అడవిలో రాత్రి పడుకున్నాక నిద్రయేది? పక్షులు, జంతువులు సేద తీరుతున్న ప్రశాంతత. అయినా నిద్ర రావడం లేదు. సెలయేటి సవ్వడి తప్ప మరొక అలజడి లేని రాత్రి. ఆ నిశబ్ద, గంభీర వాతావరణంలో నిద్ర రావడమే లేదు. కారణం…
-భూమన్
ప్రకృతిలో ఎన్నిమార్లు సంచిరించినా ప్రతి మారు కొత్తగా ఉండటమనేదిప్రకృతి లక్షణం. ప్రతి సీజన్ లో ప్రకృతికి దగ్గరగా వెళ్లడం, ఆకురాలు వేళల్లో, ఆకులు తొడిగే కాలంలో, కాయలు కాసి, పండ్లయి, పండ్లు రాలుతున్నకాలంలో, బాగావర్షం కురిసి, ఆ వర్షంలో తడిసిన ప్రకృతిని, ఆ వర్షంలో మేము తడుస్తున్న తీరు…అనిర్వచనీయమయిన అనందాన్నికలిగిస్తుంది.
పైగా, ఈ కొండలు, అడవులు, చెట్లు, పుట్టల మధ్య తిరిగేటపుడు వీటి అంతు కనుక్కోవాలనే అభిలాష నాకుండేది. ఇపుడు గుంజన కోనకువెళ్లినా, సిద్ధలేరు కోనకు వెళ్లినా, విష్ణుగుండం వెళ్లినా, నారాయణ తీర్థం వెళ్లినా.. అక్కడి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నయి, వాటి ప్రయాణమార్గమేమిటి? ఎటువోతున్నాయి, ఎక్కడ జలపాతమేదూకుతున్నాయనే విషయాలనుకనుక్కోవాలనే ఆసక్తి ఎక్కువ.
ఈ దఫా తలకోనను గమ్యస్థానంగా ఎన్నుకున్నాం. అది రెండు రోజుల కార్యక్రమంగా పెట్టుకున్నాం. దీనికోసం కొంతమంది మిత్రులను పోగు చేసుకుని తలకోన ప్రయాణమయ్యాము. ఇంతకు ముందొక సారి ఈ తలకోన ఎక్కడు పుడుతుందో ఆస్థలాన్ని చూశాను. దానిని తలకోన బుగ్గ అంటారు. ఆబుగ్గ నుంచి వచ్చే నీళ్లన్నీమానసోల్లాస తీర్థంలోపడటం, అక్కడి నుంచి ప్రవాహంగా మారి తలకోన జలపాతం వైపు మళ్లడం చూశాను.
తలకోనకు పోయేటపుడు నెలకోన మార్గం లో ఎడమ వైపున ఉన్న ఒక కాలిబాటలో దాదాపు 3 కిలో మీటర్లు దూరం ప్రయాణం చేసిన తర్వాత తలకోన శిఖర భాగానికి చేరుకున్నాం. అక్కడినుంచి ఆ ప్రవాహం వస్తున్న దిశకు వెళితే మానసోల్లాస తీర్థం కనబడుతుంది. అదొక అద్భతమయన జలపాతం. ఇక్కడ నీళ్లలో చేయిపెడుతూనే చల్లగా జిల్లు మంటుంది.
అయినాసరే,ఈ చల్లదనం లెక్క చేయకుండా అక్కడి గుండంలో దూకి ఈతాడటం ఒక ఆహ్లాదకరమయిన అనుభవం. ఇంతటి చల్టటి నీళ్లలో ఎట్లా దిగడం అని మాలో కొందరు వెనకంజ వేశారు. చల్లదనం, వెచ్చదనం
అనుకుంటూ సంశయిస్తే ప్రకృతిని ఆనందించలేం. చల్లదనం లెక్క చేయకుండా గుండంలోకి దూకాం. ఒక గంట సేపు ఈదులాడం. అక్కడే మనవాళ్లు వంట చేశారు. భోజనాలయ్యాయి. నేనయితే రెండు పళ్లు తిని బయలుదేరను.
అక్కడి నుంచి ఒక కిలో మీటరు దూరాన ఎవో గుహలున్నాయని, అక్కడికి వెళ్లండని కొందరు మిత్రులు చెప్పారు. అక్కడి నుంచి ఒక లోయలో, సన్నటి దారిలో ఒకటిన్నర కిలోమీటరు ప్రయాణించాం. నిజానికది భయం గొలిపే దారి.
ఆ దారిలో ప్రయాణించి గుహలున్నచోటికి చేరుకున్నాం. వాటిని గుహలనలేం. ప్రాచీన కాలపు గుహలని అసలు చెప్పలేం. ఎవరో మైనింగ్ చేయడంలో గుహల్లాగా ఏర్పడిన నిర్మాణాలనిపిస్తుంది. అక్కడ ఎవరో ఏనుగు బొమ్మలు, శివ లింగాలు చెక్కడంతోపాటు పూజలు కూడా చేసినట్లు కనిపించింది.
మొదట్లో మాలో కొందరనుకున్నట్లు అక్కడెలాంటి ప్రాచీన చిత్రకళ కనిపించలేదు. కేవ్ ఆర్ట్ కూడా లేదు. గుహల కుడ్య చిత్రాలు లేవు. అయితే, అక్కడొక మెట్ల మార్గం ఉంది. అక్కడి నుంచి కొద్ది దూరం కిందికి వెళ్లితే జలపాతం దూకే అట్టడుగు ప్రాంతానికి చేరాం. అదే ఆశ్చర్యం. సాధారణంగా యాత్రికులు ముఖ్యంగా కింది నుంచే వచ్చి జలపాతం చేరుకుని స్నానమాచిరిస్తూ ఉంటారనిపించింది. ఇక్కడికి రావడానికి మరొక దారి ఉందనే ఈ విషయం ఇపుడే తెలిసింది. దీనితో జలపాతాన్ని పూర్తిగా చూసినట్లలయింది.
జలపాతం ఎత్తు, గర్జన, నీళ్లు దూకుతున్న తీరు… ఆ దృశ్యం గొప్పఅనుభూతి, ఆనందం. ఈ మెట్ల మార్గం ఎవరేశారు, ఎపుడేశారు, ఎందుకేశారు అనేవి తెలుసుకోవలసిన విషయాలు. ఈ మెట్ల మార్గం బాగా ఉన్నా పాతదిగా కనిపిస్తుంది. ఏవరైనా ప్రముఖుల కోసం వేశారేమో. పూర్వ కాలంలో చంద్రగిరి రాజులు ఈ మార్గాన జలపాతం చేరుకుని స్నానమాచరించారేమో అనిపిస్తుంది.
అక్కడి నుంచి పైకి ఎక్కి తలకోన శిఖర భాగానికి చేరుకున్నాం. కొండపైకి ఎక్కడం సులువుగానే జరిగిందనక తప్పదు. అయితే, తలకోన శిఖరానికి చేరుకున్నాక గుండెల్లో దడపుట్టే దృశ్యం కనిపిస్తుంది.
ఎందుకంటే, శిఖరం లోయ అంచున, చాలా అంచున ఉంటుంది. ఆ కొసన నిలబడుకుని చూసేందుకు వొళ్లు జలదరిస్తుంది. అయితే, అదే సమయంలో ఒక సుందర దృశ్యం కనిపిస్తుంది. అటు వైపు కొండ, ఇటువైపు కొండ, దూరంగా సిద్దలేరు, డ్యాం, కనుచూపు మేరా పరచుకున్న పచ్చ దనం… అపుడుపుడు మధ్యలో జంతువుల, పక్షల అరుపులు, శబ్దాలు అదొక వర్ణణాతీత అనుభవం.
కొండఅంచున కూర్చుని ఎంతసేపు చూసిన తనివి తీరదు. అక్కడినుంచి నాకయితే రావాలనిపించలేదు. ప్రకృతికి చాలా దగ్గిరగా జరిగి అక్కను చేర్చుకున్న అనుభవం ఈసారి నాకు మిగిలింది. అక్కడినుంచి ఇంకొంచెం పైకి వెళితే బేస్ క్యాంపు వస్తుంది. అయితే, అక్కడ నీళ్ల వసతి లేదు కనుక ఇక్కడే విడిది ఏర్పాటు చేసుకోవాలనుకున్నాం.
అనుకున్నదే తడవు విడిది ఏర్పాటయింది. చకచకా చక్కటి టీ తయారయింది. ఆ సాయం సంధ్యన, ఆ చల్లటి, చక్కటి, ఆహ్లాదకరమయిన వాతావరణంలో వేడి వేడి టీ తాగుతు చూట్టూర ఉన్న సుందరమయిన ప్రకృతిని ఆస్వాదించే తీరిక ఎవరికుంటుంది? అవకాశం ఎందరికొస్తుంది?
ఎక్కడ జారిపడతామో అనే భయం ఉన్నా, బిక్కు బిక్కుమంటూనే గడపాల్సివచ్చినా మరొపు వైన్న ఉల్లాసపూరిత మయిన వాతావరణం ఆ భయాన్ని పొగొట్టింది. ఈ గొప్ప అనుభవం పొందిన మేము ఒక విధంగా అదృష్టవంతులమే అనిపించింది.
రాత్రి బసచేసేందుకు అక్కడ టెంట్లు తయారయ్యాయి. మా బృందంలో 25 మంది ఉన్నారు. ఇందులో కొందరు మద్రాసు నుంచి వచ్చిన ఐటి ఉద్యోగులు కూడా ఉన్నారు. వారంతా చొరబడి చక్కటి రుచికరమయిన సాంబార్, అన్నం తయారు చేశారు.
మా టీమ్ గొప్ప సహజీవన అనుభవం. అంతాకలుపుగోలుగా ఉంటూ చుట్టుపక్కలంతా గాలించి ఎండిన కట్టెలు తీసుకువచ్చి, పొయ్యి వెలిగించి వంట చేయడం…క్షణాల్లో జరిగిపోయింది.
కట్టెలు తెచ్చే వాళ్లొకవైపు, కూరలు తరిగేవాళ్లొక వైపు, పొయ్యి వెలిగించే వాళ్లొక వైపు, క్యాంప్ ఫైర్ వేసేవాళ్లొక వైపు … ఈ సహకారం, సాహచర్యం కూడా ఒక గొప్ప అనుభవం. సొసైటీలో ఇలాంటి సామూహిక జీవనం పోయి, వైషమ్యాల దుర్గతి ఎలాపట్టిందో అనే వేదన కలిగింది నాకు. మా టీమ్ లో 30-35 సంవత్సరాలోపు వారే కాదు, పదేళ్ల లోపు పిల్లలుకూడా ఐదారుగురు ఉన్నారు.
ఆ రాత్రి అక్కడే గడిపాము. కాని విపరీతమయిన చలిగా ఉంది. ఇంత చలిని వూహించలేక పోయాం. అయితే, క్యాంప్ ఫైర్ మమ్మల్ని కాపాడింది. ఆ రాత్రి అద్భతంగా గడిచింది. దీనికి కారణం మాలో ఉన్న సుబ్బరాయుడు. ఇలాంటి కారడవుల ట్రెకింగ్ లో మాకు సబ్బరాయుడే దిక్చూచి. ఆయన అడవి అనుభవాల ఖని. రాత్రంతా వేట కథలు వినిపిస్తూనే ఉన్నాడు. అడవిలో ఏమేమి వింతలున్నాయో, ఏయే సందర్బాలలో ఎలాంటి జంతులొస్తాయో, జంతువులను ఎదుర్కోవాలసివచ్నిపుడు ఎలా సాహసం ప్రదర్శించాలో, పొదల మధ్య నక్కి నక్కి జంతువులనుంచి తప్పించుకున్న తీరు, వాటిని గమనించిన తీరు… కధలు కథలుగా చెబుతూంటే చిన్న పిల్లల్లా వింటూ నిద్ర మర్చిపోయి ఎంతసేపు గడిపామో కూడా గుర్తు లేదు.
నాకు చాన్నాళ్లుగా ఒక కోరిక ఉండేది. ఈ లోయల్లో, ఈ కొండల్లో ఈ చెట్ల మీద పొద్దుపొద్దునే తొలెండ ఎలా పరుచుకుని ఈ ప్రాంతమంతా అక్రమిస్తుందో చూడాలనేది ఆ కోరిక.
అదీరోజు నెరవేరబోతున్నది. పొద్దునే లేచాము. అయిదింటికే సూర్యుడి రాకకోసం, ఎండ కురుసే టైం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. ఎండ వచ్చేసింది, మొదట సన్నటి పొరలాగా వాలింది.చూస్తుండగానే దట్టమై అడవంతా ఆక్రమించడం మొదలుపెట్గింది. ఎండ రాకతో ఈ చెట్లూ చేమల్లో కూడా ఏదో పులకింత వచ్చినట్లు, ముఖం విప్పారినట్లు … ప్రకాశవంతమయ్యాయి. ఇది ఎంత ఆనందకరమయిన దృశ్యమో…అక్కడి నుంచి కొండవారంబడి మరింత దూరం పోతే, ప్రకాశవంతమయిన సూర్యుడి వెళుతురులో లోయ ఇంకా అందంగా కనిపించింది. అక్కడి నుంచి వెనుదిరిగి రావాలనిపించలేదు.
అయితే, ముందుకు సాగక తప్పదు. అక్కడి నుంచి కిందికి దిగగానే మరొక కోన తారసపడింది. దాని పేరు నేల కోన. ఇది చాలా అందమయిన ప్రదేశం. అక్కడకొక గుండం రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. ఈ పరిసరాలు, ఆ సౌందర్యం చూస్తే ఇది తుంబురు కోన తమ్ముడిలాగా ఉందని నేను మిత్రులతో అనేశాను. తుంబురు కోన లో ఒక కొండ రెండుగా చీలిపోయి ఉండటం, వాటి మధ్యలో పైనుంచి ఒక పెద్ద బండరాయి పడుతూ ఇరుక్కుపోయి ఉండటం, దాని కింద జలపాతానికి నీటి ప్రవాహం రావడం ఒక మనోహర దృశ్యం.
ఇక నేలకోన మడుగు విషయానికి వస్తే, ఇక్కడి మడుగులో నీళ్లలో చేయిపెడితే, జివ్వునలాగేసింది చల్లదనం. విపరీతమయిన చల్లదనమది. ఇక్కడ మునగడానికి కూడ వీలుకాలేదు. నేలకోనలో ఈత గొట్టరాదని అటవీ శాఖ వారు ఒక బోర్డు కూడా పెట్టారు. అక్కడ నీటి ప్రవాహం ఈతకు అనుకూలం కాదు. అందులో ఈత కొడితే ప్రమాదం జరగవచ్చని హెచ్చరిక అది. అక్కడి రాళ్ల మధ్య కూడ ఏవో తీగెలు అల్లుకుని ఉన్నాయి. ఇక్కడొకరకం తీగెలున్నాయి. అవి దాదాపు అయిదు కిలో మీటర్ల దాకా విస్తరించి ఉంటాయి. తుంబురు తీర్థం తర్వాత ఇలాంటి వాటిని చూడటం ఇక్కడే .
అక్కడి నుంచి మేం ఇంటి ముఖం పట్టాం అనిర్వచనీయంమయిన ఆనందంతో, ఉత్సాహంతో. ఎన్ని సార్లు చూసిన తనివితీరని ప్రదేశాలవి. ప్రకృతినుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయని ప్రతియాత్రలో నాకు తెలుస్తూ ఉంది. అడవుల్లో చెట్లు, పుట్టల, జంతువుల మధ్య సహజీవనానికి సంబంధించి ఏదో అలిఖిత ఒప్పందం జరిగనిట్లు అన్ని వొద్దికగాఉండటం చూడవచ్చు. ఇది మానవసమాజానికి వర్తించదా అనే ప్రశ్న తలెత్తుంది ఇక్కడున్నంత సేపు.
ట్రెకింగ్….
ఇక్కడ ఉన్నపుడు అల్లం శేషగిరిరావు ‘వేట కథలు’ గుర్తుకు వస్తాయి. ఇందులో ‘వఱడు’ అని ఒక కథ ఉంది. ఇది ఒక ముసలి హైనా మీది కధ . వఱడు అంటే ముసలి హైనా. వృధ్యాప్యం కాబట్టి అది ఆహారం కోసం నేరుగా జంతువుల మీద దాడి చేయలేదు. అందువల్ల జంతువుల మీదికి పులినో చిరుతపులినో ఉసిగొలిపి, పులి దాని మీద దాడి చేసి,తిని వెళ్లిపోయాక మిగిలిందే తాను తింటుంది. ఈ విషయం నాకు శేషగిరిరావు కథ తర్వాతే తెలిసింది.
ఈ సారి తలకోన యాత్రలో జలపాతం కోండపైభాగాన ఎక్కడి నుంచే పుడుతున్నదో అక్కడికి వెళ్లగలిగాం. అక్కడి నుంచి కిందికి దూకుతున్న ప్రదేశాన్ని కూడా సందర్శించాం. ఒక విధంగా చెబితే, దీనితో తలకోన అంతు తెల్చాం.
ఈ సత్యం జీవితానికి కూడా అవసరమవుతుంది. దేన్నయినా అంతుతేల్చే దాకా వదలరాదని,అపుడే ధ్రిల్ అని అర్థమవుతుంది. సమాజంలో ఉన్న కుళ్లు, కులం, మతం అంతు తేల్చేదాకా వదలరాదని నేను చెబుతాను. ప్రకృతి లో ఉన్న ప్రతిదీ, అంటే, ఆకురాలడం, ఆకు మొలవడం, పూలు పూయడం, కాయలు కాయడం,కాయ పండయిరాలి విత్తనమయి మళ్లీ మొలకెత్త్తడంలో సాఫీగా సాగే ఒక క్రమం ఉందని పిస్తుంది . ఇవ్వన్నీ గమనించడం గొప్ప అనుభవం. దీన్ని గుమనించేందుకే నేను ప్రకృతి ప్రయాణాలు మొదలుపెట్టాను.
అడవిలో రాత్రి పడుకున్నాక నిద్రయేది? పక్షులు, జంతువులు సేద తీరుతున్న ప్రశాంతత. అయినా నిద్రరావడం లేదు కేవలం సెలయేరు చేస్తున్న సవ్వడి తప్ప మరొక అలజడిలేని రాత్రి అది. అయితే, ఈ నిశబ్ద, గంభీర వాతావరణంలో కూడా నిద్ర రాలేదు. కారణం, ఈ వాతావరణం మనలను ప్రకృతి గురించి, ప్రకృతిని కాపాడుకోవడం గురించి ఏదో తెలియని లోతైన తాత్విక చింతన లోకి తీసుకు వెళ్లుంది. ఇదొక గొప్ప అనుభూతి. అలాంటి ఈ యోగం ఈ అడవిలో తప్ప మరొక చోట దొరుకుతుందని నేను అనుకోను.
(భూమన్ రచయిత, చరిత్ర పరిశోధకుడు, ప్రకృతి ప్రేమికుడు. తిరుపతి)