సామ్రాజ్యవాద ధిక్కార హీరో సద్దాం హుస్సేన్ అమరత్వపు ఇంధనం మంటై మండే చితిలో దగ్దమవుతోన్న అమెరికా సామ్రాజ్యవాదం… పూర్తిగా నశించి తీరుతుంది
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ఏకద్రువ ప్రపంచంలో మదపుటేనుగు వంటి అమెరికా సామ్రాజ్యవాద నేతృత్వంలో 32 దేశాల సంకీర్ణ సైనిక కూటమి మొదటి గల్ఫ్ యుద్ధంలో 42 రోజులు ఇరాక్ పై బాంబింగ్ చేసింది. ఐనా చలించని ధీరుడు సద్దాం (Saddam Hussein Abd al-Majid al-Tikriti) . A-ఆర్ధిక B-ఆయుధ C-ఆహార (మూడు ఆ ల) ఆంక్షల్ని విధించి 12 ఏళ్ళు ఇరాక్ ని శిథిల రాజ్యంగా మార్చింది. ఐదు లక్షల పసిపిల్లల మరణానికి ప్రపంచ పెట్టుబడి కారణమైనది. శిధిలాల్లోనే దేశభక్తియుత విత్తులు నాటి మొక్కల్ని మొలిపించి వృక్షాలుగా పెంచిన దేశభక్తియుత సర్కార్ కి నాయకత్వం వహించాడు సద్దాం!
పన్నెండు ఏళ్ల తర్వాత 2003 మార్చిలో లక్షా డెబ్భై వేల సైన్యంతో ఇరాక్ దురాక్రమణకు అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి దిగింది. ఆ దాడికి సద్దాం హుస్సేన్ లొంగిపోవడం ఖాయమనే పలు జోస్యాలు కూడా వెలిసాయి. వాటిని సద్దాం పటాపంచలు చేసాడు. తన దేశ విముక్తి కోసం దురాక్రమణ దార్లపై సర్వ సుఖాల్ని గడ్డిపరకగా తోసిపుచ్చి కటోరమైన అజ్ఞాత రాజకీయ జీవితం లోకి వెళ్ళాడు. సద్దాం ఉరితీత సందర్భంలో రాసిన నా సుదీర్ఘ కవిత నుండి కొన్ని పంక్తుల్ని ఆయన 15వ వర్ధంతి సందర్భంగా ఈ క్రింద ఉదహరిస్తున్నాను.
ముప్పదేళ్లు ఏలినోడు డెబ్బదేళ్ల వయస్సులో ఏడడుగుల సొరంగాన్ని నివాసంగ ఎంచినోడు.
నేటికి సరిగ్గా 15 ఏళ్ళ క్రితం 30-12-2006 వ తేదీన ఆ సామ్రాజ్యవాద వ్యతిరేక వీర యోధుణ్ణి తుచ్ఛమైన అమెరికన్ దురాక్రమణదార్లు ఉరి తీశారు. కానీ అదే ఇరాకీ జాతీయ విమోచనోద్యమ ప్రజా ప్రతిఘటన ఏకద్రువ ప్రపంచ వ్యవస్థని బద్దలు కొట్టింది. అదే అమెరికా నేడు నిరుపేద ఆఫ్ఘనిస్తాన్ నుండి తోకమడిచి పారిపోయింది. సద్దాం భౌతికంగా మరణించి ఉండొచ్చు. కానీ ఆయన పొందిన రాజకీయ అమరత్వం ప్రపంచ చరిత్ర గమనానికి ఓ ఇంధనమై మంటలు రేపుతూ దురాక్రమణ దార్లకు చితి పేర్చుతూ రాజకీయ మరణ శాసనం రాస్తూనే ఉంది. అలాంటి చిరస్మరణీయమైన సద్దాం అమరత్వాన్ని ఆయన 15వ వర్ధంతి సందర్భంగా వేనోళ్లుగా రాజకీయ కీర్తిగానం చేద్ధాం.