ముఖ్యమంత్రి జగన్ ని కలవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోగుల కోరిక నెరవేరడం లేదు. తమ సమస్యలను గురించి విన్నవించేందుకు వాళ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలవాలనుకుంటున్నారు. అయితే, ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ వద్దకు వారం రోజుల్లో తీసుకెళ్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఇచ్చిన హామీ అమలు కాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి లు ఈ మధ్య జరిగిన సమావేశాలకు రావడం లేదు. చాలా సార్లు చర్చలు జరిగినా మా 71 డిమాండ్లలో ఒక్కటీ పరిష్కారం కాలేదు. చర్చ జరిగిన ప్రతిసారీ మా డిమాండ్లను అడిగితెలుసుకోవడమే తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదు. ముఖ్యమంత్రి జగన్‌తో తప్ప అధికారులతో నిర్వహించే సమావేశాలతో ఎలాంటి ఉపయోగం లేదు. అయితే, ముఖ్యమంత్రితో సమావేశం జరగకుండా వీళ్లంతా చూస్తున్నారు,’ అని ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తాముసామరస్యంగా ఉంటున్నా వివక్ష చూపుతూన్నారని చెబుతూ ఉద్యమ కార్యాచరణలోకి దిగేలా ప్రభుత్వమే తోస్తున్నదని ఉద్యోగుల నాయకుడు బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. . ఐకాసల విస్తృత స్థాయి సమావేశాన్ని 9న నిర్వహించాలనుకుంటున్నామని, ఈలోపు సీఎం జగన్ ఉద్రిక్త వాతావరణం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్‌తో చర్చలు జరగకుండా మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని అమరావతి జెఎస నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు.
‘2013-14 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆదాయం ఏమి తగ్గలేదు. ఫిట్‌మెంట్ 28% ఇస్తే రూ.3,100 కోట్లు, 45% ఇస్తే రూ.8వేల కోట్లు మాత్రమే భారం పడుతుంది. సమస్యల పరిష్కార బాధ్యతలను తీసుకుంటామని బుగ్గన, సమీర్ శర్మ, సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇవ్వడంతో ఉద్యమాన్ని వాయిదా వేశాం. ఆపైన జరుగుతున్న చర్చలు ఎక్కడ మొదలు పెట్టామో… అక్కడే ఉన్నాయి. మా ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.’అని బొప్పరాజు అన్నారు.