-టి.లక్ష్మీనారాయణ
అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం చారిత్రాత్మకమైనది. 800 రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగుతూ ప్రభుత్వ నిర్భందకాండకు ఎదురొడ్డి నిలబడింది. వెలగపూడి గ్రామం పొలిమేరల్లో నిర్వహించబడిన నిరాహారదీక్ష శిబిరంకు వెళ్ళి, ఉద్యమ భాగస్వామిగా ఐదారు గం.లు పాల్గొని, వేదిక పంచుకున్నాను.
గడచిన వంద సం.ల కాలంలో తెలుగునాట మూడు చారిత్రాత్మకమైన రైతాంగ పోరాటాలు జరిగాయి.
1. 1937-38లో ఒడిస్సా సరిహద్దుల్లోని ఇచ్ఛాపురం నుండి నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం రాజధాని మద్రాసుకు “రైతు రక్షణ యాత్ర”. దాదాపు 2500 కి.మీ. 100 రోజుల పాటు సాగిన ఆ యాత్ర జమీందారీ, ఎస్టేట్స్ వ్యవస్థ రద్దుకు శ్రీకారం చుట్టింది. ఆచార్య ఎన్.జి.రంగా గారు యాత్రను ప్రారంభించగా, కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి, చలసాని వాసుదేవరావు, గౌతు లచ్చన్న గార్లు నాయకత్వం వహించారు.
2. 1947 -50 మధ్య కాలంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం. ఫలితంగా నైజాం నిరంకుశ పాలనకు సమాధికట్టబడింది.
3. అమరావతి రాజధాని పరిరక్షణ కోసం రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు, ప్రత్యేకించి మహిళా రైతులు చొదకశక్తిగా ప్రభుత్వ నిర్భందకాండను, పోలీసుల లాఠీలను, అక్రమ కేసులను, అరెస్టులను, అవమానాలను ఏమాత్రం లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో 800 రోజులుగా అవిశ్రాంతంగా జరుగుతున్న ఉద్యమం తెలుగు జాతి ఆధునిక చరిత్రలో సువర్ణాక్షాలతో లిఖించబడుతుంది. సమర్థవంతంగా విజయపథాన నడుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట తీసుకొచ్చిన అత్యంత హానికరమైన వికేంద్రీకరణ చట్టం, సిఆర్డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకోవడంతో ఈ చారిత్రాత్మకమైన ఉద్యమం ఇప్పటికే ఘన విజయం సాధించింది.
కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు “నేను పట్టిన కుందేటి మూడే కాళ్ళు” అన్న చందంగా వ్యవహరిస్తూ, మరొక చట్టాన్ని తీసుకొస్తామని శాసనసభలో ప్రకటించడంతో అమరావతి రాజధాని పరిరక్షణ, అభివృద్ధి కోసం ఉద్యమాన్ని కొనసాగించడం అనివార్యమయ్యింది.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతున్నది. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తుతో నిర్మించి, నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా బహుళ ప్రయోజనాలు. మోడీ ప్రభుత్వంతో పోరాడి డిపిఆర్ -2 కు ఆమోదం పొందే నైతిక బలంలేని జగన్మోహన్ రెడ్డి గారు 135 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవడానికి వీలు కల్పించే మేరకు నిధులను సమకూర్చమని ప్రాధేయపడుతున్నట్లు వార్తలొచ్చాయి. దీని వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది.
మరొక వైపున రాయలసీమ ప్రాంతంలోను, ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు హంద్రీ – నీవా, గాలేరు – నగరి, తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు, త్రాగునీరు అందించడంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయి.
ఈ పూర్వరంగంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు – సమగ్రాభివృద్ధి కోసం, అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరచి, బలమైన ప్రజాఉద్యమంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఒక సామాజిక ఉద్యమకారుడిగా విజ్ఞప్తి చేశాను.