డాక్టర్. యస్. జతిన్ కుమార్
రష్యా -ఉక్రెయిన్ సంక్షోభం యుద్ధస్థితికి చేరి వారం అవుతోంది. ఐరాస సమాచారం మేరకు ఇప్పటికే 13500 మంది ప్రాణాలు కోల్పోయారు, అందులో 130 మంది సాధారణ పౌరులు అని ఐరాస గణాంకాలు . కాదు 3000 మంది సాధారణ పౌరులు చనిపోయారని ఉక్రేయిన్ అంటుంది. 5500 మంది రష్యా సైనికులు నిహతులయ్యారని ఆమెరికా ఏజెన్సీలు చెబుతుంటే మరణించిన తమ సైనికుల సంఖ్య 500 కు తక్కువే అని రష్యా ప్రభుత్వం చెబుతోంది.
8 లక్షల మందికి పైగా ఉక్రేయిన్ వాసులు సరిహద్దులు దాటి వెళ్లిపోయారు, ఇదంతా ఉక్రెయిన్ లో పూర్తి స్థాయి భీకర యుద్ధం జరుగుతున్నదని చాటుతోంది. ఉక్రెయిన్ పై దాడి జరుగుతుందని దీర్ఘకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమెరికావారు యుద్ధానికి రెచ్చగొడుతూ అనేక ముహూర్తాలు ప్రకటించారు. చాలాకాలం వేచి చూసి, అమెరికా దూకుడు, నిందా ప్రచారం మానుకొక పోవటంతో, ఉక్రెయిన్ రష్యన్ల పిలుపుతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పైకి 24-02-22 న తన సైన్యాన్ని నడిపించాడు. అమెరికా దాని మిత్రదేశాలు దీనిని పుతిన్ కున్న సామ్రాజ్య వాద, విస్తరణ వాద లక్ష్యాల ఫలితమనీ, మాజీ సోవియట్ యూనియన్ ను పునరుద్ధరించే దిశలో చేస్తున్న చర్య అని ప్రకటించాయి.
రష్యన్ ప్రభుత్వం ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. ఈ ‘సైనిక చర్య’ లు హానస్క్, డాన్ టెస్క్ రిపబ్లిక్లపై ఉక్రెయిన్ దాడులను అంతం చేయటానికి ఉద్దేశించబడింది. దానితో పాటు ఉక్రెయిన్లో రాజకీయంగా ఆధిపత్యం వహిస్తున్న నియో నాజీ దళాలను నాశనం చేయాలని, దానిని నిస్సయినికం చేయాలని రష్యా కోరుకుంటున్నట్లు చెప్పింది.
నాటో విస్తరణలో భాగంగా, యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ ను చేర్చుకుని దాన్ని తమ వ్యూహంలో భాగస్వామిని చేస్తూ, రష్యా ముంగిట అమెరికా తదితర సామ్రాజ్యవాదులు తమ బలగాలను, ఆయుధాలను మోహరించే ప్రయత్నాలను తిప్పికొట్టటం తమ రక్షణకు అత్యవసరం” అని రష్యన్ పాలకులు పేర్కొన్నారు.
డోన్బాస్ ప్రాంతంలోని రష్యన్ మెజారిటీ గల రిపబ్లిక్ లను రక్షించడానికి తన సైన్యాన్ని పంపుతున్నట్లు పుతిన్ పేర్కొన్నప్పటికీ, రష్యన్ సైన్యం ఉక్రెయిన్ అంతటా ప్రవేశించింది. రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఖార్కీవ్ నగరాన్ని చుట్టుముట్టాయి. మరోవైపు, అమెరికా దాని మిత్రదేశాలు ఉక్రెయిన్ సార్వభౌమ త్వాన్ని రక్షించడం గురించి చాలా మాట్లాడుతున్నాయి గాని ఉక్రైన్ కు కావలసిన సైనిక బలగాలను ఇవ్వడం లేదు. కానీ గతంలో వారు అందించిన ఆధునిక ఆయుధ సంపత్తి బలంతో ఉక్రేయిన్ బలగాలు రష్యా దళాలను నిలువరిస్తున్నాయి. ఎన్నో కబుర్లు చెప్పి యుద్ధంలోకి దించిన నాటో దేశాలు ఇప్పుడు తమను నట్టేట ముంచాయని భావిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు ఝలెన్ స్కీ “మీరు మా వైపున వున్నారని నిరూపించుకోండి” అని నాటో కూటమి దేశాలను ప్రాధేయపడుతున్నాడు.
ఈ దండయాత్ర కు కారణాలను అనేక దుర్వ్యాఖ్యానాలతో, స్వప్రయోజనాలకోసం అల్లుతున్న అసత్యాలతో చాలా పెద్దఎత్తున రష్యా దురాక్రమణ అని పతాక శీర్షికలతో ప్రచారంచేస్తున్నాయి పాశ్చాత్య దేశాలు. రష్యా చేసిన దాడిని అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతానికి చెందిన ప్రాథమిక చరిత్ర తెలియాల్సిన అవసరంవుంది.
చారిత్రక అంశాలు
ఉక్రెనియా లోని తూర్పు ప్రాంతం 1667 నుండి జారు ప్రభువుల రష్యాసామ్రాజ్యంలో ఒక భాగంగాను, పశ్చిమ ప్రాంతం పోలాండ్- లిథువేనియా రాజ్యంలో భాగంగాను వుండేవి. 1922 నుండి 91 వరకు సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లో భాగంగా ఉక్రేనియ SSR ఉండేది. 1941 నుండి 44 మధ్య కొద్దికాలం ఈప్రాంతం జర్మనీ అధీనంలోకి వెళ్ళింది. 1954 లో అప్పటి రష్యా అధినేత నికితా కృచ్చేవ్ రష్యా నుండి క్రిమియా భాగాన్ని వేరుచేసి ఉక్రెయిన్ లో కలిపాడు. దానితో ఉక్రేనియా రిపబ్లిక్ మరింత విశాలమయ్యింది. సోవియట్ పతనం చెందుతున్నదశలో 1991 ఆగస్ట్ లో ఈ ప్రాంతం స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అప్పటినుండి యూరప్ లో ఒక ముఖ్యదేశంగా కొనసాగుతోంది. అమెరికా, నాటో సామ్రాజ్యవాద కూటమి దాన్ని తమ శిబిరంలోకి లాగాలని ప్రయత్నిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2009 లో అధికారం చేపట్టగానే యూరప్ లో తనకు అనుకూలమైన వారితో ప్రభుత్వాలను నింపాలని సమకట్టాడు. సిరియా, ఉక్రెయిన్ ల ప్రభుత్వాలను కూడా అలాగే మార్చాలని ఆయన భావించాడు. క్రిమియాలో ఉన్న రష్యా ప్రధాన నౌకాస్థావరాన్ని స్వాధీనం చేసుకోవాలని ఒబామా కోరుకున్నాడు, దీనిని సోవియట్ పాలకులు 1954లో ఉక్రెయిన్ కు బదిలీ చేశారు కాబట్టి అది ఇప్పుడు ఉక్రెయిన్ లో ఉంది . ఉక్రెయిన్ లోని ఆ రష్యన్ నావికా స్థావరాన్ని అమెరికా నావికా స్థావరంగా మార్చాలని, ఉక్రెయిన్నునాటోలోకి తీసుకురావాలని ఒబామా యోచించాడు.
