కాటికాపరులకు ‘కొమ్మారెడ్డి సేవాసమితి’ వితరణ

 రోగులకు పళ్ళు, బ్రెడ్ పంచుతుంటారు. అనాధాశ్రమాల్లో వస్త్రాలు, దుప్పట్లు పంచుతుంటారు. పేదలకు అన్నదానాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి కార్యక్రమాల్లో వినిపించని పేరు, ఎవరికి గుర్తుకు రాని పేరు ఒకటుంది. ఈ పేరు ఎపుడు వార్తల్లో ఉండదు. చర్చల్లో ఉండదు. ఎవ్వరూ ఇష్టపడని వృత్తి అది . ఇలాంటి వాళ్లకు సేవా సంస్థలు కూడా సాయం చేసిన దాఖలా లేదు.ఇపుడు తొలిసారి వీళ్ళను గుర్తించి సాయం చేసేందుకు ఒక సేవాసంస్థ ముందుకు వచ్చింది.
మంగళగిరి కొమ్మారెడ్డి సేవాసమితి వినూత్న సేవాకార్యక్రమాలకు పెట్టింది పేరు. సేవాసమితి వితరణ కార్యక్రమాలలో భాగంగా ప్రతి గురువారం మధ్యాహ్నం ‘నాని నాస్తా’ పేరిట పేదలకు అన్నదానం చేస్తున్న విషయం విదితమే.
మంగళగిరి నగర, పరిసర ప్రాంతాల్లో శ్మశాన వాటికల అభివృద్ధికి కొమ్మారెడ్డి సేవాసమితి తన వంతు కృషి చేస్తోంది. ప్రతియేటా మాదిరిగానే క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ… కాటికాపరులకు చేయూతనిచ్చింది.
ఈ రోజు మధ్యాహ్నం పాతబస్టాండ్ సెంటర్లోని నాని స్వీట్స్ వద్ద నిర్వహించిన ఈ వితరణ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు డాక్టర్ మాజేటి వంశీకృష్ణ, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ అనిల్ చక్రవర్తి ఇసునూరి, సెక్రటరీ ఎస్ఏ శిలార్, కోశాధికారి గాజుల శ్రీనివాసరావు, ప్రతినిధి నాగేశ్వరరావులు అతిథులుగా హాజరయ్యారు.
కొమ్మారెడ్డి సేవాసమితి మేనేజింగ్ ట్రస్టీ, నాని స్వీట్స్ అధినేత కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం (నాని)… అతిథుల చేత శ్మశాన కాటికాపరులు 18 మందికి రెండు జతల దుస్తులు, దుప్పట్లు, స్వీట్లు పంపిణీచేశారు. అలాగే, భోజనం ప్యాకెట్లను అందజేశారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కాటికాపరులకు ధన్యవాదాలు తెలిపారు. కొమ్మారెడ్డి సేవాసమితి నిర్వహిస్తున్న పలు సామాజిక హిత కార్యక్రమాలను రోటర్ క్లబ్ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *