-చల్లపల్లి స్వరూపరాణి
సునీతా*!
నీచేతి స్పర్శతో
ఈనేల పునీతమయ్యింది నాయినా!
యే గంగలోనూ మునక్కుండానే
నువ్వు నీపనితో
అర్హంతుడవయ్యావు తండ్రీ!
కళ్ళముందున్న లోకంలో
దారుణాలు చూసి
దుఃఖపడ్డాను గానీ
లేని పైలోకం గురించి
నేనెప్పుడూ మాట్లాడనేలేదు
అదంతా మనువుల కుట్ర
రాజులూ రమణప్పలూ నాచుట్టూ చేరినా
వీధులూడ్చి మట్టి పిసికే
చెమట చుక్కలతోనే
చెలిమి చేశాను
వారు పెట్టిందే తిన్నాను
గుర్తుందా సునీతా!
నేను చివరిసారి తిన్నది
ఎరుకలవారి పంది మాంసాన్నే కదా!
నాకు పంది బుద్ధులు అబ్బినయ్యా మరి!
మనువు తినే గడ్డికన్నా
మాంసాహారం యెంత మేలు!
నిజం చెప్పొద్దూ…
నేను నాతల్లి గర్భం నుంచే పుట్టాను
వాళ్లన్నట్టు యేమగవాడి భుజాల నుంచి
నేను పుట్టుకురాలేదు
మనువు కూడా
నోటినుంచి పుట్టలేదు
వాడన్నట్టు
అనాగారకుడనై తిరిగేటప్పుడు
ఆ రావిచెట్టుకింద
కాసేపు కునుకు తీసివుంటాను గానీ
చెట్టుకింద
కళ్ళు మూసుకు కూచ్చోలేదు
పనీపాటా లేనోడు పలికినట్టు
శ్రమజీవి నోటినుంచి
అన్ని అబద్ధాలు పలకవు సునీతా!
ఆడపిల్ల పుడితే
నోట్లో వడ్ల గింజేయమన్నోడు
ప్రేమిస్తే కన్నబిడ్డ
నెత్తురు కళ్ళజూడమన్నోడు
మనుషుల్ని నిలువునా చీల్చి
కులం కుంపటి రాజేసినోడు
ద్వేష ఫలహారం పంచినోడు
కట్టు కధలూ పిట్ట కధలూ కాక
మరేమి చెబుతాడు సునీతా!
తిండికీ బట్టకీ నోయని జనం
కాసింత తిని
వొంటినిండా గుడ్డకడితే వోర్చలేక
విషం చిమ్ముతాడు
యజ్ఞం కోసం పశువుల్ని చంపుతున్నారని
నేను వారితో మాటల యుద్ధం చేశాను
పశువు కోసం మనిషిని చంపితే
శాంతమూర్తి బిరుదు
అవతల గిరాటేసేవాడిని సునీతా!
(*బౌద్ధ సాహిత్యంలో సునీతుడు వీధులు శుభ్రం చేసే వ్యక్తి)