12 ఏప్రిల్ 2010న, ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడిని కలుసుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అమెరికా కూటమిలో చేరాలనే ఒబామా సూచనలను యనుకోవిచ్ తిరస్కరించారు. 2 జూలై 2010న, అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ మరియు యనుకోవిచ్, కీవ్ లో సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు, ఆమె రష్యాకు వ్యతిరేకంగా యు.ఎస్ దళాల తో సంయుక్త సైనిక విన్యాసాల గురించి చర్చించినట్లు చెప్పారు, కానీ యనుకోవిచ్ మళ్లీ అమెరికా డిమాండ్లను తిరస్కరించారు. దానితో అమెరికా యనుకోవిచ్ ప్రభుత్వాన్ని తొలగించాలని కుట్ర చేసింది. ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశంలో తిరుగుబాటును నిర్వహించడానికి, దానిని యు.ఎస్ నియంత్రణలో ఉంచడానికి విక్టోరియా నులాండ్ అనే మహిళను [ఈమె హిల్లరీ స్నేహితుదు, ప్రసిద్ధ అమెరికన్-సామ్రాజ్యవాద రచయిత, రాబర్ట్ కాగన్ భార్య] నియమించారు.
ఈలోగా యూరప్, రష్యాలలో కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బాల్టిక్ సముద్రం కింద, రష్యా నుండి జర్మనీ వరకు ఒక పైప్ లైన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా నుండి ఇ.యు. లోకి అతి తక్కువ ఖర్చుతో సహజ వాయువును చేర్చడానికి నార్డ్ స్ట్రీమ్ 2 అని ఒక ప్రణాళికను 2015 లో సిద్ధం చేశారు. 2011 నవంబర్ నుండి ఒక పైప్ లైన్ ఈ పని చేస్తోంది [నార్డ్ 1]. ఐరోపాకు రష్యన్ సహజ వాయువు మూడు ప్రధాన మార్గాల ద్వారా సరఫరా అవుతుంది, ఇందులో 80% వాయువు ఉక్రెయిన్ గుండా రవాణా అవుతుంది. ఈ రవాణా కోసం రష్యా ఉక్రైన్ కు ఏటా రెండు బిలియన్ డాలర్లు చెల్లిస్తుంది. అది అస్థిరమైన ఏర్పాటు అని అందరికీ తెలుసు; నార్డ్-2 పైప్ లైన్ తో అస్థిరమైన ఉక్రెయిన్ ను తప్పించి రష్యానుండి జర్మనీకి సహజ వాయువు నేరుగా సరఫరా చేయవచ్చు. ఉక్రెయిన్ పశ్చిమ ప్రావిన్సులలో, పోలాండ్ కు సమీపంలో, ల్వివ్, టార్నోపిల్, వోలిన్, ఇవానో-ఫ్రాంకివ్స్క్ లలో రష్యన్ వ్యతిరేక, ఉక్రెయిన్ జాత్యహంకార-ఫాసిస్టులు (నాజీలు) ఆధిపత్యం చెలాయించారు; సహజ వాయువు కు ప్రధాన రవాణా మార్గంగా ఉక్రెయిన్ ను తొలగించ డాన్నిఈ జాతీయవాదులూ, నాజీలూ వ్యతిరేకించా రు. కొత్త పైప్ లైన్ వల్ల ఉక్రెయిన్ ప్రభుత్వానికి రష్యా చెల్లించే గ్యాస్-రవాణా-ఫీజులు బాగా తగ్గిపోతాయి. ఉక్రెయిన్ కు వున్న భౌగోళిక, వ్యూహాత్మక ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ప్రతిపాదిత నార్డ్ స్ట్రీమ్2 వాస్తవానికి జర్మనీ, రష్యాల మధ్య అవసరమైన వ్యాపార ఒప్పందమే అయినప్పటికీ, తీవ్రమితవాద ఉక్రేనియన్లు దానిని ఉక్రెయిన్ వ్యతిరేక రష్యన్ పథకంగా భావించారు. మరోవంక అధ్యక్షుడు బరాక్ ఒబామా నార్డ్ స్ట్రీమ్ 2ను వ్యతిరేకించారు. మునపటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ కూడా నార్డ్ స్ట్రీమ్ కు వ్యతిరేకమే. నార్డ్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ చాలా వరకు, రష్యాతో సహకారా త్మకంగా పని చేయడానికి, చివరకు అమెరికా ఆధిపత్యం నుండి బయట పడడానికి కొన్ని యూరప్ దేశాలు చేస్తు న్న ప్రయత్నం అనటంలో సందేహమేమీ లేదు.ఈ ప్రోజెక్ట్ ద్వారా రష్యా, తూర్పు యూరోప్ దేశాలతోపాటు మొత్తం యూరప్ ఖండంపై తన ప్రభావాన్ని పెంచుకొంటుందని అమెరికా అధ్యక్షులు ఆందోళన చెందారు. నార్డ్ స్ట్రీమ్ అంగీకా రం కుదిరిన తరువాత “ఉక్రేనియన్-టేకోవర్” లక్ష్యం ఊపందుకుంది
4 ఫిబ్రవరి 2014 న కీవ్ లోని యు.ఎస్ రాయబారికి నులాండ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ యూట్యూబ్ కు పోస్ట్ చేయబడినప్పుడు అమెరికా చేయిస్తున్న తిరుగుబాటు [రివల్యూషన్ ఆఫ్ డిగ్నిటీ లేదా మైదాన విప్లవం ] కుట్ర బయట పడింది. దీనిలో ఆమె “యాట్స్” లేదా “యాట్సెన్యుక్”ను తిరుగుబాటు అనంతర ప్రభుత్వాన్ని నడపడానికి నియమించా లని సూచించింది.
“యాట్స్” ఒక రష్యన్ వ్యతిరేక, నాజీ-అనుకూల రాజకీయ నాయకుడు. ఐరోపా సమాఖ్య తో రాజకీయ, వాణిజ్య ఒప్పందం చేసుకోవటానికి యనుకోవిచ్ నిరాకరించటంతో ఆమెరికా శక్తులు అల్లకల్లోలం సృష్టించి అతని ప్రభుత్వాన్ని కూల్చివేసి 22 ఫిబ్రవరి 2014న అమెరికా అనుకూల మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేశారు ప్రభుత్వాన్ని నడపడానికి యాత్సెన్యూక్ నియమించబడిన తరువాత, అతను వెంటనే, ఉక్రెయిన్ లోని యనుకోవిచ్ అనుచరు లను నిర్మూలించడానికి అనుకూలంగా ఉన్నవారితో పదవులను భర్తీ చేశాడు. రష్యన్ అనుకూల ఓటర్లను పారిపోయేలా చేయడం లేదా చంపడం ద్వారా ఉక్రెయిన్ వోటింగ్-రోల్స్ నుండి పూర్తిగా తొలగించారు. ఎన్నికల ద్వారా అమెరికా సృష్టించే ఒక రష్యా వ్యతిరేక పాలనకు సమర్ధకులను పోగు చేయడానికి అనేక యూరప్ దేశాలలో అబద్ధప్రచారాలు చేశారు, ఒడెసా లో, డాన్ బాస్ లో, క్రిమియాలో ఒబామా ప్రేరేపించిన “స్థానిక ఉక్రేనియన్ నిర్మూలన, ఉగ్రవాద కార్య కలాపాల” వీడియోలు ఆన్ లైన్ లో పోస్ట్ చేసి దుష్ప్రచారం చేశారు. ఈ పరిస్థితులలో మార్చి 2014 లో రష్యా క్రిమియా ను స్వాధీనం చేసుకుంది. 2014 మే లో పెట్రో పెరిషెంకో అనే వ్యాపారవేత్త 53% వోట్లు సంపాధించి ఉక్రేయిన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 2019 వరకు ఆయన పదవిలో కొనసాగాడు. ఇతని కాలంలో రష్యా వ్యతిరేకత బాగా పెరిగింది. రష్యా జాతి అనుకూల ఉద్యమాల పట్ల కఠినంగా వ్యవహరించారు. ఆ ఉద్యమకారులను డాన్ బాస్ లోపలి ప్రాంతాలకు నెట్టివేశారు. యూరప్ అసోసిఏషన్ తో ఒప్పందాలు కుదుర్చుకుని నాటో తో సంబంధాలు పెంచుకు న్నాడు.
ఆర్ధిక రాజకీయ అంశాలు
రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికన్ అధ్యక్షులు రష్యాను జయించడానికి కీలక మిత్రదేశాలుగా ఐరోపాను నియంత్రించాలని కోరుకున్నారు. పశ్చిమ యూరప్ లో అమెరికా ప్రభావం హెచ్చుగా నెలకొంది. నాటో కూటమీ ఏర్పడి విస్తరించసాగింది. కానీ మధ్య, తూర్పు యూరప్ లలో వారి ఆటలు అంతగా సాగలేదు. అది సోవియట్ రష్యా ప్రభావం క్రింద వుండేది. సోవియట్ పతనం తర్వాత అమెరికా ఈ ప్రాంతాలలో తన ప్రభావం పెంచుకోవాలని ప్రయ త్నించ సాగింది. అయితే పెట్టుబడిదారీ ప్రపంచంలో వచ్చిన అనేక సంక్షోభాల ఫలితంగా ఆమెరికా వారి ఏక ధృవ కలలు, ప్రపంచం పై గుత్తాధిపత్యం సాధ్యం కావటంలేదు. పైపెచ్చు కొన్ని పశ్చిమ యూరప్ దేశాలు కూడా ఆమెరికా నాయకత్వాన్ని ప్రశ్నించ సాగాయి. మరొ వంక జనచైనా అప్రతిహతమైన వేగంతో సోషలిస్ట్ ప్రత్యామ్నాయ విధానా లతో అనేక దేశాలను ఆకట్టుకుంటూ, అంతర్జాతీయ రంగంలో విస్మరించలేని శక్తిగా సుస్థిర స్థానం సాధించుకుంది. అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించే మొనగాడుగా బరిలో నిలిచింది. క్షీణిస్తున్న తన ప్రభావాన్ని వృద్ధిచేసుకోవ టానికి అమెరికా అనేక అమానవీయ, అనైతిక చర్యలకు, పెత్తందారి జోక్యానికి, కుట్రలకు, పూనుకుంటూ స్థానికంగా అస్థిరతలు, కలహాలు ప్రేరేపిస్తోంది.
నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ పనిచేయడాన్ని నిరోధించడం ద్వారా జర్మనీలోనూ, ఇ యు అంతటా ఆర్థిక వ్యవస్థలను బలహీనపరచడానికి, వాటిని అమెరికాపై మరింత ఆధారపడేలా చేయడానికి, తక్కువ ధరకు లభించే రష్యన్ పైప్ లైన్ ద్వారా వచ్చే సహజ వాయువు స్థానంలో, అమెరికానుంచి ట్యాంకులు నౌకల ద్వారా వచ్చే ఖరీదైన ద్రవీకృత సహజ వాయువు సరఫరా చేయడానికి, తద్వారా అమెరికా ఎన్నికలలో రాజకీయ నాయకులకు ఆర్థిక సహాయం చేసిన అమెరికా బిలియనీర్లను సుసంపన్నం చేయడానికి కూడా ఇది జరిగింది. అమెరికా లోని రెండు రాజకీయ పార్టీల కాంగ్రెస్ సభ్యులు ‘ఉక్రెయిన్ ప్రజాస్వామ్యాన్ని రక్షించడం’ పేరిట ఒకేలా వ్యవహ రించారు. అది యూరప్ పరిశ్రమలను బలహీనపరచింది. ఇది ఐరోపా ఖర్చుతో యు.ఎస్.ను బలోపేతం చేస్తుంది, యు.ఎస్. సామంత-ప్రాంతంగా ఐరోపాను క్రింది స్థానంలో ఉంచుతుంది. యు.ఎస్ గ్యాస్ ఉత్పత్తిదారులు మాత్రం లాభాలు అనుభవిస్తారు.
ఈ ఆర్ధిక రాజకీయ ప్రయోజనాల దృష్టి తోనే అమెరికా అధ్యక్షులు ఉక్రేనియాను రష్యాకు వ్యతిరేకంగా ఒక దశా బ్దకాలంగా ప్రోత్సహిస్తూవచ్చారు. అంతర్గతంగా జోక్యం చేసుకుంటూ, రష్యాను దెబ్బతీయటానికి దానిని రెచ్చగొడు తూ వచ్చారు. యుద్ధం వరకూ తెచ్చారు. ఎంతో రెచ్చగొట్టి తీరా యుద్ధం వచ్చాక ఉక్రేనియాను తన దారికి తనను వదిలివేశారు.
అమెరికా, ఇతర సామ్రాజ్యవాద దేశాలు మాటలు ఎంతగా గుమ్మరించాయో అంతగా ఉక్రేయిన్ కు [ఆశించినంత] సాయం చేయటం లేదు. తమ సైన్యాలను పంపటం లేదు. కావాలంటే కొంత యుద్ధ సామాగ్రిని అమ్ముతా మంటున్నాయి, జర్మనీ హెల్మెట్లు పంపగలం కాని మిలిటరీ సాయం ఇవ్వలేమని చెప్పారు. మరికొందరు తమ మద్దతు ఆయుధ సహాయం రూపంలో మాత్రమే ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికా, యూరప్ వారి మాటలకు చేతలకు చాలా తేడా వుంది. అన్ని యూరప్ లేక నాటో దేశాలు అమెరికాను పూర్తిగా సమర్థించటం లేదనీ, అందరూ ఉక్రేయిన్ వెనుక లేరని, యుద్ధం పట్ల వారిలో విభేదాలు వున్నాయని ఇది సూచిస్తోంది.
యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా పై ఆర్థిక ఆంక్షలు మాత్రం ప్రకటించారు. ఆర్థిక ఆంక్షలను నిశితంగా పరిశీలిస్తే అవి అంత ప్రభావవంతంగా లేవని అర్థమవుతుంది. రష్యా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక నిల్వలలో ఒకటిగా ఉంది. దాని ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. స్విఫ్ట్ నుంచి దాన్ని మినహాయించినా దాన్ని తట్టుకునే సామర్థ్యం కలిగిన ఆర్థిక లావాదేవీల వ్యవస్థ వారికి వుంది. అంతేకాక చైనా వంటి దేశాలు ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తున్నాయి. బహుశా, రష్యా ఆంక్షలను ఎదుర్కోగలదు. అమెరికా పెత్తందారీ అధికారాన్ని ప్రదర్శించటమే తప్ప ఆర్ధిక ఆంక్షలు రష్యాను కట్టి వేయలేవు. ఈ విషయం ఆంక్షలు విధిస్తున్న వారికి కూడా తెలుసు. అయితే ఈ ఆంక్షలు ద్విముఖ నష్టంగా మారవచ్చు. ఆంక్షలు విధించిన వారికే ఎక్కువ నష్టం కలిగించవచ్చు. కార్పొరేట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్ నిర్వహణ, స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల చట్రంలో దేశీయ స్వావలంబనకు బదులుగ ఇతర దేశాలపై పరస్పరం ఆధారపడటాన్ని వృద్ధి చేసింది. అందువల్ల చమురు, బొగ్గు, ఖనిజాలకోసం రష్యా పై ఆధారపడుతున్న ఐరోపా దేశాలకే ఈ ఆంక్షలు నష్టకరంగా మారతాయి తప్ప రష్యా కూలిపోయేదేమీ వుండదు. .
రష్యా నుంచి దిగుమతులు లేకపోతే యూరోపియన్లకు చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయి.ద్రవ్యోల్బణం పెరుగుతుంది. క్షీణిస్తున్నసరఫరా వ్యవస్థలు, స్టాక్ మార్కెతల పతనం, వినియోగదారుల ఖర్చులతో,భయం కరమైన”ఆర్థిక అనిశ్చితి” ఏర్పడుతుంది. రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలు త్వరలో బూమరాంగ్ అవుతాయి. ఆంక్షలలో భాగంగా జర్మనీ ఇప్పుడు నార్డ్ 2 గ్యాస్ లైన్ కమిషనింగ్ ను స్తంభింపజేసింది. కానీ, మరో పైప్ లైన్, పనిచేస్తోంది. తూర్పు యూరప్ దేశాలలో చాలా వరకు రష్యన్ గ్యాస్ పై ఆధారపడి ఉన్నాయి, ఈ సరఫ రాలు ఆంక్షల వల్ల ఆగిపోలేదు. జో బిడెన్ విధించిన పుతిన్ వ్యతిరేక ఆంక్షల ఫలితంగా సంభవించే అధిక ధరలను ఈ దేశాలు ఎన్ని బిలియన్ డాలర్ల ఖర్చువరకు సహిస్తాయి? మరింత తీవ్రమైన ఆంక్షల వల్ల పౌర జనాభాపై పడే ప్రభావం ఏమిటి?యుద్ధం కొనసాగటంవల్ల దేశ ఆర్ధిక వ్యవస్థలపై పడే దుష్ప్రభావాన్ని బాలహీనపడిన ఆర్ధిక వ్యవస్థలతో వీరు తట్టుకోగలరా? ప్రజా జీవితంలో ఏర్పడే అల్లకల్లోలాన్ని నివారించగలరా అన్నవి, అన్నీ పక్షాలు ఆలోచించవలసిన ప్రశ్నలు.
యూరోపియన్ శక్తులకు, అమెరికాకు మధ్య వున్న వైరుధ్యాలు కూడా రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలను వాస్తవం లో నీరుగార్చుతాయి. రష్యా నుండి చవకగా పొందుతున్న గ్యాస్ మానేసి, అమెరికా నుండి, కెనడా నుండి యూరప్ గాస్ కొనాలని అమెరికా ఆసక్తిగా ఉంది, రష్యన్ గ్యాస్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోమని చెప్పడం వెనుక నిజమైన ఉద్దేశం అమెరికాపై ఐరోపా ఆధారపడటాన్ని పెంచుకోవడం, అమెరికాకు కొత్త మార్కెట్ను తెరవడం. తమ కు ఆర్ధిక భారంగా మారే ఈ ప్రతిపాదన అమలు చేయటానికి జర్మనీ, ఫ్రాన్స్ ఇష్టపడటం లేదు.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనప్పటి నుండి, యుఎస్ సామ్రాజ్యవాదం ఐరోపాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. ఇంతకు ముందు సోవియట్ సామ్రాజ్యవాదం వార్సా ఒప్పందం ద్వారా తూర్పు యూరప్ దేశాలపై నియంత్రణ, ఆధిపత్యం కలిగి ఉండేది. సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదం తన ఆఖరి రోజుల్లో వార్సా ఒప్పందాన్ని రద్దు చేయడానికి అంగీకరించింది. బదులుగా నాటో తూర్పువైపుకు విస్తరించ కూడదనే హామీని కోరింది. ఆ మేరకు అందరూ అంగీకరించారు కూడ. కానీ సోవియట్ యూనియన్ పతనమై అనేక స్వతంత్ర దేశాలుగా విడిపోవటంతో, అమెరికా సామ్రాజ్యవాదం ఈ ఒప్పందాన్ని విస్మరించి నాటోను విస్తరించడం ప్రారంభిం చింది. రష్యా పై శాశ్వతంగా ఒక అంకుశం ఉండేలా చూడడమే దాని లక్ష్యం. 1991 లో 16 దేశాలు గల నాటో గ్రూపు లో 14దేశాలు కొత్తగా చేరాయి, ఇవన్నీ తూర్పుఐరోపా దేశాలు. వారు అప్పటి నుండి అమెరికాకు దగ్గరగా ఉన్నారు.
సోవియట్ పతనం తరువాత అమెరికా సామ్రాజ్యవాదులు తమ ‘అమెరికన్ శతాబ్దం’ నిజంగా ప్రారంభమైందని, వారికి పోటీగా నిలబడే సామర్థ్యం ఎవరికీ లేదని నిర్ధారిం చుకున్నారు. ప్రపంచంపై సంపూర్ణ ఆధిపత్యం ఉన్న ఏకైక శక్తి తమదేనని వారు అహంకారంతో ప్రకటించారు. ఈ ఆలోచనతో వారు యూరప్ తో సహా ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, దురాక్రమణలను పెంచి పోషించారు. ఏక ధృవ ప్రపంచంగా మార్చడానికి ఏక పక్షంగా ప్రణాళికలు రచించారు. ఏ వ్యతిరేకత నయినా విస్మరించటం లేదా అణచివేయడం ద్వారా తమ ఇష్టారాజ్యం సాగించాలని ప్రయత్నించారు. ఐరాస అభిప్రాయాలను, ప్రపంచ ప్రజాభిప్రాయాలను ఖాతరు చేయడం మానివేశారు. ఇది సెర్బియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సోమాలియా ఇంకా అనేక ఇతర దేశాలపై దాడి చేసింది. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణకు వెలుపల ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధీనంలో పనిచేస్తున్న సైనిక దళంగా నాటో రూపాంతరం చెందింది.
అయితే, అనేక దేశాలలో అది ఎదుర్కొన్న ప్రతిఘటన వారిని కలవరపెట్టింది. నేదు ఆ గ్రూపులోని సభ్యులందరూ ఐక్యంగా లేరు . వారిలో అనేక అంతర్గత విభేదాలు వున్నాయి. అమెరికా నాయకత్వం మీద నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
అమెరికా అధిపత్యవాదం తన ఆజ్ఞలను బలవంతంగా అమలు చేయడంలో గాని, ఆయా దేశాల సంఘర్షణల నుండి బయటకు రావడంలో కానీ విజయం సాధించలేక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అంతులేని యుద్ధంలో చిక్కుకుంది. మరోవంక చైనా, రష్యాలు తమ బలాన్ని పెంచుకున్నాయి. చైనా ఒక బలమైన సామ్యవాద శక్తిగా మారింది. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ప్రపంచా న్ని ఆకట్టుకుంది. తన బలహీనతలను అధిగమించి రష్యా కూడా పుతిన్ ఆధ్వర్యంలో తన అధికారాన్ని,ప్రభావ ప్రాంతాన్ని క్రమంగా తిరిగి ఏర్పరచుకుంటోంది. తూర్పు ఐరోపాలోను, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా అమెరికా విస్తరణను ప్రతిఘటించడం ప్రారంభించింది. జార్జియా, అజర్ బైజాన్ లో యుద్ధాలు సిరియాలో అస్సాద్ పాలనను రక్షించడానికి దాని సాయుధ జోక్యం రష్యా పునరుద్ధరణకు ఉదాహరణలు. ఉక్రెయిన్ లో యుద్ధం ఈ విధానానికి కొనసాగింపు గానే చూడాలి. అయితే సోషల్ సామ్రాజ్యవాద దశలోని దూకుడు, దురాక్రమణ స్వభావం తో కాక, తన అధికారాలను, ప్రాంతాలను, ప్రభావ పరిధిని కాపాడుకునే రక్షణాత్మక లక్ష్యంతో వ్యవహరిస్తోంది. డానికి అవసరమైనప్పుడు సైనిక జోక్యం కూడా అమలు చేస్తోంది. నేటి రష్యాది సామ్రాజ్యవాదమే కానీ అది ప్రధాన శక్తి కాదు. తన ఉనికిని కాపాడుకోవటానికి నేడది చైనా సామ్యవాద శిబిరంతో సహకరించి కలిసి నడవవలసి వస్తోంది. నాలుగు దశబ్దాలకింద ఆఫ్ఘనిస్థాన్ లోనికి తన సైన్యాలు నడిపినప్పుడు దానిది విస్తరిస్తున్నఆధిపత్య అఫెన్సివ్ సామ్రాజ్య వాద స్వభావం, నేడు ఉక్రేనియాలో ప్రవేశించింది, ప్రపంచ శత్రువుగా మారిన అమెరికా సామ్రాజ్యవాద శక్తులను, వారి బంటులను ఎదిరించే, వారిని బలహీనపరిచి తన ఉనికిని కాపాడుకునే లక్ష్యంలో భాగమైన డీఫెన్సివ్ సామ్రాజ్యవాదం
ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాలలో బలహీనపడిన అమెరికా సామ్రాజ్యవాదం, దాని మిత్రదేశాలు పుతిన్ ను ప్రత్యక్షంగా ప్రతిఘటించే స్థితిలో లేవు అంతేకాక, ఈ కాలంలో చైనా సామ్యవాదం, రష్యా పెట్టుబడిదారీ విధానం కలిసి షాంఘై సహకారం, బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. ఇవి అమెరికా నియంత్రణలో ఉన్న ఐ ఎం ఎఫ్, ప్రపంచ బ్యాంకు కు సమాంతరంగా, ప్రత్యామ్నాయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థాగత ఏర్పాటుగా వృద్ధి చెందుతున్నాయి. మూడవ ప్రపంచ దేశాలకు ఆర్థిక దన్ను, పెట్టుబడులకు లాభసాటి వనరుగా చైనా ప్రముఖంగా ముందుకొచ్చింది. రష్యా వీటికి సహకరిస్తోంది.అమెరికా కున్న వ్యతిరేకతను విస్మరించి ఐరోపాలోని అనేక దేశాలు చైనా అంతర్జాతీయ వెంచర్లలో చేరడం ప్రారంభించాయి. వీటన్నిటి ఫలితంగా, అమెరికా ఏకైక నియంత్రణకు కాలం చెల్లి పోతున్నది. బహుళ కేంద్రిత ప్రపంచ వ్యవస్థ ఉద్భవించింది. ఉక్రెయిన్ లో మనం చూస్తున్నది ఈ ప్రపంచ వ్యవస్థ యొక్క వైరుధ్యాలు, ఈ ప్రపంచ వ్యవస్థ పెనుగులాటలే.
పరిణామాలు, పర్యవసానాలు
ఈ యుద్ధం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ముందుకు తెచ్చింది. కేవలం యుద్ధ వ్యతిరేకతతోనో, మానవతా కోణంలోనో రష్యా వ్యతిరేకతతోనో, అమెరికా వ్యతిరేకతతోనో, ఒక పెద్ద బలమైన దేశం చిన్నబలహీనమైన దేశం పై చేస్తున్న దాడి గానో దీన్ని చూడకూడదు. రష్యన్ దురహంకారం అని స్థూలంగా కొట్టిపారవేయలేము.
ఉక్రెయిన్ యుద్ధంలో ముందుకు వచ్చిన పరిణామం ఒక వైపు యుఎస్ సామ్రాజ్యవాదమూ, దాని మిత్రదేశాల మధ్య పెరుగుతున్నవివాదమూ,మరొక వైపు రష్యన్ సామ్రాజ్యవాదమూ చైనా సామాజికవాదాల మధ్య నెలకొంటు న్నసయోధ్య. ఇది ఒక కొత్త ప్రపంచ క్రమాన్ని ఏర్పాటు చేయడానికి, సామ్రాజ్యవాద వ్యతిరేక విశాల ఐక్య సంఘటన ప్రయత్నానికి, ఇప్పటికే వొదులుగా వున్న ఒక అనిశ్చిత ఐక్యతను కాపాడే దిశగా ఒక వ్యూహాత్మక చర్యకు ప్రాతి నిధ్యం వహిస్తుంది.
ఉక్రేయిన్ ప్రజలకు, డోన్ బాస్ రిపబ్లిక్ ల ప్రజలకు గల జాతీయ ప్రయోజనాలు ప్రస్తుతం సామ్రాజ్యవాద శక్తులకు లోబడి ఉన్నాయి. అవి నిజమైన జాతీయ ఉద్యమాలుగా ఎదగవలసి వుంది. యుఎస్ సామ్రాజ్యవాదం, దాని పావులు గా వ్యవహరిస్తున్న ఉక్రేనియన్ పాలకులకు భిన్నంగా స్వతంత్రమైన జాతీయ ప్రతిఘటన ఒకటి వుంది. సామ్రాజ్యవాదుల నుండి ఈ జాతీయ శక్తులు వేరుపడ వలసివుంది. యుద్ధ క్రమంలో ఈ పరిణామం త్వరితం కావచ్చు.
