(అవ్వారు శ్రీనివాసరావు)
‘నా కెరీర్లో ఎన్నో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశా. ఫ్రైజ్ లు కూడా అందుకున్నా. ఎక్కడకు వెళ్లినా నాతోపాటు నాన్న వెన్నంటి ఉండేవారు. అయితే, ఈ మెగా ఈవెంట్ లో నా వాళ్లు ఎవరూ లేరు. ఫాదర్ రాకుండా పొరుగుదేశంలో పోటీ.. అయినా సక్సెస్ ఫుల్ గా లిఫ్ట్ చేశా. ఈ విజయంతో చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యా.. ఇది ఓ ప్రౌడ్ మూమెంట్. నాన్న నా కోసం ఎంతో హార్డ్ వర్కు చేశారు. ఇంకా ఇంకా మెడల్స్ సాధించి ఫాదర్ కు మరింత పేరు తీసుకువస్తా…’ అంటూ మంగళగిరి పవర్ లిఫ్టర్ సాదియా అల్మస్ విజయగర్వంతో పేర్కొన్నారు.
ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో సాదియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నవిషయం విదితమే. 57 కేజీల విభాగంలో జరిగిన ఈ పోటీల్లో స్క్వాట్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 162.5 కేజీలు మొత్తంగా 400 కేజీలు బరువు ఎత్తి ఓవరాల్ బంగారు పతకాన్ని సాధించి మంగళగిరి ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ప్రస్తుతం సాదియా విజయానందంలో ఉన్నారు. ఇక మంగళగిరిలో ఇప్పుడు స్వర్ణ సాదియా విజయగీతిక డీజే సౌండ్ లో వినిపిస్తోంది.
నా విజయానికి నాన్న ఎంతో హార్డ్ వర్క్ చేశారు: సాదియా అల్మస్
స్వస్థలం చేరుకున్న సాదియాకు అపూర్వ స్వాగతం లభించింది. ‘మన ఊరమ్మాయి…’ సందాని కుమార్తె సాదియా సాధించిన విజయాన్ని మంగళగిరి నగరవాసులు సొంతం చేసుకుంటున్నారు. ఎంతగానంటే.. తమ వాడలోని అమ్మాయి.. తమ ఇంటిలోని ఆడబిడ్డ పతకాన్ని గెలుచుకొచ్చినంతగా స్థానికులు సంబరపడుతున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఖిద్మత్ టీమ్ రూ.10వేల నగదు ప్రోత్సాహకాన్ని సాదియాకు అందించి విజయానందాన్ని పంచుకుంది.
అభినందనల వెల్లువ..
పవర్ స్టార్ సాదియాకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సాదియా ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. సాదియా, ఆమె తండ్రి కోచ్ సందాని స్ఫూర్తితో మరింత మంది క్రీడల్లో రాణించాలని విజయసాయి ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీ నారా లోకేశ్ ‘స్వర్ణం సాధించావు.. సాదియా శెహభాష్’ అంటూ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్న సాదియాకు అవసరమైన సహకారం అందిస్తానని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా సందాని నివాసానికి వెళ్లి స్వర్ణ సాదియాను సత్కరించి హర్షం వ్యక్తం చేశారు. సాదియా గెలుపు దేశానికే గర్వకారణమన్నారు. తల్లిదండ్రుల కృషి, అంకితభావం, వారు చేసిన త్యాగం గొప్పదని ఆర్కే ప్రశంసించారు.
మంగళగిరికి చెందిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు సందాని స్వగృహానికి వెళ్లి సాదియా ను అభినందించి సత్కరించారు. మన ఊరి ఘనతను సాదియా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం చాలా సంతోషకరమని మురుగుడు పేర్కొన్నారు.
సీపీఎం నాయకులు ఎస్. చెంగయ్య, వై.కమలాకర్, జేవీ రాఘవులు తదితరులు ఇంటికి వెళ్లి సాదియాను ఘనం సత్కరించారు. సాదియాను యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆమె విజయం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. సాదియాను తీర్చిదిద్దడంతో తల్లిదండ్రుల కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.
మంగళగిరికి చెందిన ‘ఫ్రెండ్స్ ఫర్ ఎవర్’ కన్వీనర్లు మాజేటి పార్వతి, పసుమర్తి సుజాత ఆధ్వర్యంలో సుమారు 70 మంది మహిళలు సాదియా ను ఘనంగా సత్కరించి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
యూత్ ఐకాన్ సాదియాను కేఎల్ యూనివర్సిటీ ఘనంగా సత్కరించింది. సాదియా తమ విద్యార్థిని కావడం తమ విద్యాసంస్థకు ఎంతో గర్వకారణమని యాజమాన్యం పేర్కొంది.
ఇంకా పలు సంఘాలు, సంస్థలు సాదియాను సముచిత రీతిన సత్కరించి తమ ఆనందాన్ని పంచుకునేందుకు సమాయత్తమవుతున్నాయి.
రోటరీ క్లబ్ హైదరాబాద్ డెక్కన్ కు సందాని కృతజ్ఞతలు
ఘన విజయం సాధించిన తన కుమార్తె సాదియాకు పెద్దఎత్తున అభినందనలు తెలియజేస్తున్న ప్రజాప్రతినిధులు, మంగళగిరిలోని వివిధ సంస్థలు, సంఘాలకు షేక్ సందాని ధన్యవాదాలు తెలిపారు. ఇస్తాంబుల్ లో ఇటీవల జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు సాదియా హాజరయ్యేందుకు గాను రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ రూ.2లక్షల ఆర్థిక సహాయం అందజేసిందని సందాని తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతినిధులకు సందాని కృతజ్ఞతలు తెలిపారు.