సాదియా దేశానికే గర్వకారణం: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రశంస. పవర్ లిఫ్టర్ నివాసానికి వెళ్లి ఆత్మీయ సత్కారం
(అవ్వారు శ్రీనివాసరావు)
మంగళగిరి నగరానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా ఆల్మస్ సాధించిన బంగారు పతకం దేశానికే గర్వకారణమని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కొనియాడారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న సాదియా అల్మస్ కు అభినందనలు వెల్లువెత్తున్నాయి.
57 కేజీల విభాగంలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సాదియా.. స్క్వాట్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 162.5 కేజీలు మొత్తంగా 400 కేజీలు బరువు ఎత్తి ఓవరాల్ బంగారు పతకాన్ని సాధించిన విషయం విదితమే.
శుక్రవారం ఎమ్మెల్యే ఆర్కే స్వయంగా సాదియా ఆల్మస్ స్వగృహానికి వెళ్లి… శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. సాదియా ఆల్మస్ సాధించిన ఘనవిజయం తెలుగు రాష్ట్రాలకే కాదు… భారతదేశానికే గర్వకారణమని అభివర్ణించారు. బంగారు తల్లి సాదియా తన నియోజకవర్గ క్రీడాకారిణి కావడం, తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
సాదియా అల్మస్ అంతర్జాతీయ స్థాయికి ఎదగడంలో ఆమె తల్లిదండ్రులు కృషి, త్యాగం ఎనలేనిదని ఎమ్మెల్యే ఆర్కే కొనియాడారు. సాదియా తన తండ్రి సందాని వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం ఎంతో గొప్పవిషయమన్నారు. అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ గా గుర్తింపు పొందిన సందాని తన కుమార్తెను దేశం గర్వించేస్థాయికి తీసుకురావడం అభినందనీయమన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచిన సాదియా, భవిష్యత్తు లో మరిన్ని పతకాలు సాధించి మంగళగిరి కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సాదియా సోదరి ఆసియా వైద్యవిద్యను అభ్యసిస్తూనే వెయిట్ లిఫ్టింగ్ లో రాణిస్తుండడంపై ఎమ్మెల్యే ఆర్కే హర్షం వ్యక్తం చేస్తూ అక్కా చెల్లెళ్లిద్దరూ దేశకీర్తిని దశదిశలా చాటాలని ఆకాంక్షించారు.
ఖిద్మత్ టీమ్ రూ.10వేల నగదు ప్రోత్సాహకం
అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన షేక్ సాదియా అల్మాస్ ను మంగళగిరి నగరంలో స్వచ్ఛంద సేవలు అందిస్తున్న ఖిద్మత్ బృందం శుక్రవారం ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేసింది.
మంగళగిరి ఇస్లాంపేటలోని సాదియా నివాస గృహంలో ఖిద్మత్ టీమ్ కన్వీనర్ షేక్ షఫీ పవర్ లిఫ్టర్ సాదియా అల్మస్ ను శాలువాతో సత్కరించి, పదివేల రూపాయల ఆర్థిక ప్రోత్సాహం అందజేశారు. సాదియా స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికి, మంగళగిరికి మంచి పేరు తెచ్చారాని కొనియాడారు.