తాజ్ మహల్ కట్టించి వాస్తు ప్రపంచంలో చెరగని స్థానం సంపాదించుకున్న షాజహాన్ పుట్టిన రోజు ఈ రోజు. చాలా విషయాలకు గుర్తుండిపోయే మొగల్ చక్రవరి షాజహాన్ (1628-58). ఆయన 1592 జనవరి 5న పుట్టాడు. ఆయన అసలు పేరు ఖుర్రం షాజహాన్. ఆయనకు ఆ పేరు పెట్టింది తాత అక్బర్ చక్రవర్తి. ఖుర్రం అంటే పర్షియన్ బాషలో అనందకరం (Joyous)అని అర్థం. పూర్తిపేరు షాబుద్దీన్ ముహమ్మద్ ఖుర్రం) అయితే, షాజహాన్ సింహాసం అధిష్టించిన విధానం ఆనందదాయకం కానేకాదు. అదంతా రక్తపుమరకల దారి.
ఆయన సింహాసనం అధిష్టించే ముందు రోజులు కుట్రలు, తిరుగుబాటు, రక్తపాతంతో నిండితే, ఆతర్వాతి పాలన నిరకుంశమయింది. తాతతండ్రుల ఉదార విధానాలకు స్వస్తి పలికి కఠిన పరిపాలన సాగించాడు. ప్రజలనుంచి సేకరించిన నిధులతో విలాసంగా జీవించడం, భోగలాలసత, ఖరీదైన కట్టడాల, ఉద్యానవనాల నిర్మాణం సాగించాడు. ఆయన కట్టించిన తాజ్ మహల్ చుట్టు ఉన్న ప్రేమకథ కూడా కట్టుకథేనని ఈ మధ్య చరిత్రకారులు చెబుతున్నారు. బాగా తాగుడు, మత్తుమందు సేవించడం, విచ్చలవిడిగా ప్రవర్తించడ జరిగేది. ఆయన ఎపుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలిసేది కాదని చరిత్రకారులు చెబుతారు.
షాజహాన్ మొదట తనతండ్రి సేనలో సైనికుడు మాత్రమే. తర్వాత తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సింహాసనం స్వాదీనం చేసుకుని చక్రవర్తి అయ్యారు. ఈ తిరుగుబాటులో ఇద్దరు సోదరులను, మరొక ఆరుగురు దగ్గరి బంధులను హతమార్చాడు. అతను చంపిన వారిలో ఒక సోదరుడి పేరు దావర్ బక్షిర్ షిర్ షా. తండ్రి జహంగీర్ తర్వాత సింహాసంన అధిష్టాంచే అర్హత ఆయన కే ఉంది. అదే తిరుగుబాటు కారణమయింది.
ఇంత హింసతో సింహాసనం ఎక్కినా, ఆయన పరిపాలన మాత్రం సుస్థిరంగా సాగింది. సౌభాగ్యం తెచ్చింది. మొత్తం మొగలు చక్రవర్తల కాలంలో సిరిసంపదలతో తులతూగిన కాలం షాజహాన్ కాలమే. అందుకే షాజహాన్ కాలాన్ని మొగలుల స్వర్ణయుగం (Golden Age of Mughal Era)అని పిలుస్తారు. ఎందుకు ఆ కాలం స్వర్ణయుగ మయింది. అధికంగా పన్నులు వేసి భారీగా నిధులు సమకూర్చుకున్నారు. వర్తక వాణిజ్యాలు పెరిగాయి. వృత్తులు, కళారంగాలు వృద్ధి అయ్యాయి.
ఈ సంపదను షాజహాన్ ఎలా ఖర్చు చేశాడు?
విలాసవంతమయిన భవనాల నిర్మాణం మీద, వాస్తు వైభవం సృష్టించేందుకు ఆయన ఈ నిధులను ఖర్చు చేశాడు. ఇందులో కొంత మొత్తాన్ని నీటిపారుదల కోసం ఖర్చు చేశాడు. ఇది చాలా చిన్న మొత్తం. మిగతా డబ్బు రాజప్రాసాదం విలాసాల మీద, బానిసల సేకరణ మీద, సైన్యం కోసం ఖర్చయ్యేదని చరిత్రకారులు చెబుతారు. తన విలాసాలకు షాజహాన్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చే చేశాడు. ఆయన మయూర సింహాసానాన్ని తయారు చేయించుకునేందుకు 11 మిలియన్ రుపాయలు ఖర్చు చేశాడట.
అయితే, షాజహాన్ గుర్తుండి పోయేది మాత్రం ఈ వాస్తు నిర్మాణాల వల్లే. మొగల్ అర్కిటెక్చర్ లో ఆయన కాలం స్వర్ణయుగమనేందుకు ఆయన చేపట్టిన నిర్మాణాలు, ఉద్యానవనాలు కారణం.
ఆయన నిర్మించిన కట్టడాలు: ఢిల్లీ జామా మసీద్, రెడ్ ఫోర్ట్, పాకిస్తాన్ థాట్టాలోని షాజహానీ మాస్క్, షాజహానాబాద్ లోని కాశ్మీర్ గేట్, లాహర్ కోటలోని మోతీ మహల్, లాహోర్ లోని షాలిమార్ గార్డెన్స్, కాశ్మీర్ లోని షాలిమార్ బాగ్, వజీర్ ఖాన్ మాస్క్, వీటన్నింటికంటే ముఖ్యమయిన ఆగ్రాలోని తాజ్ మహల్. ఇవన్నీ అద్భుత, ప్రపంచ ఖ్యాతి పొందిన కట్టడాలు.
ఈ కట్టడాల వెనక బాగా క్రూరత్వం దాగుందని చెబుతారు. ఇది అర్జుమంద్ బాను బేగం తాజ్ మహల్ నిర్మాణానికి ప్రేరణ. ఆమెయే ముంతాజ్ మహల్. ఇది ఆమెకు షాజహాన్ కట్టించిన సమాధి. ముంతాజ్ మహల్ ఆయనకు రెండో భార్య. ఆమె సంపన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమెతో ఏప్రిల్ 4, 1607లో కాబూల్ లో నిశ్చితార్థం జరిగింది. అయిదేళ్ల తర్వాత మే 10,1612న వివాహమయింది. వారి సంబంధాన్ని బాగా రొమాంటిసైజ్ చెప్పడం మొదలయింది. షాజహాన్, ముంతాజ్ ల ప్రేమ కథ ఎక్కడ మొదలయిందోగాని, దానిని టూరిస్ట్ గైడ్లు నలుమూలలకు చేరవేశారు. భారతదేశం కూడా తాజ్ మహల్ తో టూరిజం ప్రమోట్ చేయాలనుకుంటున్నందున, షాజ హాన్ నిరంకుశ పాలన, రక్తపాతం ప్రచారం కాకుండా, ఈ అందమయిన ప్రేమకథను బాగా ప్రచారంలోకి తీసుకువచ్చింది. ఒక కట్టుకథ ఇదిగో.
తాజ్ మహల్ అద్భుతంగా ఉండాలని షాజహాన్ భావించారంటే, ఇలాంటి మరొక కట్టడం మళ్లీ ఎక్కడ కట్టకుండా ఉండాలని కూలీల చేతులు నరికించాడని ఒక కథ చెబుతారు. ఇదొకగాథ మాత్రమే, చారిత్రక ఆధారాలు లేవు.
షాజహాన్ కట్టడాలన్నింటికి పైన తెల్లడి పాలరాతి డోమ్ (గోపురం) ఉంటుంది. అయితే, రెడ్ ఫోర్ట్ లో మాత్రం ఇది కనిపించదు. తాజ్ మహల్ ని డిజైన్ చేసింది ఉస్తాద్ అహ్మద్ లోహ్డీ అనే వాస్తునిపుణుడు. రెడ్ ఫోర్ట్ లో లోపలి నిర్మాణాలకు తెల్ల పాలరాతినే వాడినా, కోట గోడలను మాత్రం ఎర్రటి శాండ్ స్టోన్ తో కట్టారు. ఈ రాతితో కడితే కోట శత్రుదుర్బేధ్యంగా ఉంటుందనుకున్నారేమో.
తాజ్ మహల్ నిర్మాణానికి 20 వేల మంది కూలీలు కష్టపడ్డారని చెబుతారు. చరిత్రకారుడు ఫెర్గన్ నికోల్ (Fergus Nicoll) ప్రకారం నిర్మాణానికి 50 లక్షల వెండి రుపాయాలు ఖర్చయ్యాయి. ఈ విషయాన్ని నికోల్ తన Shag Jahan: The Rise and Fall of Mugal Emperor లో రాశారు.
ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి. ఆర్థికాభివృద్ధి వల్లే. షాజహాన్ పాలనలో జిడిపి బాగా పెరిగింది.
షాజహాన్ కు ఉద్యానవనాలన్నాకూడా చాలా ఇష్టం. తాజ్ మహల్ బయటి వైపు తోటయే దీనికి సాక్ష్యం. దీని పేరు చార్ బాగ్ . చార్ బాగ్ అనే పేరు ఎందుకు? ఇస్లాం విశ్వాసాల ప్రకారం స్వర్గంలో నీళ్ల, పాలు, తేనె,మధువు లుపారే నాలుగు నదులున్నాయట. ఇదే చార్ బాగ్ ప్రేరణ. విస్తృత సూక్ష్మ కళ నైపుణ్యం, ఉద్యానవనాలు ఆయన పేరును చరిత్రలో శాశ్వతం చేశాయి.
ఈ కట్టడాల వల్ల ఆ రోజు వేల మందికి సంవత్సరాల పాటు ఉపాధి దొరికింటుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కట్టడాలన్నీ ఇప్పటికి ప్రభుత్వాలకు కూడా ఆదాయాన్నిస్తున్నాయి. ఇందులో తాజ్ మహల్ అత్యధిక ఆదాయాన్ని తెస్తూ ఉంది. తాజ్ మహల్ ని చూడాలంటే భారతీయులు రు. 30 చెల్లించాలి. విదేశీయులయితే రు. 500 చెల్లించాలి. అంటే తాజ్ మహల్ వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా వస్తూన్నదన్నమాట.
కోవిడ్ పాండెమిక్ ముందు తాజ్ మహల్ సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. కేంద్ర టూరిజం మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పార్లమెంటులో చెప్పిన వివరాల ప్రకారం 2018-19లో తాజ్ మహల్ సందర్శించిన వారు బాగా పెరిగారు. దీనితో అంతకు మునుపటి అయిదు సంవత్సరాల కంటే ఆయేడాదిరాబడి బాగా పెరిగింది. 2018-19లో తాజ్ మహల్ రాబడి రాబడి. 86,48,93,100. అంతకు ముందు సంవత్సరం ఇది కేవలం రు. 58,76,04,981 మాత్రమే. 2014-15లో రాబడి రు. 21,23,55,330 మాత్రమే. 2014-15లో 60,89,901 మంది తాజ్ మహల్ ను సందర్శించారు.