయాలున్నాయి.

సిద్దవటం కోట

సిద్దవటం కోటని పెన్నానది ఒడ్డున కట్టారు. ఒక యుద్ధంలో వీరోచితంగా పోరాడినందుకు   విజయనగర రాజు  రెండవ అరకేటి వెంకటపతిరాయలు ఈ కోటని 1605లో యల్లమరాజు అనే సేనికి కానుకగా ఇచ్చాడు.

అందమయినప్రదేశంలో, పెన్నానది వడ్డున, మిలిటరీ పరంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్నందున   తొలి నుంచి కీలకమయిన ఈ కోటని  పాలకులు  పటిష్టపరుస్తూ వచ్చారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అలియ రామరాయలు ఈ కోటని బాగా అభివృద్ధిపరిచాడు.

River Penna
ఈ పెన్నా నది ఒడ్డునే కోటను నిర్మించారు

అయితే, విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత  17వ శతాబ్దంలో ఈ కోట కడప నవాబుల చేతిలో పడింది.  తర్వాత దీనిని హైదర్ అలీ (మైసూర్ సుల్లాన్ 1720- డిసెంబర్ 7, 1782) స్వాదీనం    చేసుకున్నాడు. ఆ తర్వాత  1780 నుంచి  చాలా కాలం ఇది  మైసూరు రాజుల కిందనే ఉంటూ  వచ్చింది. తర్వాత 1800ఇది బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ అదీనంలోకి వచ్చింది. తర్వాత రక్షణ కోటగా మారింది. చాలా మందికి తెలియదు, కడప జిల్లా పరిపాలన ఈ కోటనుంచే చాలా కాలం సాగింది. 1956లో ఇదికేంద్ర పురాతత్వ శాఖ రక్షిత నిర్మాణం అయింది,” అని ఫ్రొఫెసర్ మూర్తి చెప్పారు.

కోటలోపుల విజయనగర రాజులు దుర్గ, రంగనాథస్వామి, సిద్దేశ్వర, బాల బ్రహ్మ ఆలయాలను నిర్మించారు.  ఇక్కడ అందమయిన అద్భుతమయిన శిల్ప సంపద ఉంది.

అన్నీ శిధిలాలయాలే…

 

అద్భుతమయిన శిల్ప సంపద

 

ఇక్కడ ఉన్న దేవుళ్లలో ప్రధానమయినది నరసింహుడు ఆయన దేవేరి లక్ష్మి  విగ్రహం. విశేషమేమిటంటే ఇది ఈయన ఉగ్ర నరసింహుడుకాదు.  ఈయనభక్తులను ఆశ్వీర్వదించే ప్రసన్నలక్ష్మీనరసింహుడు.  ఈ శిల్పాలు గ్రనైట్ లో చెక్కినవి. అందుకే ఆ శిల్పులు గొప్ప పనిమంతులని మెచ్చుకోవాలి.

 

విజయనగర రాజుల కాలంలో ఒక పెద్ద నందిని కూడా నిర్మించారు. దీనిని ధ్వంసం చేశారు. చైతన్య ప్రభు కూడా ఈ కోటని సందర్శించారు.

ఈ కోటని కాపాడుకునేందుకు స్థానిక పాలకులు ఎపుడూ యుద్ధాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగాఉదయగిరి,రెడ్డిరాజుల  నుంచి కోటను కాపాడుకుంటూ వచ్చారు.  ముస్లిల పాలనలో ఉన్నపుడు కోట లోపుల మసీదులనునిర్మించారు.

 

 

కోట లోపల ఎర్రటి రాతి స్థంభాలపై అద్భుతమైన శిల్పకళ మన చూపులను కట్టిపడేస్తాయ్…ఇక్కడ రాతి స్తంభంపై చెక్కిన వేంకటేశ్వరున్ని ఇక్కడ రాతి స్తంభంపై చెక్కిన వేంకటేశ్వరున్ని … మహమ్మదీయ ప్రార్ధనా నిర్మాణాన్ని ఓకేచోట చూడొచ్చు.

 

ఈ కోటను మొదట మట్లి రాజులు నిర్మించినా  తర్వాతి కాలంలో కడప నవాబుల ఏలుబడిలో ఉండేది. కాల గమనంలో తన ప్రాభావాన్ని కోల్పోయినా…. మన గత వైభవానికి చిహ్నంగా.. మనకు చరిత్రను చెప్పడాన్ని సిద్ధంగా ఉన్నట్లు…. పెన్నా నది ఒడ్డున.. చుట్టూ కందకాలతో గంభీరంగా ఉంటుంది ఈ సిద్దవటం కోట…

కోట మొదటి నిర్మాణాలు హిందు శైలిలో జరిగినట్లు, సిద్దేశ్వర ఆలయం, సిద్దవటేశ్వర ఆలయాలు కోటలో అంతర్భాగంగా ఉంటాయి. సిద్దవటేశ్వరుని పేరు వలననే ఈ ఊరికి సిద్దవటం అనే పేరు వచ్చిందని మరి కొందరు చెబుతారు..

పెన్నా నది వంతెన మీద నుండి చూస్తే ..ఇసుక తిన్నెలను అనుకుని నల్లటి బలమైన రాతి గోడలతో చాలా అందంగా కనిపిస్తుంది సిద్దవటం కోట (కింది ఫోటోలు) నదిలో నీటి ప్రవాహం నిండుగా ఉంటే ఆ అందం వేరే లెవెల్లో ఉంటుందేమో….

 

.

 

 

కోటలో కొంత భాగం కాలగర్భంలో కలిసిపోయి ఉంది… మహమ్మదీయుల సమాధులు కూడా కొన్ని ఉన్నాయి..

కోట లోపలి నుండి పెన్నా నదికి రహస్య మార్గం ఉందంట..మనకు అలాంటి వంటే మహా ఇంట్రెస్ట్.. ఉపయోగం లేదు….ఇప్పుడు ఆ దారి మూసేసారంట…

 

కోటలో నేను(కుడి వైపు) నా మిత్రులు

అనగనగా ఒక రాజు ఉండేవాడు…అని ఏ రోజైతే విన్నామో ..ఆ రోజు మొదలైంది రాజు అన్నా , కోట అన్నా క్రేజు ఆ రాతిగోడలు.. రహస్య మార్గాలు, ఇప్పటికీ అసలు కోట లోపల ఏం జరిగేది,వాళ్ళు ఎలా వుండేవారు…రాజులు కదా వాళ్ళు ఏమి తినేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది, నాకు అన్నీ సమాధానం లేని ప్రశ్నలే!

ఏదిఏమైనాసిద్దవటం కోట సందర్శన ఒక మధుర జ్ఞాపకం.

 

(కుందాసి ప్రభాకర్, నిరంతర అన్వేషి, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *