గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ ఒక విశేషం…

(జింకా  నాగరాజు)
మహాత్మా గాంధీ, డా. అంబేడ్కర్, పండిట్ నెహ్రూ
వీళ్లు ముగ్గురు భారత దేశానికి 20వ శతాబ్దం అందించిన గొప్ప ధింకర్స్.
అయితే, ఎవరి దారి వారిదే. సైద్థాంతికంగా ముగ్గురికీ పొసగదు. గాంధీజీ సాంప్రదాయవాది. నెహ్రూ అధునికుడు, అంబేడ్కర్ కులవ్యవస్థను కూల్చేయాలనే వ్యక్తి. తాము నమ్మిన వాటిలో రాజీలేని ధోరణి వారిది.

అయితే, తీవ్రమయిన ఈ సైద్ధాంతిక విబేధాలు వ్యక్తిగత వైషమ్యంగా మారనీయలేదు. మరీ కష్టమయినపుడు పక్కకు జరిగారు తప్ప నీచ రాజకీయాలకు దిగజారలేదు. వాళ్ల మధ్య ఉన్న పరస్పర గౌరవం రాజ్యంగం డ్రాఫ్టింగ్ కమిటీకి డా. అంబేడ్కర్ ని నియమించడంలో వ్యక్తమయింది.

రాజ్యాంగ సభ తొలిరోజుల్లో అంబేడ్కర్ సాధారణ సభ్యుడే. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ సభ చర్చలు మొదలయ్యాయి.
1947 జనవరి నుంచి జూలై దాకా అంబేడ్కర్ కు ప్రత్యక్ష పాత్ర లేదు.
కాకపోతే, అంతర్జాతీయంగా ఆయనకు న్యాయనిపుణుడిగా, చరిత్రకారుడిగా, ఆంథ్రోపాలజీ నిపుణుడిగా బాగా పేరుంది.

ఈ నేపథ్యంలో 1947 జూన్ లో డ్రాఫ్టింగ్ కమిటీకి ఛెయిర్మన్ గా ఎవరిని నియమించాలనే ప్రశ్న వచ్చింది.
జవహర్ లాల్ నెహ్రూ బ్రిటిష్ రాజ్యంగ నిపుణుడు సర్ విలియమ్ ఐవర్ జెన్నింగ్స్ ని నియమించాలని భావిస్తున్నారు. ప్రొఫెసర్ జెన్నింగ్స్ బాగా పేరున్న రాజ్యాంగ నిపుణుడే. లండన్ స్కూల్ ఎకనమిక్స్ లో పనిచేశారు. కేంబ్రిడ్జి వైస్ చాన్స్ లర్ గా కూడా ఉన్నారు. శ్రీలంక రాజ్యంగంతయారీలో కూడా పాలు పంచుకున్నారు.
జెన్నింగ్స్ ని నియమించాలనే ప్రతిపాదనతో నెహ్రూ గాంధీజీ దగ్గరకు వెళ్లారు. జెన్నింగ్స్ పేరు విని గాంధీజీ
అవాక్కయ్యారు. “ఒక వైపు మనం విదేశీయులను తరిమేస్తున్నం. మరొక వైపు మరొక విదేశీయుడిని తీసుకురావడం బాగుండదు,” అని చెప్పారు. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో న్యాయకోవిదుడిగా పేరున్న  డాక్టర్ అంబేడ్కర్ ఈ పనికి యోగ్యుడని, ఆయనను సేవలను వినియోగించుకోవాలని   సూచించారు.

మొదట్లో గాంధీజీ సూచన నెహ్రూకు నచ్చలేదు. అయితే, స్వదేశీవాది అయిన గాంధీజీ ఆయనను వప్పించారు.

దానితో ఆగస్టు 3  న నెహ్రూ అంబేడ్కరని తొలి న్యాయశాఖ మంత్రిగా నియమించారు.  ఆ రోజు నెహ్రూ తన క్యాబినెట్ సహచరుల పేర్లను ప్రకటించారు.  తర్వాత ఆగస్టు 29న అంబేడ్కర్ ఛెయిర్మన్ గా రాజ్యంగం డ్రాఫ్టింగ్ కమిటీని ప్రకటించారు.. అంబేడ్కర్ అలా రాజ్యాంగ రచనకు గొప్పగా మార్గ దర్శకత్వం వహించి రాజ్యంగ సభ ఛెయిర్మన్ డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ కు సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *