యూరోప్ పై యుఎస్ ఆధిపత్యం పట్టు సడలుతోందా?

*ఉక్రెయిన్ దేశాధ్యక్షుడి తాజా ఇంటర్వ్యూ యూరోప్ పై అమెరికా ఆధిపత్య సడలింపుకి ఓ సంకేతమా?

(ఇఫ్టూ ప్రసాద్ పిపి)

ఉక్రెయిన్ పై అమెరికా వ్యూహం విఫలమౌతోంది. తానే సృష్టించిన ఉక్రెయిన్ సంక్షోభానికి చేపట్టిన తన చికిత్స బెడిసికొడుతోంది. కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్ననాలుక వూడి పోయింది అన్నట్లుంది.

ఉక్రెయిన్ దేశాధ్యక్షుని ఓ తాజా ఇంటర్వ్యూ ఇదే నిజాన్ని చాటుతోంది.

*బుధవారమే యుద్ధం మొదలవుతుందా?* శీర్షికతో 13-2-2022 న రాసిన నా వ్యాసానికి కొనసాగింపు యిది. రెండు రోజుల క్రితమే యుద్ధం జరగదని తేలి పోయింది. ఐతే అది క్రింది ప్రశ్నల్ని మిగిలించింది.

వచ్చే బుధవారం యుద్ధం మొదలవుతుందా?

 

 

1-ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించిన తన సైనిక బలగాల్ని రష్యా అంత హఠాత్తుగా ఎందుకు వెనక్కి తీసుకుంది?

2-ఇటీవల ఎన్నికైన జర్మన్ దేశాధ్యక్షుడు ఉక్రెయిన్, రష్యా వెళ్లి దౌత్యం చేసిన తర్వాతే ఉపసంహరణకి కారణం ఏమైఉంటుంది?

3-వెనక్కి తీసుకునే తన సైనిక బలగాల దృశ్యాల వీడియోని విడుదల చేసి, అధికారికంగా రష్యా ప్రకటించినా, రష్యా యుద్ధం చేయనుందని అమెరికా ఆరోపణకు కారణం ఏమిటి?

పై మూడు సందేహాలు గత రెండు రోజులుగా రాజకీయ పరిశీలక వర్గాల మనస్సుల్లో ఉన్నాయి. ఈ తరహా సందేహాల్ని ఉక్రెయిన్ అధ్యక్షుని తాజా ఇంటర్వ్యూ పటాపంచాలు చేస్తోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జర్మనీ డైలీ BILD కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ నుండి కొన్ని వాక్యాల్ని క్రింద ఇస్తున్నా.

*నాటో కూటమిలో సభ్యురాలిగా చేరాలని మా ఉక్రెయిన్ కి ఉంది. కానీ కూటమిలో వచ్చే ప్రతిఘటన వల్ల చేరడం కష్టంగా మారింది*

*కొన్నేళ్ల నుండి మేము నాటోలో చేరే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రక్రియకు గండి పడింది. కారణం, దాన్ని కేవలం రష్యా వ్యతిరేకించడం కాదు. రష్యా వైఖరికి నాటో కూటమిలోని కొన్ని సభ్యదేశాలు మద్దతు ఇవ్వడమే కారణం! ఇది బహిరంగ రహస్యమే!*

*అవి ఏ దేశంలో పేర్లు చెప్పమని మీరు నన్ను కోరుతున్నారు. వాటి పేర్లు చెప్పలేను. కానీ వాటితో మాకు దౌత్య వివాదాలు తెచ్చుకునే ఉద్దేశ్యం లేదు.*

పైవ్యాఖ్యలు వెల్లడించే వాస్తవాల్ని ఉదహరిద్దాం.

A-ఉక్రెయిన్ వ్యవహారం పై నాటో సభ్యదేశాల్లో ఐక్యత లేదు.

B-కొన్ని నాటో సభ్య దేశాలు ఉక్రెయిన్ చేరిక పై రష్యా వైఖరికి మద్దతు ఇస్తున్నాయి.

C-ఒకవేళ నాటో అండ తో రష్యాతో వివాదాన్ని పరిస్కరిద్దామని చేర జూస్తే, పాత సభ్య దేశాల తో కొత్త వివాదాలు కొనితెచ్చుకునే స్థితి రేపు ఉక్రెయిన్ కి వస్తుంది.

ఇక్కడ గమనించే కొన్ని అంశాలు ఉన్నాయి.

నాటో లో కొత్తగా ఒక దేశాన్ని సభ్యురాలిగా చేర్చుకోవాలంటే, దాని సభ్య దేశాలన్నింటి ఆమోదం ఉండాలి. పైగా సభ్యదేశాలతో సరిహద్దు వివాదాలు ఉండకూడదు. జర్మనీ అభ్యంతరం పెడితే ఉక్రెయిన్ ని చేర్చుకోవడం అమెరికాకి సాధ్యం కాదు.

రష్యా పర్యటనలో జర్మనీ అధ్యక్షుడి నుండి నాటోలో ఉక్రెయిన్ చేరిక పై తన మద్దతు ఉండదనే రహస్య హామీ రష్యాకి లభించిందేమో! ఉక్రెయిన్ కి కూడా జర్మనీ ఇలాగే స్పష్టం చేసిందేమో! ఈ తెరవెనుక దౌత్యం ఫలించి సైనిక ఉపసంహరణకి దారితీసిందేమో! ఈ కొత్త సందేహాల్ని ఉక్రెయిన్ అధ్యక్షుని ఇంటర్వ్యూ వాస్తవమని తేల్చుతుంది. ఇదే నిజమైతే రెండో ప్రపంచ యుద్ధానంతరం నుండి యూరోప్ పై అమెరికా ఆధిపత్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. బహుశా అందుకేనెమో, సైనిక దళాల్ని రష్యా వెనకీ తీసుకుంటున్నా, దానిపై బహిరంగ ప్రకటన చేసినా, వీడియో కూడా విడుదల చేసినా, అది నిజం కాదని అమెరికా బుకాయిస్తోంది. జర్మనీ వైఖరి అమెరికాకి కడుపుమంట తెప్పించి ఉంటుందేమో!

సామ్రాజ్యవాద యుగం లో ముడిసరుకుల కోసం సామ్రాజ్యవాద దేశాల మధ్య ప్రపంచ మార్కెట్ల పునర్విభజనకై పోటీ ఉంటుందని లెనిన్ చెప్పాడు. *నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్స్* వ్యవహారం అందుకొక నిదర్శనం!

*నార్డ్ 1 స్ట్రీమ్* పైప్ లైన్ రష్యా గతంలోనే ఉక్రెయిన్ భూమార్గం గుండా యూరోప్ దేశాలకి సహజ వాయువు సప్లై కోసం రష్యా నిర్మించింది. తన భూమార్గం ద్వారా సరఫరా వల్ల ఉక్రెయిన్ కి రష్యా రాయల్టీని భారీగా చెల్లిస్తోంది. ఐనా అది అమెరికా వత్తాసుతో రష్యాకు ఆటంకాలు కల్పిస్తోంది. ఆ నివారణ కై రష్యా *నార్డ్ 2 స్ట్రీమ్ పైప్ లైన్* ని కొత్తగా నిర్మాణం చేసింది. అది బాల్టిక్ సముద్ర మార్గం. అమెరికాని నమ్మి ఉక్రెయిన్ రాయల్టీని సైతం కోల్పోతోంది. అమెరికాని నమ్మి మోడీ ప్రభుత్వం *తాపి* పైప్ లైన్, ఇరాన్ చమురు అవకాశాల్ని వదులుకున్నట్లే సుమా!

పైన పేర్కొన్న *నార్డ్-2 స్ట్రీమ్ పైప్ లైన్* ద్వారా గ్యాస్ లబ్ది పొందే జర్మనీ వంటి యూరోప్ దేశాలు రష్యాకి రేపు దగ్గరయ్యే అవకాశం ఉంది. అవి అమెరికా ప్రయోజనాల కోసం రష్యా పట్ల ఘర్షణ వైఖరికి సిద్ధం కావేమో! ఈ భయం అమెరికాది. ఆ పైప్ లైన్ ని స్తంభింపజేసే లక్ష్యం అమెరికాది. దానికి కారణం, అమెరికాకి A-వాణిజ్య (ఆర్ధిక) B-రాజకీయ C-భౌగోళిక ప్రయోజనాలుండటమే!

ఉక్రెయిన్ పై యుద్దం చేసే వాస్తవ ఉద్దేశ్యం రష్యాకు లేకపోయినా, దానికి అది ఉందంటూ మీడియాతో అమెరికా వ్యూహాత్మక ప్రచారం చేయించిందనే వాదన ఒకటుంది. దాన్ని మనం తోసిపుచ్చడానికి వీలు లేదు. ఐతే మార్కెట్ల పునర్విభజన కోసం సాగే ప్రక్రియతో సంబంధం లేని వివాదం మాత్రం కాదిది. ప్రపంచ మార్కెట్ శక్తుల మధ్య పోటీలో తలెత్తిన వివాదమిది. అది ప్రపంచ మార్కెట్ వ్యవస్థ కీ, దాన్ని సమూలంగా వ్యతిరేకించే సోషలిస్టు వ్యవస్థ కీ మధ్య ఘర్షణ కాదు. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక ఓటమి తర్వాత ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసం పోటీ తీవ్రత పెరిగింది. అదే నేటి ఉక్రెయిన్ సంక్షోభ తీవ్రతకి తక్షణ & ప్రధాన కారణం!

యుద్ధం చేసే ఉద్దేశ్యం రష్యాకు ఉందా లేదా అనే తార్కిక అంశం ఒకటుంది. నేటి ప్రపంచం యుద్ధస్తితి వైపు అడుగులెసే మరో నిజం కూడా ఒకటుంది. ఏ నిజాన్ని ఆ నిజంగానే చూద్దాం. ఒక నిజాన్ని గుర్తిస్తూ మరో నిజాన్ని తిరస్కరించే వైఖరితో కాకుండా సామ్రాజ్యవాద యుగ వైరుధ్యాల్ని నిశిత దృష్టితో పరిశీలిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *