వెంటనే గుంటూరులోని జిన్నా సెంటర్ పేరు మార్చాలి లేకుంటే బీజేపీ కార్యకర్తలు ఆ సెంటర్ ని కూల్చుతారని హెచ్చరిక చేసిన రాజాసింగ్
హైదరాబాద్ గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటనల చిచ్చుబడ్డి.
ఆయన అపుడపుడు చాలా ఆకర్షణీయమయిన సంచలన ప్రకటనలు చేస్తుంటారు. హైదరాబాద్ లో ముస్లింల ప్రాంతమయిన గోషా మహల్ నుంచి ఆయన ఎన్నికల్లో గెలిచాడు.
బిజెపి లో అందరికంటే కట్టర్ హిందూత్వ వాది. అదే ఆయన బలం కూడా. చాలా మంది యువకులు ఆయనని లైక్ చేసేది, ఈ ప్రకటనల వల్లే. బిజెపి నాయకత్వమే ఆయన అంత సీరియస్ గా తీసుకోదు. ఆయన ధోరణి వివాదానికి బాగుంటుంది కాని, తెలంగాణలో పార్టీకి పనికిరాదని అనుకుంటూ ఉంటుందేమో ఆయనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలని ఇంతవరకు అనుకోలేదు. పదహారాణాల కాషాయం పూసుకున్నా ఆయన చేతికి బిజెపి నాయకత్వం ఇవ్వలేదు.
ఇలాంటి రాజాసింగ్ ఆంద్రప్రదేశ్ గుంటూరు లో ఉన్న జిన్నా సెంటర్ ను కూల్చాలని పిలుపునిచ్చారు.
జిన్నా పేరుతో భారత దేశంలో ఎక్కడ ఏమీ నిర్మాణాలుండవు. అయితే,ఒక్క గుంటూరులోనే ఒక టవర్ కట్టారు. ఆంధ్రలో ఎపుడు మతావేశం కట్టలు తెంచుకోదు కాబట్టి, పక్కా సెక్యులర్ స్టేట్ కాబట్టి ఈ సెంటర్ చెక్కుచెదరకండా నిలబడి ఉంది ఇప్పటికీ. దీని మీద కనీసం ఒక రాయివేసిన సంఘటనలు కూడా లేవు.దేశ విభజన సంయంలో గాని, పాకిస్తాన్ తో ఇండియా యుద్ధం చేస్తున్నపుడు గాని ఈ సెంటర్ మీద ఎవరూ ఆగ్రహం చూపించలేదు.
గుంటూరు గొప్ప మత సామరస్యం ఉన్న పట్టణం. భారత జాతిపిత మహాత్మాగాంధీ రోడ్డులో పాకిస్తాన్ జాతిపిత జిన్నా టవర్ ఉంటుంది. ఆరు స్తంభాల మీద నిర్మించిన ఈ టవర్ పైన మసీద్ డోమ్ ఉంటుంది. పూర్తిగా ముస్లిం వాస్తు శైలిలో నిర్మించిన టవర్ ఇది. దీనిని రక్షిత కట్టడంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది. ఎపుడో స్వాతంత్య్రం రాక ముందు జిన్నా ప్రతినిధి జుదా లియాకత్ అలీఖాన్ గుంటూరు వచ్చారని, అపుడు ఆయనకు పట్టణంలో ముస్లిం నాయకుడు లాల్ జాన్ బాషా ఘన స్వాగతం చెప్పారని, లియాఖత్ అలీ ఖాన్ రాక జ్ఞాపకంగా ఈ టవర్ ను నియమించారని ఇక్కడి ప్రజలు చెబుతారు. ఆ లాల్ జాన్ బాషా మనువడే తెలుగుదేశం పార్టీ తరఫున ఒకపుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లాల్ జాన్ బాషా.
మరొక కథనం ప్రకారం హిందూ ముస్లిం సమైక్యత చిహ్నంగా స్వాతంత్య్ర పోరాట కాలంలో గుంటూరు మునిసిపల్ చెయిరన్లు నడింపల్లి నరసింహారాావు, తెల్లాకుల జాలయ్య జిన్నాటవర్ ను నిర్మించారని మరికొందరు చెబుతారు. ఎవరు ఎందుకు నిర్మించినా, ఇదొక చారిత్రక కట్టడం. గుంటూరు వాసులకెపుడే ఇది కంటకింపు కాలేదు.
అయితే, ఇలాంటి టవర్ ను కూల్చేయాలని హైదరాబాద్ బిజెపి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
భారత దేశాన్ని ముక్కలు చేసిన జిన్నా పేరు ఏపీ లో ఎందుకు పెట్టారో ముఖ్యమంత్రి చెప్పాలని అడిగారు.
భారతదేశం స్వాతంత్రం కొసం త్యాగాలు చేసిన చాలా మంది యోధులు గుంటూరులో రాష్ట్రంలో ఉన్నారు. ఆ సెంటర్ వారిపేరు పెట్టాలని ఆయన సూచించారు.
చాలా మంది హిందువుల హత్యకు కారణం అయిన వ్యక్తి పేరు ఎలా పెడతారో సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని రాజాసింగ్ అడిగారు..
వెంటనే ఆ సెంటర్ పేరు మార్చాలి లేకుంటే బీజేపీ కార్యకర్తలు ఆ సెంటర్ను కూల్చుతారని హెచ్చరిక చేసిన రాజసింగ్ సింగ్ హెచ్చరించారు.