సోవియట్ యూనియన్ ఏర్పాటులో ఉక్రెయిన్ ముఖ్యమైన పాత్ర పోషించింది. జార్ చక్రవర్తుల పాలనలో దాని స్వయం నిర్ణయాధికారం నిరాకరించబడింది. రష్యన్ విప్లవం జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని అంగీకరించి, వారికి విడిపోయే హక్కు సైతం వుందని స్పష్టం చేసింది. ఉక్రేయిన్ జనాభాలో 17 శాతం మంది జాతిపరంగా రష్యన్ లు ఉన్నారు. రష్యన్ సంస్కృతి, సాహిత్యం శతాబ్దాల నుండి ప్రభావవంతంగా ఉన్నాయి. అందువల్ల రష్యన్ మాట్లాడేవారి జనాభా గణనీయంగా ఉంది. రష్యన్ సోవియట్ యూనియన్ యొక్క అధికారిక భాషగా ఉండగా, ఉక్రేనియన్ భాష అక్కడి పాఠశాలల్లో తప్పనిసరిగా బోధించేవారు. ఇది జాతీయ భాషలు, సంస్కృతులపై లెనినిస్ట్ విధానం ఫలితంగా జరిగింది. అయితే పుతిన్, ఉక్రెయిన్ని ఒక జాతిగా గుర్తించడం, ఉక్రేనియన్ ను (ఇది రష్యన్ మాండలికం మాత్రమే) ఒక ప్రత్యేక భాషగా అంగీకరించడం, లెనిన్ మరియు బోల్షివిక్కులు చేసిన రెండు ‘నేరాలు’. అని భావిస్తాడు, కానీ నేటి భౌగోళిక రాజకీయాల వాస్తవాన్ని తాను గుర్తిస్తానని, వాటిని అంగీకరిస్తున్నానని ప్రకటించాడు. రష్యన్ మహా సామ్రాజ్య స్థాపన ఉద్దేశ్యం తనకు లేదని ప్రకటించాడు. కానీ రష్యన్ ఆధిపత్య భావన- ఉక్రేయిన్ ప్రజల జాతీయ ప్రయోజనాల మధ్య వైరుధ్యం కూడా ఈ యుద్ధంలో ఒక అంశం.
స్వాతంత్ర్యం పొందిన తరువాత, ఉక్రెయిన్ యొక్క కొత్త పాలకులు జాతీయ అల్పసంఖ్యాక వర్గాల [ఉక్రేయిన్ రష్యన్ ల] పట్ల అణచివేత విధానాన్ని అవలంబించారు. ఉక్రెయిన్ జాతీయ గుర్తింపును బలోపేతం చేసే పేరుతో, వారు జాతీయ దురహంకారాన్ని చురుకుగా ప్రోత్సహించారు. రష్యన్ వాడకాన్ని నిషేధించారు. స్థానిక అధికారిక భాషగా రష్యన్ ని గుర్తిస్తున్న చట్టాన్ని2014 లో రద్దు చేశారు.ఈ జాతీయ అణచివేత రష్యన్ కళాకారులను , సాంస్కృతిక కార్యకలాపాలను, సంగీతాన్ని నిషేధించే స్థాయికి వెళ్ళింది. వీటన్నిటిలో కచ్చితమైన దురహంకార రాజకీయ భావజాలం, మితవాద దృక్పధం ఉంది. హిట్లర్ దళాలతో చురుకుగా సహకరించిన ఒక ఉక్రేనియన్ నాజీ నాయకుడు జాతీయ హీరోగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ విధానాలు, చర్యలు అన్నీ దేశంలోని రష్యన్ మెజారిటీవున్న ప్రాంతాలలో చాలా అశాంతిని కలిగించాయి. తమ భాష, సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే విభజన అనివార్యమనే భావన బలంగా మారింది. ఇది రష్యాచే మరింతగా ప్రేరేపించబడింది, అది లుహాన్ స్క్, డోంట్ స్క్ లలో వేర్పాటువాద ఉద్యమాలుగా బయల్పడింది.
ఉక్రేయిన్ తూర్పు ప్రాంతం రష్యా మెజారిటీ, రష్యా సాంస్కృతిక ప్రభావం మేళవించుకున్న ప్రాంతం. పశ్చిమ భాగంలో ఉక్రేయన్ జాతీయ అహంకారం, నియో నాజీ ప్రభావం ఎక్కువ. ఈ వైవిధ్యాన్ని పశ్చిమ సామ్రాజ్యవాదులు తమ ప్రయోజనాలకు అనువుగా ఉపయోగించుకుంటున్నారు. రష్యా కూడా దీనిని ఉపయోగించుకుంటోంది. ఇది కూడా ఈ యుద్ధంలో ఒక అంశం. ఉక్రేనియన్ ప్రజల జాతీయ ప్రతిఘటన మాదిరిగానే, రష్యన్ జాతీయ మైనారిటీ జాతీయ ప్రతిఘటన కూడా వున్నది అయితే ఈ రెండు ధోరణులు తగినంత స్పష్టతను, దేశ గమనాన్ని నిర్దేశించగల ప్రభావ శీలతను సంతరించుకోలేదు. .
ఉక్రేయిన్ పాలకుల అణచివేతతో బాధపడుతున్నప్పటికీ, ఆ దేశంలోని రష్యన్ మాట్లాడేవారిలో అధికులు తమను తాము ఉక్రానియన్లుగా భావిస్తారు. ఉక్రానియన్ మాట్లాడేవారికి కూడా, రష్యన్ భాష, సంస్కృతి పరాయివి అన్న భావన లేదు. పాలకుల దురహంకార విధానాలు ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఉక్రేయిన్ గుర్తింపు అనేది ఉక్రాయిన్, రష్యన్ అంశాలు పరస్పరం ముడిపడి మేళవించిన ఒక గుర్తింపు. అందుకే రష్యాలో ఉక్రేయిన్ మీద యుద్ధం తగదంటూ కొన్ని యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి.
అయితే వివిధ సమూహాల ప్రజల న్యాయమైన ప్రయోజనాలు ఈ యుద్ధంలో భాగంగా వినిపిస్తున్నప్పటికీ, అది ప్రధాన కారణం కాదు. సామ్రాజ్యవాద శక్తుల ప్రమేయం. వారు చేస్తున్నఅణచివేత ప్రస్తుతం ప్రధాన అంశం. విప్లవకారులు, అభ్యుదయవాదులు, సామ్రాజ్యవాద శక్తుల పన్నాగాలను బహిర్గతం చేయాలి. అందునా ఆగ్రేసివ్ సామ్రాజ్యవాదం-డిఫెన్సివ్ సామ్రాజ్యవాదం మధ్య వున్న వైరుధ్యాలను గుర్తించాలి, వాటిని ప్రపంచ ప్రజా విప్లవ పురోగమనానికి వినియోగించుకోవాలి. ఈ యుద్దం సామ్రాజ్యవాదులు పరస్పరం కలహించు కుంటున్న యుద్ధం అని ఉపేక్షించటం లేదా ఇద్దరినీ సమానంగా నిరసించటం తగదు.
ఇక భారత పాలక వర్గాల పాత్రను కూడా పరిశీలించాలి. స్వాతంత్ర్యం వచ్చింది మొదలు భారత్ ఇబ్బందులలో వున్నప్పుడు సోవియట్ యూనియన్ ఆర్ధికంగాను, ఆయుధాలతోనూ మనలను ఆదుకుందని చెబుతున్నారు. కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా ఎల్లప్పుడూ మన పక్షాన వుంది. బంగ్లాదేశ్ ఏర్పాటులో మనతో పూర్తిగా సహకరించింది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో మనకు ఇబ్బంది కలిగినప్పుడల్లా రష్యా మనకు తోడుగా నిలిచింది. అవసరమైనప్పుడు తన వీటో అధికారాన్ని ఉపయోగించి భారత్ కు అండగా నిలబడింది. కనుక ఇప్పుడు మనం రష్యాను సమర్థించాలి. కష్టకాలంలో మనలను ఆదుకున్న రష్యా వైపు నిలవడం సముచితం అని భావిస్తున్నారు. రష్యా చర్యలన్నీ వాస్తవంలో భారత ప్రజానీకపు జాతీయ ఆకాంక్షలను సమర్థించటం కాక, భారత పాలకవర్గాల జాతీయ దురహంకార చర్యలకు, ప్రాంతీయ పెత్తందారుగా తనను తాను నిలబెట్టుకోవటానికి చేసిన ప్రయత్నాలను సమర్థించటంగానే చూడాలి. ప్రస్తుత వివాదం లో పైకి తటస్థంగా వున్నట్లు ప్రకటిస్తున్నప్పటికి . రష్యాతో తనకున్న సంబంధం దృష్ట్యా దాన్ని పరోక్షంగా, పూర్తిగా సమర్ధిస్తోంది. ఇతరులు అన్నట్లు రష్యాను దురాక్రమణ దారు అని పిలవటం లేదు. ఐరాస ఓటింగ్ లో పాల్గొనకుండా రష్యాకు పరోక్ష సమర్ధన ఇస్తోంది. మరోవంక అమెరికా, యూరప్ దేశాలతో వున్న సంబంధాల దృష్ట్యా ఈ యుద్ధాన్ని ప్రేరేపించిన, పరోక్షంగా కారణ మయిన అమెరికా బాధ్యతను ఏమాత్రం విమర్శించటం లేదు. అమెరికాతో వాణిజ్యాలు,ఆయుధ ఒప్పందాలు ,వారి ప్రపంచ వ్యూహాలలో ముక్యంగా ఆసియా వ్యూహంలో భాగస్వామిగా వారి సేవ చేస్తున్న సంబంధంతో అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క మాటా మాట్లాడటంలేదు. యుద్ధంలో వున్న ఇరు పక్షాలకు సమాన దూరంలో వున్నానని చెప్పు కుంటూ, వారి మధ్య దౌత్యానికి, శాంతి నెలకొలపటానికి తాను ఈ వైఖరి తీసుకున్నానని ప్రకటించింది. అయితే ఉక్రేయిన్ ఈ వైఖరిని తిప్పికొడుతూ “మాదేశంలో వున్న మీ పౌరుల క్షేమాన్నిదృష్టిలో పెట్టుకుని ఐరాస లోమాకు అనుకూలంగా వోటు చేయండి” అని హెచ్చరిస్తోంది. తనకు పూర్తిగా సహకరించటం లేదని మనపై అమెరికా కినుక వహిస్తుంది. ఒక సూత్రబద్ధమైన, స్వతంత్ర వైఖరీ లేకపోవటం వల్ల ప్రస్తుతం ఏమి చేయాలో పాలుబోవని స్థితిలో వుంది భారత ప్రభుత్వం. అలీనం క్రింద తలదాచుకుంటోంది. అంతేకాదు ఈ సందర్భంలో కూడా తన చైనా వ్యతిరేక స్వభావానికి అనుగుణంగా సంబంధం లేని తైవాన్ అంశం లేవనెత్తుతోంది. భారత-చైనా సరిహద్దు వివాదాలను ప్రస్తావిస్తోంది. క్వాడ్ గ్రూపు ప్రచారాన్ని చేస్తోంది. ఇల్లు తగల బడుతుంటే తాను చలి కాచుకునే ప్రయత్నం చేస్తోంది. భారత ప్రభుత్వ ఈ వైఖరిని ఎండగట్టకుండా మనం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఎంత అరిచి గీపెట్టినా ఉపయోగం లేదు. ఈ సామ్రాజ్యవాద ప్రేరేపిత యుద్ధాన్ని అంతం చేయడానికి క్రింద పేర్కొన్న అవగాహనతో అందరూ గొంతుకలపాలి .
ఏమి చేయాలి
1 రష్యా, ఉక్రేయిన్ లు యుద్ధానికి పరిసమాప్తి పలికేలా అన్నీ రకాల చర్యలు తీసుకోవాలి. దౌత్యపరమైన చర్యలు చేపట్టాలి. మొదలు పెట్టిన శాంతి సంభాషణలను అర్థవంతంగా, పరస్పర ప్రయోజనకరంగా కొనసాగించాలి యుద్ధం లోచిక్కుకుని ఉన్నప్పటికీ, ఇరు పక్షాలు ఏ షరతులు లేకుండా ద్విపక్ష సంభాషణలకు పూనుకోవటం హర్షించ వలసిన విషయం. వీరి మధ్య విభేదాలను పెంచుతున్నవిదేశీ పెత్తందారుల, ఆధిపత్యవాదుల వ్యూహాలకు, కుట్రల కు బలికాకుండా తమ జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా పరిష్కారాన్ని సాధించాలి. అంగీకారం సాధ్యమని గుర్తించిన అంశాల ఆధారంగా చర్చలు కొనసాగించాలి
- చిన్నవైనా, పెద్దవైనా దేశాల సార్వభౌమాధికారాన్ని అందరూ గుర్తించాలి, గౌరవించాలి. తదనుగుణంగానే వ్యవహరించాలి. ఐరాస చార్టర్ కు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, విభేదాలను పరిష్కరిం చుకోవాలి. వివాదం లో చిక్కుకున్న పక్షాలు సంయమనంతో, యుద్ధ విరమణకు పూనుకోవాలి. పరిస్థితి మరింత జటిలం కాకుండా జాగ్రత్త వహించాలి. శాంతిని పునరుద్ధరించాలి .
- ఆయా దేశాల రక్షణ, భద్రతలకు ముప్పుకలిగే విధంగా పొరుగు దేశాలు వ్యవహరించటం, కూటములు కట్టటం మానుకోవాలి. భద్రత విషయంలో ఇరుపక్షాల భావాలను, అవసరాలను గుర్తించి పరస్పరం సంతృప్తి చెందే నిర్ణయా లు తీసుకోవాలి. అనవసర సంకోచాలకు, భయాలకు, పెత్తందారీతనాలకు చోటుండ రాదు, ప్రస్తుత సమస్యకు మూలం యూరప్ లో భద్రతా సమస్య, రష్యాను బంధించేలా నాటో ను విస్తరించటం కనుక, రష్యా-ఉక్రేయిన్ లతోపాటు, రష్యా-యూరప్ దేశాల మధ్య కూడా సంభాషణలు జరగాలి. పరిష్కారం కనుగొనటంలో దౌత్య మార్గాలను వినియోగించు కోవాలి. యుద్ధం అంటే రాజకీయాల కొనసాగింపే , కనుక సమస్యలకు రాజకీయ పరిష్కారం సాధించనిదే యుద్ధం ముగియబోదు అన్నఎరుకతో ప్రయత్నించాలి. కేవలం యుద్ధం ఏ సమస్యనూ పరిష్కరించలేదు. మిలిటరీ కూటములు, వాటి జోక్యం ప్రాంతీయ సమస్యలను పరిష్కరించవు. అవి సుస్థిరతను, శాంతిని సాధించలేవు,నిలబెట్టలేవు.
4.యుద్ధాన్ని ప్రజ్వలింప జేసె ప్రకటనలకు ఇరుపక్షాలు, వారి మద్దతుదారులు స్వస్తి పలకాలి. అణ్వాయుధ ప్రయోగం వంటి తీవ్ర చర్యలకు, బెదిరింపులకు పూనుకోకూడదు. జనావాసాలను, పౌర నిర్మాణాలను,సాధారణ పౌరులను యుద్ధం నుండి మినహాయించాలి. వాటికి నష్టం కలగకుండా చూసుకోవాలి. వాటిని దాడికి కేంద్రాలుగానో, లేక రక్షణ కవచాలుగానో యుద్ధంలోకి లాగకూడదు. మానవీయ దృష్టితో మానవ విషాదాన్ని సాధ్యమయినంత తగ్గించాలి.
- గత కొంతకాలంగా అమెరికా సామ్రాజ్య వాదులు, యూరప్ దేశాలు ఉక్రేయిన్ ను సాయుధం చేయటానికి, ప్రజాస్వామ్యం పేరిట, జాతీయ లక్ష్యం పేరిట అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటూ, స్థానిక ప్రభుత్వాలను కూడా మార్చివేసాయి. జాతీయ ఆకాంక్ష పేరిట సామ్రాజ్యవాద అనుకూల ఉద్యమాలను, తిరుగుబాట్లను ప్రోత్సాహిస్తు న్నాయి. ఒక ఉక్రేయిన్ మాత్రమే కాదు అనేక యూరప్ , ఆసియా ఆఫ్రికా దేశాలలో సామ్రాజ్యవాడులు ఇలాగే వ్యవహరించి ఆ ప్రాంతాలలో ఆరని కుంపట్లు పెడుతున్నారు. ఆయా దేశాల ప్రజలలో ఒక భాగం, పాలకులు ఈ వాదాలకు ఆకర్షితులై ఆధిపత్యవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఏ జాతీయ ఉద్యమమైనా సామ్రాజ్యవాద వ్యతిరేకంగా, ఆధిపత్య వాదులకు వ్యతిరేకంగా జాతీయ లక్షణాలు కలిగి వున్నపుడే ప్రజాస్వామికమైన ఉద్యమం కాగలుగుతుంది. నేటి అర్ధవలస దశలో, సామ్రాజ్యవాదులే, తమకు అనుకూలంగా లేని స్థానిక పాలకులకు వ్యతిరేకంగా అనేక జాతీయ ఉద్యమాలను ప్రేరేపించి తమ ప్రయోజనాలకు అనుకూలంగా నడిపించటం జరుగుతోంది. ఇలాటి కృత్రిమ, కుహనా జాతీయ ఉద్యమాల పట్ల ప్రగతివాదులు బహు జాగ్రత్తగా వుండాలి. వీటిని కచ్చితంగా వ్యతిరేకించాలి.
- ప్రస్తుత సంక్షోభంలో అమెరికా తదితర యూరోపియన్ సామ్రాజ్యవాద దేశాల కుట్రలను బహిర్గతం చేసి వారి పాత్రను ఖండించాలి. వారు ఉక్రేయిన్ లో చేస్తున్న ఆయుధీకరణను, ప్రజాస్వామ్య పరిరక్షణ నాటకాలనీ ఖండించాలి. ప్రస్తుత యుద్ధానికి వారే కారణ భూతులన్న విషయం చాటి చెప్పాలి. అమెరికా సామ్రాజ్యవాడుల అభీష్టం మేరకు ఉక్రెయిన్ పాలకులు గత ఏడు,ఎనిమిది సంవత్సరాలుగా, రష్యన్ ఉక్రేనియన్లపై సాగిస్తున్న దమన కాండ, వేలాది మంది ప్రాణాలు హరించిన హత్యాకాండ ఈ యుద్ధానికి ప్రేరేపకమన్న వాస్తవాన్ని విశదీకరించాలి.
7.భారత ప్రభుత్వం అనుసరిస్తున్న అవకాశవాద, సూత్రరహిత విదేశీ విధానాన్ని, ప్రతి సందర్భాన్ని తన చైనా వ్యతిరేక ప్రచారానికి వాడుకోవడాన్ని ఖండించాలి. సామ్రాజ్యవాద యుద్ధాలను. విధానాలను – ఆధిపత్యవాదవ్యతిరేక ప్రతిఘటన లను, ప్రజాందోళనలను ఒకే దృష్టి తో చూసి వాటిని సమానంగా పరిగణించడం చారిత్రక దృష్టి కాబోదు.
- యుద్ధం ఎప్పుడైనా, ఎక్కడైనా వినాశకరమే. విధ్వంసకరమే, అది బీభత్సమే. మానవాళి యుద్ధానికి దూరంగా శాంతికి దగ్గరగా మనుగడ సాగించవలసిందే, అయితే ప్రజల శాంతి ప్రియత్వం ఆధిపత్యవాదుల గుత్తాధిపత్యాన్ని సహించేదిగా వుండ రాదు. నిరంకుశ విధానాలను ప్రతిఘటించలేని ఆకర్మణ్య విధానం కారాదు. దుర్మార్గానికి తల వంచేదిగా వుండరాదు. జాతుల పట్ల, దేశాల పట్ల అమలవుతున్న దోపిడి, దౌర్జన్యాలను మౌనంగా భరించేదిగా వుండరాదు. వాటిని ప్రతిఘటించి ఓడించక తప్పదు. చిరమైన శాంతికి ఐక్య ప్రజా ఉద్యమమే నిజమైన గ్యారంటీ. మన యుద్ధ వ్యతిరేకత శ్మశాన శాంతి కోసం కాదు. కారాదు. అధిపత్యవాదుల మెడలు వంచి వారిని నిర్వీర్యం చేసి నెలకొలిపే నిజమైన శాంతి కావాలి. ప్రపంచ శాంతి కాముకులందరూ ఈ విధమైన శాంతి ఉద్యమంలో భాగంగా సామ్రాజ్యవాద యుద్ధాలను నిరసించాలి.
Source:
1 ఎరిక్ జుస్సే — 25/02/2022 కౌంటర్ కరెంట్స్
2.https://archive.is/cU1oa అలేగ్జాండర్ మెర్కొరిస్
౩. ఎం.కె. భద్రకుమార్, న్యూస్ క్లిక్ 26 /02 /2022 & 2 /3/22
(DrJatin Kumar is a Hyderabad based surgeon and social activist)