రష్యా – ఉక్రెయిన్ ఘర్షణ మీద ఒక వ్యాఖ్య

ఉనికిలోని “ప్రపంచ క్రమం” (world order) పై రష్యా ధిక్కరణ పై అంతర్జాతీయ వాదుల వైఖరి-ఒక వ్యాఖ్య

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

*ఉక్రెయిన్ కేంద్రంగా సాగే పరిణామాలు అంతర్జాతీయ వాదులకి ఓ పరీక్ష! వాటి పట్ల వారు ఏ వైఖరి చేపట్టాలనేదే ఆ రాజకీయ పరీక్ష!

*తాజా యుద్ధస్తితి సామ్రాజ్యవాద రాజ్య వ్యవస్థకూ రష్యా జాతి ప్రయోజనాలకీ మధ్య జరిగేదా?

లేదంటే,

*భిన్న సామ్రాజ్యవాద రాజ్యాలు లేదా శిబిరాల మధ్య జరిగే అంతర్గత వైరుధ్యంలో భాగమా?*

పై రెండింటిలో ఏది నిజం? ఇదో ప్రశ్న!

*ఒకవేళ మొదటి వైరుధ్యమైతే, రష్యా చేపట్టే ప్రతిఘటన రష్యన్ జాతీయ విమోచనోద్యమం క్రిందికి వస్తుంది. దాన్ని అంతర్జాతీయ వాదులు బేషరతుగా బలపరిచి దాని విజయానికి చేయూతని ఇవ్వాలి.

*అది ఒకవేళ రెండవ వైరుధ్యమైతే, అది సామ్రాజ్యవాద అంతర్గత వైరుధ్యం క్రిందికి వస్తుంది.

ఇందులో ఏది నిజం? ఇది ముందుగా తేలాలి.

*రష్యాలో ఏ వర్గం అధికారంలో వుందో మనం అవగాహనకు రావాలి. శ్రామికవర్గం రాజ్యాధికారంలో ఉంటే, అది రష్యన్ ప్రజల ప్రయోజనాల కోసం నిలబడుతుంది. అక్కడ పెట్టుబడిదారీ వర్గం రాజ్యాధికారంలో ఉంటే, అది రష్యన్ బూర్జువా వర్గ ప్రయోజనాల కోసమే నిలబడుతుంది. మనం ఈ మౌలిక అవగాహనని కలిగి ఉండాల్సింది.

 

*రష్యాలో శ్రామికవర్గం అధికారంలో ఉందని మనలో ఎవ్వరమూ భావించడం లేదు. అక్కడ బూర్జువా వర్గ పాలన సాగుతోందని తెల్సిందే!

*రష్యాలో బూర్జువా వర్గం రాజ్యాధికారంలో ఉందంటే, శ్రమదోపిడీ వ్యవస్థ ఉందని అర్ధం! రష్యన్ శ్రామికవర్గం పీడిత వర్గంగా ఉందని అర్ధం! ప్రపంచ శ్రామికవర్గ ఉమ్మడి ప్రయోజనాల కై నిలబడే అంతర్జాతీయ వాదులుగా మనం విధిగా రష్యన్ శ్రామికవర్గం పక్షాన నిలబడాల్సి వుంటుంది.

*రష్యన్ బూర్జువా వర్గం ఎంత ఎక్కువ బలపడితే, అది రష్యన్ శ్రామికవర్గం పై అంతటి ఎక్కువ పీడక శక్తిగా మారుతుంది. అది ఎంత బలహీన పడితే, ఆ శ్రామికవర్గ పోరాటాలకు అంత వెసులుబాటు ఏర్పడుతుంది. రష్యా జాతీయ ప్రయోజనాల పేరిట పుతిన్ ప్రభుత్వం చేపట్టే తాజా చర్యలు రష్యన్ శ్రామికవర్గ, ప్రపంచ శ్రామికవర్గ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధమైనవి. ఈ దృక్కోణంలో మన అంతర్జాతీయ శ్రామికవర్గ శక్తుల రాజకీయ వైఖరి ఉండాల్సి ఉందని అభిప్రాయ పడుతున్నా.

*77 ఏళ్ల అగ్రరాజ్యంగా అమెరికా పట్ల మనలోని ధర్మాగ్రహం మనల్ని రష్యా తాజా ధిక్కార వైఖరి పట్ల సానుకూల భావాన్ని కలిగించడం సహజం! అది ఏర్పరిచే స్థితిని ఉపయోగించుకునే వైఖరిని అంతర్జాతీయ వాదులు చేపట్టడం సరైనదే! అంతవరకు పరవాలేదు. కానీ మనమే రష్యా ధిక్కార వైఖరి పట్ల రాజకీయ ప్రేమికులుగా మారిపోతే, మనకు తెలియకుండానే మనం రష్యన్ శ్రామికవర్గ ప్రయోజనాలకి విరుద్ధంగా వెళ్ళడానికి కూడా దారి తీస్తుంది. అట్టి పరిస్థితి అంతర్జాతీయ వాదులకు రాకూడదని భావిస్తున్నా.

*నిజానికి ఉక్రెయిన్ కేంద్రంగా తాజా యుద్ధ స్తితిపై రైటప్ రాయాలని అనుకున్నా. ఐతే నిన్న రోజంతా పనిలో వున్నా. ఈరోజు, రేపు ఏలూరులో మా ఇఫ్టూ రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. ఆ యత్నం చేసే అవకాశం లేకపోయింది. లెనిన్ పేరు, బోల్షివిక్ విప్లవం వంటి పదజాలాన్ని పుతిన్ వాడుతున్న స్థితి చూస్తున్నాము. “గర్జించు రష్యా” “గాండ్రించు రష్యా” వంటి నినాదాలు వినిపిస్తున్న స్థితి ఉంది. ఆ నేపథ్యంలో దృక్కోణం ఎలా ఉండాలనే అంశం పై స్పందించాలనే భావన కలిగింది. అందుకే కొద్ది వ్యవధిలో చిన్న వ్యాఖ్యని చేస్తున్నా.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *