ఆ స్వర్ణ మూర్తి సమానత్వ స్ఫూర్తిని నింపగలదా?

సమతా మూర్తి విగ్రహం, దాని చుట్టూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన 108 దివ్యదేశాల సంబంధించినవన్నీ కలిపి మనలో సమానత్వ స్పూర్తిని నింపగలవా?

– హరి కృష్ణ ( మానవ హక్కుల వేదిక, వరంగల్ జిల్లా)

ఫిబ్రవరి 2వ తేదీ నుండి 14వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలో విశిష్టాద్వైత మత ప్రవక్త చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్మించబడ్డ 216 అడుగుల ఎత్తుగల శ్రీమద్ రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని 108 దివ్య దేశాలను ఉద్ఘాటన చేయడానికి భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.

రెండవ తేదీన మొదలైన కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో పాటు భారత ప్రధాని, హోంమంత్రి, రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి గార్లు కూడా సందర్శించారు.

ఇంతకీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రామానుజాచార్యులు ప్రవచించిన సమానత్వ సిద్ధాంతం ఆయన జీవించిన విధానము ఉదాత్తమైనవి కావటమేనని త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి వారు చెప్పుకొస్తున్నారు.

వర్ణవ్యవస్థ( కుల వ్యవస్థ) సృష్టించిన అంతరాలను తద్వారా శూద్రవర్ణం లో( బిసి ఎస్సీ లలో) పేరుకుపోయిన పేదరికం,అవిద్య, అజ్ఞానాలని పోగొట్టటానికి రామానుజులు చేసిన పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం అత్యంతంగా ఉన్నది.

నిజానికి ఆయన కుల వ్యవస్థతో రుజాగ్రస్తమైన ఈ దేశాన్ని ఉద్ధరించడానికి …ఆ కుల వ్యవస్థను తూలనాడి దానిని నిర్మూలించేందుకు, రూపుమాపడానికీ కృషి చేసి ఉండాలి.

‘రుగ్వేదంలోని పురుషసూక్తం ప్రవచించిన వర్ణవ్యవస్థ తప్పు’ అని, మనుషులు అందరూ సమానులే అని , ఆయన చెప్పి ఉండాలని మనం అందరం అనుకుంటాం.

ఆ నాడు దేశంలో కుల వ్యవస్థ వలన నెలకొన్న సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి ఆయన చేసిన పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి.

ఆయన జీవించిన కాలంలో దేశంలోని కాలమాన పరిస్థితులు ఎలా ఉండేవి..?, మత ఆచారాలు, కులవ్యవస్థ పరిస్థితులు ఏమిటో కూడా మనకు కొంత అవగాహన ఉండాలి.

కుల అంతరాలు అంతకుముందు ఎలా ఉండేవి?
ఆయన కాలానికి అవి ఎలా మారాయి అన్న విషయాలు కూడా ఎంతో కొంత మనకు తెలియాలి.

ఈ విషయాలపై మనకు కనీస అవగాహన కూడా లేకుండా ఆయనని మనం ఒక గొప్ప సాంఘిక సంస్కరణవాది గా గుర్తించడం సరికాదు.

నిజానికి మన విశ్లేషణ….. ఆయన కన్నా పూర్వమే పుట్టిన ఆదిశంకరుల వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం కంటే విశిష్టాద్వైతం ఎలా మెరుగైనది అనే దానికన్నా,..

ఆదిశంకరుల కన్నా 1300 వందల సంవత్సరాల కు పూర్వమే భారతదేశంలో పుట్టిన బౌద్ధం ప్రవచించిన ధర్మం కన్నా విశిష్టాద్వైతం ఎలా మెరుగైనది అన్న ప్రశ్నతో కూడిన విశ్లేషణ.. బహుశా మనలో మరింత సమాచార చైతన్యం కలిగి0చడానికి వీలవుతుంది.

ఆ కోణాల్లో పరిశీలించి బౌద్ధం, విశిష్టాద్వైతం లలో మెరుగైనదేదో తెలుసుకోవాలి.

క్రీస్తు పూర్వం 563 లో జన్మించి 480 లో మరణించిన గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన జీవన విధానం ఈ దేశంలోనే కాక చాలా దేశాలలో విస్తరించింది.

ఆయన మరణించిన తర్వాత కూడా సుమారు వెయ్యి సంవత్సరాల పాటు ఆయన ప్రతిపాదించిన అష్టాంగ మార్గం, ఆత్మ అనేది లేదు అనే వాదం, కార్యకారణ సిద్ధాంతం తో కూడిన జీవన విధానాలు… ఈ నేలపై ప్రజల జీవితాలపై ప్రబలంగా ప్రభావం చూపాయి.

అప్పటివరకు వైదిక ధర్మం(అనబడే బ్రాహ్మణుల ధర్మం ) యజ్ఞయాగాదుల తో కర్మకాండల తో, జంతుబలుల తో, వర్ణవ్యవస్థ (కుల వ్యవస్థ) సృష్టించిన అంతరాలతో నిండిన సమాజంపై గౌతముడు ప్రత్యక్ష ఘర్షణకు దిగకుండానే ఆ సంప్రదాయాలను దునుమాడారు.

దానికోసం ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం “అహింస”. ఈ అహింసా సిద్ధాంతం తోనే ఆయన అప్పటి వరకు విచ్చలవిడిగా కొనసాగిన జంతు బలులను ఆపగలిగాడు.

అలా యజ్ఞయాగాదుల పేరుతో మంటల పాలు అయ్యే ఆహారం, ధాన్యం, జంతువులు పెద్ద ఎత్తున మిగిలి ఆ నాటి సామాన్య జనానికి ఎంతో మేలు జరిగింది.

అనతి కాలంలోనే బౌద్ధం అంతగా విస్తరించడానికి ఇవే ప్రధాన కారణాలు.

అంతేకాక వేద సంస్కృతి ప్రతిపాదించిన చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని, అది సృష్టించిన అసమానతలను వివక్షనూ బౌద్ధం నిరసించింది.

షరతులు లేకుండా, ఈ భూమి పై ప్రతి తల్లి గర్భంలో  పుట్టిన మనుషులందరూ ఒకరితో ఒకరు సమానమేనని దీనికి జాతి, కుల, లింగ భేదం లేదని బౌద్దం ప్రతిపాదించింది.

అంతేకాదు బౌద్ధం ప్రజలలో ఉన్న మూఢనమ్మకాలను పారదోలే0దుకు నిరీశ్వర వాదాన్ని ప్రతిపాదించింది.
” గ్రంథాల్లో ఉన్నాయని కానీ, పండితులు చెప్పారని కానీ, దేన్ని నమ్మకండి. తల్లిదండ్రులు చెప్పారని తరతరాలుగా ఆచారంగా ఉన్నదని చివరకు స్వయంగా నేను చెప్పాను అని కూడా దేన్ని నమ్మకండి”.అని గౌతమ బుద్ధుడు స్వయంగా చెప్పి ప్రచారం చేశాడు.

విశ్వాసమే వినాశనానికి మూలం. అంటే ఆధారం లేని నమ్మకం మనలను వినాశనం వైపు నడిపిస్తుంది. కనుక మీరు స్వీయ అనుభవంతో, విచక్షణతో శోధించి సత్యాన్ని సత్యంగా నూ, అసత్యాన్ని
అసత్యంగా నూ గ్రహించండి” అని బుద్ధుడు అంటాడు.( కాలామసుత్తా; అంగుత్తర నికాయ: 3.65) ఆయన బోధనల వల్ల స్ఫూర్తి పొందిన ఎంతో మంది ఆయన ప్రతిపాదించిన అష్టాంగ మార్గాన్ని అనుసరించి తమ జీవితాలను ఉన్నతంగా మలచుకోవడానికి అవకాశం కల్పించింది.

ఆనాటి సమాజంలో దొంగలను, చండాలురను, వ్యభిచారులనూ ఆక్షేపించిన ఎంతో మంది బుద్ధుని ఆదరణ వల్ల పండితులుగా మారడం జరిగింది.

” ధ్యానం ద్వారా మనసును నిగ్రహించుకోవచ్చు” అని మొదటగా ఈ భూమి మీద గౌతముడు ఆచరించి చూపాడు.

కాషాయ వస్త్రం త్యాగానికి నిస్వార్ధత కు ప్రతీకగా నిలిపింది గౌతమ బుద్ధుడే. అలాంటి బుద్ధుడు చూపిన జీవన విధానాన్ని క్రమంగా బలహీనపరిచి, ఆయన ప్రతిపాదించిన సన్యాస జీవితాన్ని… ఈ వైదిక ధర్మం( బ్రాహ్మణ మతం) అరువు తెచ్చుకుని, బౌద్ధ భిక్షువుల ఆహార్యంతో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వారిలో అగ్రగణ్యుడు ఆదిశంకరులు.

బౌద్ధం ప్రతిపాదించిన సమానత్వ సిద్ధాంతాన్ని కాదని తిరిగి వైదిక ధర్మాన్ని అంటే వర్ణ వ్యవస్థను ( కుల వ్యవస్థ ను) బలోపేతం చేయటానికి పెద్ద ఎత్తున తోడ్పాటు అందించిన వ్యక్తి ఈ ఆదిశంకరుడే .

సుమారు వెయ్యి సంవత్సరాల పాటు దేశంలో అనేక చోట్ల విద్యాలయాలను, నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలను నెలకొల్పి వర్ణం,లింగం తో సంబంధం లేకుండా ప్రజలందరికీ విద్య అందించడానికి కృషి చేసి0ది బౌద్ధ ధర్మం.అంతేకాక అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించింది బౌద్ధమే.

అప్పటిదాకా బవిరి గడ్డాలతో ముడుచుకున్న శిఖలతో ఈ దేశంలో కనిపించిన మునులు, మహర్షులు, ‘బౌద్ధం సన్యాసులకు, శ్రమణులకు నియమంగా చేసిన కాషాయ వస్త్రాలను బోడిగుండును’ అరువు తెచ్చుకున్నారు.

ఆది శంకరుల, మాధవాచార్యుల, రామానుజాచార్యుల ఆహార్యం బౌద్ధ భిక్షువుల నుండి అరువు తెచ్చుకున్న ఆహర్యమే.

ఈ దేశంలో సమతా, మమతా, మానవతను బోధించి ఆచరించి సామాన్య జనజీవనానికి సాంత్వన చేకూర్చిన బౌద్ధం, అపారమైన సాహిత్య సంపదను కూడా సృష్టించింది. వైద్య రంగంలో కూడా ఎన్నో అధునాతన పద్ధతులను కనిపెట్టింది.

ఎక్కడైనా ఒక మతం వెయ్యి సంవత్సరాల పాటు విరాజిల్లితే అది సృష్టించగల సాహిత్యం ఎంత బృహత్ పరిమాణంలో ఉంటుందో మనం సులభంగానే గ్రహించవచ్చు.

కానీ ఈ ‘బౌద్దం’ పుట్టిన దేశంలో ఆనవాళ్లు లేకుండా ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో ఇప్పుడైనా మనల్ని మనం వేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న.

నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి వంటి విశ్వవిద్యాలయాలు ఎందుకు కనుమరుగయ్యాయి అని నిశితంగా గమనించి విశ్లేషణ చెయ్యాలి.

వీటిని ధ్వంసం చేసింది ఎవరు? ఈ విశ్వవిద్యాలయాల్లో
పోగుపడ్డ అపారమైన పుస్తక సంపదను ఎవరు నాశనం చేశారు?

మనం ఇప్పటికైనా ఈ ప్రశ్నకు నిష్పాక్షిక పరిశోధన ద్వారా కారణాలను కనుగొన గలమా? నిన్నటికి నిన్న బాబ్రీ మసీదు శిథిలాల క్రింద తవ్వకాలలో వెలువడ్డ అవశేషాలు రామమందిరానివా, లేక బౌద్ధఆరామాలవా, తేల్చే మఅవసరం లేదా? బౌద్ధం ప్రతిపాదించిన హేతువాదానికి, అహింసకు, అనాత్మ వాదానికి, సర్వమానవ సమానత్వ సిద్ధాంతానికి వ్యతిరేకమైన చాతుర్వర్ణ వ్యవస్థను సమర్ధించి, దానిని బలంగా ప్రచారం చేసిన ఆదిశంకరులు కానీ రామానుజులు కానీ ఎలా సమతా మూర్తులు కాగలరో ఇప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది?

చరిత్ర ను కూలంకషంగా తెలుసు కొని …..
ఆది శంకరులు ప్రతిపాదించిన అద్వైతం కానీ, రామానుజుడు ప్రవచించిన విశిష్టాద్వైతం కానీ, వేద ప్రామాణికతను ఎవరూ ప్రశ్నించలేదు.

ఈ అద్వైతం మరియు విశిష్టాద్వైతం  కూడా
వర్ణాశ్రమ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించాలి అని చెప్పాయి.

అలాంటప్పుడు వీరందరిలో రామానుజుల సామాజిక విప్లవకారుడు అని అనటానికి శూద్రులు కూడా మోక్షానికి అర్హులని ఆయన అని చెప్పటం మాత్రమే కారణమా..?? .

శూద్రులకు కూడా దేవాలయ ప్రవేశ అర్హత ఉన్నదని కూడా ఆయన అన్నారు. తిరుప్పాన్ ఆళ్వార్ వంటి పంచములను కూడా కలిగిన ఆళ్వారు సంప్రదాయాన్ని గౌరవించడం, అంటరాని వారికి కూడా మోక్షానికి అర్హత కోసం వారికి ఆళ్వారుల దివ్య ప్రబంధాన్ని బోధించడం వంటి చర్యలను చూపి ఆయనను సమానత్వ వాది అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇది ఎ0తవరకు సబబు అవుతుంది..???

నిజానికి ఆయన వర్ణ ధర్మాన్ని కుల వ్యవస్థనూ తిరస్కరించలేదు. ఆయన చేపట్టిన చర్యలు అన్ని పైపైపూతల సంస్కరణ లాంటి సర్దుబాటు చర్య మాత్రమే.

సారాంశంలో దైవ ఆరాధనకు, పౌరోహిత్యానికి, ఇతర ఆధ్యాత్మిక అవసరాలకు శూధ్రులు అతిశూధ్రులు కూడా అర్హులేనని ఆయన భావించలేదు. అలాటి కార్యాచరణను ఆయన ప్రతిపాదించలేదు.

ఆయన కాలంలో జరిగిందల్లా ఆధ్యాత్మిక విఫణి లోకి కొత్త వినియోగదారులుగా( కస్టమర్ లుగా) శూద్రులను, అంటరానివారిని అనుమతించడమే.

నిజానికి శ్రీ వైష్ణవ లేదా విశిష్టాద్వైత మత ఆవరణలోకి ఆయన కల్పించిన ప్రవేశం వల్ల కింది కులాల వారికి జరిగిన మేలు కన్నా, వీరి సేవల వల్ల, వీరు సమర్పిస్తున్న కానుకల వల్ల బ్రాహ్మణ వర్గానికి, దేవాలయాలకు జరిగిన మేలే ఎక్కువ. ఆ విధంగా బ్రాహ్మణ వర్గాలకు సేవలు కానుకలూ సమర్పించుకోవడం మొదలై బీసీ ఎస్సీ లు తమ శ్రమకు సంపదనూ పోగొట్టుకుంటు రావడం మొదలైంది.

వారి వల్ల కలుగుతున్న ఆర్థిక, భౌతిక సేవల కారణంగా, కింది కులాల వారు నివసించే ప్రాంతాలలో అప్పటికే ఉన్న బౌద్ధారామాలు అన్ని హిందూ దేవాలయాలు గా మారాయి.

కింద కులాల వారి శ్రమను సంపదనూ.. సేవల రూపంలో కానుకల రూపంలో దోపిడీ చెయ్యడం మొదలుపెట్టారు.

బౌద్ధ ఆరామాలలో బుద్ధుని మూర్తిని పూజించే ఆచారం ఒకటి అప్పటికే ఏర్పడి ఉండటం కారణంగా,
ఆ ఆరామాలలో బుద్ధుని మూర్తిని క్రమంగా తొలగించి బ్రాహ్మణ విరచిత పురాణ పాత్రల మూర్తులను ఆ విగ్రహాల స్థానంలో ప్రతిష్టించి వాటిని వైదిక దేవాలయాలు గా మార్చారు.

ఈ ప్రక్రియ పెద్ద ఎత్తున ఆదిశంకరుని కాలంలో జరిగింది. ఇక రామానుజుని కాలానికి ఆలయాల సంస్కృతి పెచ్చరిల్లింది. వర్ణాశ్రమ ధర్మం మరింత బల పడింది.

నిజానికి రామానుజుడు సామాజిక విప్లవకారుడైతే వర్ణాశ్రమ ధర్మాన్ని( కుల వ్యవస్థ ను) నిరసించి సర్వమానవ సమానత్వాన్ని ప్రతిపాదించాల్సి ఉండాల్సింది. అలా చేయకపోగా ఆయన ఆయా కులాల లోపలే (వారి లోపలే) పంచుతూ సహా ఒక పురోహిత వర్గాన్నీ సృష్టించి ఆ వర్గాలను / కులాలను కూడా అంతరాల దొంతరలగా దడి కట్టుకునే సమూహాలుగా మార్చాడు.

మాల దాసరులు కులం అలా ఏర్పడ్డదే. చిందు మాదిగ కులం మాదిగ కులానికి ఆశ్రిత కులంగా ఏర్పాటు చేయబడింది కూడా ఆ విధంగానే.

ఇలా అంటరాని కులాల లో కొంతమందిని పురోహితులను చేయటం వల్ల బ్రాహ్మణ మతానికి మూడు లాభాలు చేకూరాయి.

ఒకటి, బ్రాహ్మణ మతం యొక్క గొప్పతనం, ఉన్నతం గురించి అంటరాని, శూద్ర వర్గాలలో పెద్దఎత్తున ప్రచారానికి నోచుకోవడం, మరియు దాన్ని వీరి మద్య ఆమోదింపజేయడం కూడా జరిగింది.
రెండు కింది కులాలకు బ్రాహ్మణులు స్వయంగా పూజారులుగా వ్యవహరించాల్సిన అగత్యం తప్పటం.

మూడు, బౌద్ధం ప్రవచించిన సమానత్వ భావనలను మరిపిస్తూ,ఆ స్థానంలో, బ్రాహ్మణ విరచిత పురాణగాథలు అబద్దాలతో కూడిన కట్టుకథలు ప్రజల్లోకి తీసుకు పోయే పనిని ఈ బీసీ ఎస్సీ వర్గాల తోనే చేయించడం.

ఈ మూడు లక్ష్యాలను ఏకకాలంలో సాధించిన ఘనత రామానుజుల వారికే దక్కుతుంది.

ఇప్పుడు ముచ్చింతల్ లో జరుగుతున్న ఆలయ ప్రారంభోత్సవాలకు దేశం నలుమూలల నుండి దాదాపు 5 వేల మంది పూజారులను పిలిపించారు.

నిజానికి రామానుజుల వారి స్ఫూర్తి సమానత్వమే అయితే ఐదు వేల మంది రుత్వికులలో ఒక్క శూద్ర, అస్పృశ్య ఋత్విక్కుడు కూడా ఎందుకులేడో ప్రశ్నించాలి.అంతేకాదు విజ్ఞతతో మనమే సమాధానం వెతుక్కోవాలి.

ఇంతటి బృహత్కార్యాన్ని తలపెట్టిన చిన్న జీయర్ స్వామి వారు” కులాలు పోకూడదు, కులాలు ఉండాలి, ఎవడి కులం పని వాడు చేయాలి” అని ప్రవచిస్తూ ఉన్న వీడియో క్లిప్పింగ్ ఒకటి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున తిరిగింది.

ఆయన నోటి నుంచి జాలువారిన ఆ మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించాలి.

ఈ దేశంలో నాగరికత ఒకటి ఉనికిలోకి వచ్చిన తరువాత, ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా సమానత్వ భావనను ప్రతిపాదించింది, ఆచరణాత్మకంగా నిరూపించిందీ బౌద్ధం మాత్రమే.

సమతా భావనను స్థాపించడంలో గౌతమ బుద్ధుని కృషి కన్నా రామానుజులవారి కృషే గొప్పదైతే ఇప్పుడు ముచ్చింతల్ లో జరుగుతున్న మహా క్రతువుకు మన మానసిక ప్రపంచంలో మరింత శోభ చేకూరేది.

ఇంతకీ సమానత్వ స్ఫూర్తి కోసమేనా? ఆ సమతా మూర్తి.

భారత దేశంలో BCs, SCs, STs, minorities యింత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు అంటే దానికి కారణం మనుస్మృతి, హిందూ మతం, లేని కల్పితమైన దేవుళ్లు దేవతలు నమ్మడం, మూడ నమ్మకాలు, బహుజనులకు, స్త్రీలకూ చదువు లేకుండా చేశారు.

యీ రోజూ BCs SCs STs minorities జీవితాలు కొంత బాగుపడ్డవి అంటే మహనీయులయిన జ్యోతిరావు ఫూలే, Dr B R Ambedkar రాజ్యాంగం వల్లనే, మరొకరి వల్ల కానే కాదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *