‘బంగారు’ రాజకీయంలో బంగారం ఎంత?

‘బంగారు తెలంగాణ ‘ నినాద ప్రాయంగా మిగిలి పోయిన వేళ బంగారు భారతం నిర్మిస్తామని చెప్పడంలో ఔచిత్యం లేదు.. మెరుగైన జీవన ప్రమాణాలకు మానవా భివృద్ధి ముఖ్యం కానీ బంగారం కాదు.

— వడ్డేపల్లి మల్లేశము

ప్రజా జీవితానికి బంగారానికి ఏ రకమైన సంబంధం లేదు. విశాలమైన ప్రజాజీవితంలో ఉన్నత కుటుంబాల కు మాత్రమే పరిమితమైన విలువైన ఆభరణం బంగారం. దానికి లేనిపోని కొత్త భాష్యం చెప్పి టీవీ ప్రసారాలు, సీరియళ్లలో కిలోల కొద్దీ బంగారాన్ని మెడలో వేసుకున్న నటన పాత్ర పోషణ జనానికి చూపించడమే అర్థరహితం.

ఇక బంగారం తో పరిపాలనను పోల్చడానికి బహుశా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేదని తెలుస్తున్నది.

గతంలో బిజెపి పరిపాలనా కాలంలో దేశం వెలిగిపోతున్నది అనే నినాదం ప్రచారం జోరుగా సాగింది. కాంతులతో వెలిగి పోయింది లేదు. ప్రజా జీవితాలు మారింది లేదు. పైగా ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటు పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతున్న వేళ దేశ ప్రజలందరూ దుఃఖ భారంతో శోకసంద్రంలో మునిగి ఉన్నారు. ప్రజల జీవ నాడిని తెలుసుకోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రచార ఆర్భాటాలకు పరిమితమైతే ఒరిగేది ఏమీ లేదని చెప్పే సత్యమే బంగారు తెలంగాణ. భవిష్యత్తులో బంగారు భారతదేశం.

బంగారు తెలంగాణ నినాదం ఏమైనది?

బంగారు తెలంగాణ పేరుతో అధికారానికి వచ్చిన తెరాస ప్రభుత్వం 2014 నుండి ఎనిమిది సంవత్సరాలుగా చేసిన పరిపాలనా కాలంలో ఏ అంశంలోనూ బంగారంతో పోల్చదగిన విలువలు జీవన ప్రమాణాలు సాధించిన దాఖలాలు లేవు.

పైగా సర్వత్ర విధ్వంసం, వ్యతిరేకత, వివక్షత, పేదరికం, అసమానతలు, దోపిడి, భూదందాలు, అక్రమార్జన అంతేకాకుండా అధికారానికి వచ్చినవారు కోట్లకు పడగలెత్తిన దృశ్యాలు కనపడుతున్నవి. ఈ పరిస్థితిని బంగారు తెలంగాణ అని ఎలా అనగలం.?

ప్రజా జీవితాన్ని, సుపరిపాలనను, మానవ అభివృద్ధిని, బంగారంతో సరిచూడడమే సబబు కాదు. ఎస్సీ ఎస్టీ బిసి సబ్ప్లాన్ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించలేదు. పైగా దారి మళ్లించిన సంఘటనలు అనేకం అని రుజువు అవుతున్నది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన దాఖలాలు లేవు. స్వయం ఉపాధి పథకాలకు రుణ సౌకర్యం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అనేక వేల మంది దరఖాస్తు చేసుకున్న వారికి రుణ సౌకర్యం అందక సంఘవిద్రోహ శక్తులు గా, అరాచక వాదులు గా మారుతున్న నేల తెలంగాణ.

రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నామని చెబుతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కానీ వాటి నాణ్యత వాస్తవాలు ఏమిటో అర్థం కాని పరిస్థితి కొనసాగుతున్నది. మిషన్ భగీరథ కార్యక్రమం వలన రోడ్లు విధ్వంసం కాగా పది సంవత్సరాలుగా రోడ్ల మరమ్మతు చేయని కారణంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దయనీయమైన పరిస్థితుల్లో రహదారులు ఉన్నవి. నాయకత్వం చక్కటి ప్రజా పరిపాలన అందించడం ద్వారా, నైతిక మానవతా విలువలను ప్రజలకు నేర్పించడం ద్వారా మాత్రమే సుపరిపాలన సాధ్యమవుతుంది కానీ ఈ బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న మన రాష్ట్రంలో పరస్పర దూషణలు, దాడులు, ఘర్షణలు, బూతు మాటలు, అన్ పార్లమెంటరీ పదజాలము తో అధికార,ప్రతిపక్షాలు ప్రజలను విస్మరిస్తే ప్రజలు అవాక్కయి పోతున్నారు. తమ ప్రత్యామ్నాయ పరిస్థితులను అర్థం చేసుకోలేని దుస్థితిలో ఉన్న ప్రజలున్న నేల బంగారు తెలంగాణ ఎలా ?.
ఇక దేశం బంగారం అవుతుందట?

అధికార పార్టీ ఎన్నికల కోసం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం కోసం, అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం, కుటుంబ పాలనను కొనసాగించడానికి సిద్ధమవుతున్న వేళ రాష్ట్రంలోనే మానవ అభివృద్ధి సాధించలేక అతలాకుతలమౌతున్న తెలంగాణ నాయకత్వం భారత దేశ బంగారు భవిష్యత్తుకు ఎలా శ్రీకారం చుట్ట గలదు.?

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్ట వలసినదే. అందుకు పార్లమెంటులోని ప్రతిపక్షాలు ఉద్యమ మార్గాన్ని ఎంచుకుని ప్రభుత్వం పైన విరుచుకుపడి ఆలోచింప చేయాలి. తప్పులను సవరించుకునే లా ఒత్తిడి చేయాలి. అంతేకాని వ్యక్తివాదం, ప్రచార ఆర్భాటాలతో, రాజకీయ పునరేకీకరణ పేరుతో ,తమ మౌలికమైన బాధ్యతలను విస్మరించడం సబబు కాదు ఏ పార్టీకైనా ఎవరికైనా.

కేంద్ర ప్రభుత్వ విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రైవేటు పరం చేస్తున్న దుర్మార్గపు చర్యలను దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి వ్యక్తి నిరసించవలసిందే. అందుకు ఏ రకమైన మినహాయింపులు ఉండవలసిన అవసరం లేదు. కానీ. దేశాన్ని బంగారుమయం చేస్తామని ఒక్కటవుతున్న రాజకీయ పార్టీల ప్రణాళిక పాలనా విధానాలు సొంత రాష్ట్రాలలో ప్రజా వ్యతిరేకంగా ఉండకూడదు కదా?

తెలంగాణ రాష్ట్రంలో లక్షా తొంభై ఒకవేళ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కమీషన్ తెలియజేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం బంగారు తెలంగాణ ఎలా అవుతుంది?. అలాంటప్పుడు దేశ ప్రత్యామ్నాయ నాయకత్వానికి తెలంగాణకు అర్హత ఉందా? ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాలు ,అఖిలపక్షణాలు వారి వారి సమస్యల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. నిరసన తెలిపే ధర్నాచౌక్ కోసం కూడా నిరసనలు తెలుపవలసివచ్చిన దౌర్భాగ్య పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రం దేశానికి నాయకత్వం ఎలా వహించగలదు?

నిర్బంధాలు, నియంత్రణ, వ్యక్తి స్వేచ్ఛను హరించి వేసే పత్రికల పై నియంత్రణ, ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నటువంటి రాష్ట్రంలో ఉస్మానియా తో పాటు అన్నివిశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ ఆకాంక్షలు ఎక్కడ పోయినవి అని ప్రశ్నిస్తుంటే సమాధానము చెప్పక దాడులు అరెస్టులు చేయడమే నా! తెలంగాణ రాష్ట్ర సంస్కృతి?

మన రాష్ట్రాన్ని చక్కబెట్టు కుందా౦

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న హామీ గంగలో కలిసింది. అఖిల పక్షాలు ప్రజా సంఘాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్న హామీ అమలు కాలేదు. ప్రకృతి విధ్వంసం గుట్టల విధ్వంసం యథేచ్ఛగా తెలంగాణలో కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటంలో పాల్గొన్న వేలాది మంది ఉద్యమకారులు వెలివేతకు ,ఛీత్కారాలు, గెంటివేత కు గురై గుట్టకొకరు, చెట్టుకొకరు, పుట్టకొకరుగా విసిరి వేయబడ్డ వేల తెలంగాణ రాష్ట్రము నిండా అధికారం లో ఉన్నటువంటి వాళ్ళు అంతా తెలంగాణ ఉద్యమ ద్రోహులే కదా!. ఉద్యమాన్ని నీరుగార్చి, ఉద్యమం పై దాడి చేసిన వాళ్లు అధికారంలో ఉంటే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రభుత్వం ఎలా ఆశిస్తుందో ఇప్పటికీ ప్రజలకు అర్థం కావడం లేదు.  రాష్ట్రంలో మానవా భివృద్ధి సాధించిన తర్వాత దేశం గురించి ఆలోచిస్తే అర్థం ఉంటుంది.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పైన ఒక హెచ్చరిక చేస్తూ “రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసే నాయకత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే సమస్యలు అలాగే ఉంటాయి. ప్రజలు ప్రభుత్వాలపై తిరగబడతారు. దానికి భిన్నంగా పాలకులు చిత్తశుద్ధిగా ప్రజల గురించి మరింత పట్టించుకుంటే రాజ్యాంగము పూర్తిస్థాయిలో క్షేత్ర స్థాయి వరకు రాజ్యాంగ ఫలాలను అందిస్తుంది .”అని అన్నారు. ఈ హెచ్చరిక లేదా సూచనను కేంద్ర రాష్ట్ర పాలకులు నిరంతరము మనసులో ఉంచుకుంటే తప్ప సుపరిపాలన సాధ్యంకాదు.

ఇక బంగారు తెలంగాణ బంగారు భారతదేశాన్ని ప్రక్కన పెడదాం. మన ప్రజల జీవన ప్రమాణాల గురించి ఆలోచన చేద్దాం. అంతరాలు అసమానతలు లేని సమానత్వాన్ని సాధించుకుందాం.


(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, ఉపాధ్యాయ ఉద్యమ నేత, హుస్నాబాద్ చౌటపల్లి, జిల్లా సిద్దిపేట, తెలంగాణ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *