అమరావతి ఉద్యమానికి 750 రోజులు. “ఆగిన అమరావతి నిర్మాణం – అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రం” అంశంపై అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో తుళ్ళూరు, మందడం, వెలగపూడి, పెదపెరిమి, కృష్ణాయపాలెం కేంద్రాలలో జనవరి 5న ప్రజా చైతన్య సదస్సులు జరిగాయి.
అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు ఉద్యమ ఉత్తేజంతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. “న్యాయస్థానం నుండి దేవస్థానం” మహాపాదయాత్ర విజయగర్వం ఉద్యమకారుల ముఖాల్లో ప్రతిబింబించింది. “జై అమరావతి – జైజై ఆంధ్రప్రదేశ్”, “19 గ్రామాలతో మున్సిపల్ కార్పోరేషన్ వద్దే వద్దు – 29 గ్రామాలతో కూడిన కార్పోరేషన్ కావాలి” తదితర నినాదాలు సదస్సు ప్రాంగణాల్లో మారుమ్రోగాయి.
అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి , కన్వీనర్ శ్రీ పువ్వాడ సుధాకరరావు అధ్యక్షతన జరిగిన ఐదు సదస్సుల్లో నేను ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించాను. టిడిపి, బిజెపి, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(యం), జనసేన పార్టీలు, దళిత జెఏసి, తెలుగు మహిళా, అమరావతి జెఏసి నాయకులు వారికున్న సౌలభ్యాన్ని బట్టి ఒకటి, రెండు, మూడు సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. ప్రజా గాయకులు రమణ, కాశయ్య మరియు వారి సహచరులు ఉద్యమ గీతాలు ఆలాపించి, ఉత్తేజపరిచారు.
అమరావతి రాజధాని పరిరక్షణకై 750 రోజులుగా సాగుతున్న ఉద్యమం చారిత్రాత్మకమైనది. ప్రభుత్వ నిర్భంధకాండ, అప్రజాస్వామిక విధానాల పర్యవసానంగా అనేక ఆటుపోట్లను, అవమానాలను, కష్టనష్టాలను ఎదుర్కొంటూ మనోనిబ్బరంతో లక్ష్య సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తూ చారిత్రాత్మక పాత్ర పోషిస్తున్న ఉద్యమకారులు అభినందనీయులు. ఉద్యమానికి తలవొగ్గి, లోపభూయిష్టమైన వికేంద్రీకరణ (మూడు రాజధానుల) చట్టం మరియు సీఆర్డీఏ రద్దు చట్టం హైకోర్టు న్యాయ సమీక్షలో ఓటమి తప్పదని ఎట్టకేలకు గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకొన్నది. అంతటితో సమస్యకు ముగింపు పలకకుండా వికేంద్రీకరణకు కట్టుబడే ఉన్నామని, శ్రీబాగ్ ఒప్పందం ప్రస్తావనతో విశాఖపట్నం రాజధానికి చాలా అనువైన కేంద్రమని అభివర్ణించడం, మరొక చట్టాన్ని తెస్తామని శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేంత వరకు విశ్రమించకూడదని ఉద్యమకారులు సంకల్పబలంతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
విధ్వంసం, విచ్ఛిన్నం, వినాశకర విధానాలకు ముఖ్యమంత్రి తక్షణం స్వస్తి చెప్పాలని, అమరావతే ఏకైక రాజధానని విస్పష్టంగా ప్రకటించి, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై దృష్టిసారించాలని నేను డిమాండ్ చేశాను. అమరావతి రాజధాని పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలను నిరభ్యంతరంగా పునరుద్ధించుకోవచ్చని హైకోర్టు పునరుద్ఘాటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్మాణ పనులకు నిధులు కేటాయించి, పనులను యుద్ధప్రాతిపదికపై చేపట్టలేదని నిలదీశాను. రాజధాని నిర్మాణానికి నిధులను సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ముఖ్యమంత్రి డిల్లీకి వెళ్ళి ప్రధాన మంత్రి మోడీ గారిని కలిసినప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులిమ్మని అడిగారా? అమరావతిని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించింది. ఆ పద్దు కింద కూడా నిధులను సమకూర్చమని ఎందుకు విజ్ఞప్తి చేయలేదు? అవుటర్ రింగ్ రోడ్డు, అనంతపురం – అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి నిధులను ఎందుకు అడగలేదని సదస్సుల వేదికల నుండి ప్రశ్నించాను.
మోడీ ప్రభుత్వం గోడ మీద పిల్లివాటంగా హైకోర్టులో గతంలో దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను ఉపసంహరించుకొని, అమరావతే రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి, రు.1500 కోట్లు నిధులను కూడా మంజూరు చేసినట్లు విస్పష్టంగా పేర్కొంటూ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయడం ద్వారా సమస్య శాశ్వత పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014కు అనుగుణంగా నిబద్ధతతో చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాను. అమరావతి రాజధాని పరిధిలో కార్యాలయాలను నెలకొల్పడానికి భూములు తీసుకొన్న కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తక్షణం నిర్మాణ పనులను చేపట్టాలి. తద్వారా ప్రజలకు విశ్వాసాన్ని కల్పించి, భవిష్యత్తుపై బరోసా ఇవ్వాలని డిమాండ్ చేశాను.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2013 మేరకు వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి పథకాన్ని, కడప ఉక్కు కర్మాగారాన్ని, రామాయపట్నం ఓడరేవును, విశాఖలో రైల్వే జోన్ ను సత్వరం నెలకొల్పాలని, పోలవరం జాతీయ ప్రాజెక్టు డిపిఆర్-2కు ఆమోదం తెలియజేసి, తదనుగుణంగా నిధులను మంజూరు చేసి, యుద్ధప్రాతిపదికన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశాను.
“సేవ్ ఆంధ్రప్రదేశ్ – చేంజ్ ఆంధ్రప్రదేశ్” నినాదంతో ఉద్యమం కొత్త మలుపు తీసుకొని అమరావతి రాజధాని పరిరక్షణతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాదనే లక్ష్యంగా ఉధృతంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉన్నదన్న భావాన్ని బలంగా వినిపించా.
–టి.లక్ష్మీనారాయణ కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక