రాయలసీమ అభివృద్ధికి రాయలసీమ ప్రజా చైతన్య ఆవశ్యకతపై రాయలసీమ సాగునీటి సాధన సమితి విన్నూత్న కార్యక్రమాలను చేపట్టింది.
రైతులతో పాటు మహిళా, యువత, సమాజంలోని అన్ని వర్గాల చైతన్య కార్యక్రమాలకు అంకురార్పణ చేసింది. ఈ కార్యక్రమాలు అవకాశం ఉన్న ఏ ప్రదేశంలో నైనా నిరాఘాటంగా నిర్వహించడానికి కార్యాచరణ చేపట్టింది. ఇందులో బాగంగా డిసెంబరు 28, 29 వ తేదీలలో నంద్యాలలో యర్రం వారి పెళ్ళిలో మేధావులతో, రైతులతో రాయలసీమ అంశాలపై చర్చించడం జరిగింది.
కృష్ణా జలాలపై నీటి వాటా హక్కుతో కృష్ణా పెన్నార్ (సిద్దేశ్వరం) ప్రాజెక్ట్ నిర్మించడానికి 1951 వ సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ అనుమతులు ఇచ్చినప్పటికి రాయలసీమ ప్రజా చైతన్య రాహిత్యంతో ఆ ప్రాజక్ట్ ను పోగొట్టుకున్న విషయంపై ఈ సందర్భంగా చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన రాయలసీమకు కీలకమైన ఏడు ప్రాజెక్టులను కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో అనుమతులు పొందాల్సిన ప్రాజక్టులుగా పేర్కొనడం వలన రాయలసీమ హక్కులకు విఘాతం కలగడంపై ఈ సందర్భంగా చర్చించడం జరిగింది.
ఒక సారి మన చెతన్య రాహిత్యంతో కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును పోగొట్టుకున్నాం, ఇప్పుడైనా జాగృతం కాకపోతే పోతే రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన ఏడు ప్రాజక్టులు కూడా రాయలసీమకు అందని ద్రాక్ష పండ్లే అవుతాయన్న విషయంపై కూడా చర్చ జరిగింది.
మన రాయలసీమ నాలుగు జిల్లాలకు చెందిన అన్నలే నాలుగు పార్టీలకు ఆంధ్రప్రదేశ్ లో అధినాయకులుగా ఉన్నా, మన అంశం వారికి పట్టకపోవడంపై కూడా ఈ సందర్భంగా చర్చించడం జరిగింది.
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్న ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు కృష్ణా నది పరివాహక ప్రాంతమైన కర్నూలు లో కాకుండా విశాఖపట్నం లో ఏర్పాటుకు ప్రతిపాధనలు పంపడమై పాలక పక్ష చిత్తసుద్దిపైన కూడా చర్చ జరిగింది.
మొత్తానికి రాయలసీమ ప్రజా చైతన్యానికి విత్తనం నాటే కార్యాక్రమం ప్రారంభమైంది.
రాయలసీమ సమాజ జాగృతి తో రాయలసీమకు బంగారు భవిష్యత్ అని సంపూర్ణంగా విశ్వసిస్తూ, ఆ దిశగా చేపట్టిన కార్యాచరణకు సంపూర్ణ సహకారం అందించవలసిందిగా రాయలసీమ వాసులకు, ప్రజాస్వామిక వాదులకు రాయలసీమ సాగునీటి సాధన సమితి విజ్ణప్తి చేస్తున్నది.
–బొజ్జా దశరథరామి రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి