కొత్త జిల్లాల మీద సీఎం జగన్ కు లేఖ

(జిల్లాల పునర్విభజన అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ)
1. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజన జరగాలి. కానీ, ఎప్పుడు? ప్రాతిపదిక ఏమిటి? అన్నదే అసలు సమస్య. జిల్లాల పునర్విభజనలో రాష్ట్రం యొక్క విస్తృత మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ప్రజాభిప్రాయానికి విలువిచ్చి, ప్రభుత్వం సహేతుకమైన నిర్ణయాలు తీసుకొన్నప్పుడే సమస్యలు తలెత్తవు. “నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు” అన్న చందంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి తగని పని. మంచిది కాదు.
2. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే వివిధ ప్రాంతాలలో నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలన్న విన్నపాలు ప్రజల నుండి దశాబ్దాలుగా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్విభజన ఆవశ్యకత మరింత పెరిగింది. జిల్లా స్థాయి పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి, కేంద్ర ప్రభుత్వం జిల్లాను యూనిట్ గా తీసుకొని అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజక పథకాల నుండి ప్రయోజనం పొందడానికి, ఆర్థిక సంఘం నుండి లభించే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా హేతుబద్ధంగా జిల్లాల పునర్విభజన జరగాలి. సమస్యల్లా! ఎప్పుడు, ఏ ప్రాతిపదికపైన జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలన్నదే!
3. స్థూలంగా లోక్ సభ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకొని జిల్లాల పునర్విభజన ప్రక్రియకు పూనుకొని, 26 జిల్లాలను ఏర్పాటుచేస్తూ జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికషన్లు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్న లోక్ సభ స్థానాలు 25. సామాజికంగా వెనుకబడ్డ గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అరకు లోక్ సభ స్థానం పరిధిలో రెండు జిల్లాలను ఏర్పాటుచేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. లోక్ సభ స్థానాల సరిహద్దులకు కట్టుబడి జిల్లాల ఏర్పాటుకు వివిధ అంశాలు అననుకూలంగా ఉన్నాయంటూ భిన్నమైన ప్రాతిపదికలను వర్తింపు చేసి జిల్లాల సరిహద్దులను, జిల్లాల కేంద్రాలను, రెవెన్యూ డివిజన్లను నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వం సమస్యల తేనె తుట్టేను కదిపింది.
4. లోక్ సభ నియోజకవర్గం సరిహద్దులను కాకుండా శాసనసభ నియోజకవర్గం సరిహద్దులను ప్రామాణికంగా తీసుకోవడం సముచితంగా ఉంటుంది. శాసనసభ స్థానాల పునర్విభజన అనంతరం జిల్లాల పునర్విభజన ప్రక్రియ చెబడితే సౌలభ్యంగా ఉంటుంది. సమస్యలు తలెత్తే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
5. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014, విభాగం -3, సెక్షన్ -26(1) మేరకు ప్రస్తుతం ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225కు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ పునర్విభజన చేయాలి. ఏడేళ్ళు గడిచిపోయినా మోడీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టిసారించలేదు. జనాభా లెక్కల సేకరణ పూర్తై, అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యాక, 2026 సం. తర్వాతే లోక్ సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టడం జరుగుతుందంటూ కాలయాపన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచి, మొదట శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించాలి.
6. జిల్లాల పునర్విభజనలో సమతుల్యత పాటించాలి. భౌగోళిక స్వరూపాన్ని – పరిస్థితులను, సామాజిక – సాంస్కృతిక అంశాలను, విస్తీర్ణం – జనాభా, సహజ వనరులు, పరిశ్రమలు – సాగునీటి సదుపాయాలు – విద్యా సంస్థలు – రవాణా – తదితర మౌలిక సదుపాయాలను కొలబద్దలుగా విధిగా తీసుకోవాలి. చారిత్రక ప్రాధాన్యతాంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
7. రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1,62,967 చ.కి.మీ. 2011 జనాభా గణాంకాల ప్రకారం జనాభా 4.94 కోట్లు. ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేస్తూ గెజిట్ నోటిఫికేషన్స్ జారీ చేసింది. అంటే, సగటు విస్తీర్ణం 6,268 చ.కి.మీ., సగటు జనాభా 19,00,769.
8. ప్రభుత్వం జారీ చేసిన నూతన జిల్లాల గెజిట్ నోటిఫికేషన్లును పరిశీలిస్తే అసంబద్ధమైన, ఏ మాత్రం హేతుబద్ధతలేని అంశాలు ఉన్నాయి. కాబట్టే ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు, కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి, వస్తున్నాయి.
i) అతితక్కువ విస్తీర్ణం 928 చ.కి.మీ., 18.13 లక్షల జనాభా, 6 శాసనసభ నియోజకవర్గాలు, 10 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లతో విశాఖపట్నం జిల్లా ప్రతిపాదించబడింది. మరొక వైపున 14,322 చ.కి.మీ. విస్తీర్ణం, 22.88 లక్షల జనాభా, 8 శాసనసభ నియోజకవర్గాలు, 38 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లతో ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ప్రతిపాదించబడింది.
ii) పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం శాసనసభ నియోజకవర్గాలతో నూతనంగా మన్యం(గిరిజన) జిల్లాను పార్వతీపురం కేంద్రంగా ప్రతిపాదించారు. పాలకొండను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
iii) పాడేరు, అరకు, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాలతో నూతనంగా అల్లూరి సీతారామరాజు (గిరిజన) జిల్లాను పాడేరు కేంద్రంగా ప్రతిపాదించారు. రంపచోడవరం నియోజకవర్గానికి పాడేరు 250-300 కి.మీ. దూరంలో ఉన్నది. అందువల్ల రంపచోడవరం కేంద్రంగా 11 మండలాలతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలి లేదా రాజమహేంద్రవరం దగ్గరలో ఉన్నది కాబట్టి తూర్పు గోదావరి జిల్లాలో చేర్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
iv) నర్సీపట్నంను జిల్లా కేంద్రంగా కాకుండా విశాఖపట్నానికి అతిసమీపంలో ఉన్న అనకాపల్లిని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడం, విశాఖపట్టణంలో అంతర్భాగంగా ఉన్న పెందుర్తి శాసనసభ నియోజకవర్గాన్ని అనకాపల్లి జిల్లాలో చేర్చడంపై విమర్శలు వెల్లవెత్తాయి.
v) కోనసీమ జిల్లాలో చేర్చబడిన గోకవరం, ఆలమూరు మండలాలను రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రతిపాదించబడిన తూర్పు గోదావరి జిల్లాలో కలపాలన్న డిమాండ్ ముందుకొచ్చింది.
vi) లోక్ సభ నియోజకవర్గం కేంద్రమైన నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ చేస్తున్నారు.
vii) విజయవాడ పట్టణంలో అంతర్భాగంగా ఉన్న గన్నవరం మరియు పెనమలూరు శాసనసభ నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే కృష్ణా జిల్లాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ కేంద్రంగా నూతనంగా ఏర్పాటు చేసే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
viii) గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ముందుకొచ్చింది.
ix) కందుకూరు శాసనసభ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ, ప్రకాశం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించడం సముచితమని, ఒంగోలు, సంతనూతలపాడు, కందుకూరు, కొండేపి, అద్దంకి, పరుచూరు, చీరాల శాసనసభ నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లాను కొనసాగిస్తూ, మార్కాపురం కేంద్రంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి, మార్కాపురం శాసనసభ నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండుతో ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
x) నెల్లూరు పట్టణానికి సమీపంలో ఉన్న గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్న డిమాండ్ ముందుకొచ్చింది.
xi) లోక్ సభ నియోజవర్గానికి, రెవెన్యూ డివిజన్ కు కేంద్రం రాజంపేట. నూతనంగా ప్రతిపాదించిన జిల్లాకు అన్నమయ్య పేరు ప్రతిపాదించారు. అన్నమయ్య జన్మస్థలం తాళ్ళపాక గ్రామం రాజంపేటకు సమీపంలో ఉంది. రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రతిపాదించడంతో రాజంపేటనే జిల్లా కేంద్రం చేయాలంటూ ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి లేదంటే తమ ప్రాంతానికి దగ్గరగా ఉన్న తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించబడిన బాలాజీ జిల్లాలో చేర్చాలంటూ రైల్వే కోడూరు, చిట్వేలి ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
xii) మదనపల్లి కేంద్రంగా పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లి, మదనపల్లి శాసనసభ నియోజకవర్గాలతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండుతో ఆందోళన జరుగుతున్నది.
xiii) హిందూపురం లోక్ సభ నియోజకవర్గం కేంద్రం. అనంతపురం జిల్లాలో రెండో పెద్ద పట్టణం. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్న పట్టణం. ఆ పట్టణాన్నికాదని పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఎంపిక చేశారు. పర్యవసానంగా ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను కొనసాగించాలని కూడా ఆందోళన జరుగుతున్నది.
ivx) నంద్యాలకు ప్రక్కనే ఉన్న పాణ్యం నియోజకవర్గాన్ని పూర్తిగా కర్నూలు జిల్లాలో చేర్చారు. దీనిపైన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
vx) ఆదోని కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
9. జిల్లాల పునర్విభజన, జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై పైన ప్రస్తావించినవే కాకుండా ఇంకా పలు డిమాండ్లతో ప్రజలు ఆందోళనలు చేస్తున్న పూర్వరంగంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ప్రజలు చేస్తున్న డిమాండ్స్ చాలా వరకు సమర్థనీయంగా ఉన్నాయి. వాటన్నింటిపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ప్రభుత్వం చర్చించాలి. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం హేతుబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి.
10. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 మేరకు శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తదనంతరం శాసనసభ నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకొని జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపడితే సహేతుకంగా ఉంటుంది.
T Lakshminarayana
T Lakshminarayana
(టి.లక్ష్మీనారాయణ,
కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక,
విజయవాడ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *