రాష్ట్ర ప్రజల “వినోదం” కోసం సినిమా టికెట్ల ధరలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగ్గించారు. చాలా సంతోషం… అలాగే విశ్వ “హిందూ మనోవికాసం” కోసం ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్ల ధరలను కూడా (శ్రీ వాణి ట్రస్ట్, ఉదయాస్తమాన సేవా టికెట్లు) తగ్గించేలా టీటీడీ పెద్దలకు ఆదేశాలు ఇవ్వాలి.
తిరుమల శ్రీవారి “ఉదయాస్తమాన” సేవ ధర పెంపు పై పునఃపరిశీలించి సామాన్య భక్తులకు సైతం తక్కువ ధరతో అందుబాటులో ఉండే విధంగా “లక్కీ డిప్” ద్వారా పారదర్శకంగా టికెట్ల కేటాయింపు జరగాలి.
శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్ ధర పెంపుతో ” ప్రీమియం పిలిగ్రిమ్స్” ను స్వామి వారికి హిందూ సమాజానికి పరిచయం చేయబోతున్నారా?
తిరుమల వెంకన్న పై భక్తులకు వున్న అపారమైన నమ్మకాన్ని భక్తి విశ్వాసాన్ని ఆదాయ మార్గాలుగా మార్చకండి!
“ఉదయాస్తమాన” సేవ అంటే ఉదయం సూర్యోదయం ముందు అంటే సుప్రభాతం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఏకాంత సేవ వరకు శ్రీవారి ఆలయంలో జరిగే అన్నీ సేవలలో పాల్గొనే అవకాశం కోసం లక్ష రూపాయలతో సుమారు 1981 సం”లో ప్రారంభమై పదిలక్షల వరకు వచ్చిన ఒక టికెట్ ధరను ఏకంగా వారంలో “1 కోటి 50 లక్షలు శుక్రవారం” మిగిలిన రోజులలో “ఒక కోటి” రూపాయలకు అమాంతం పెంచడం “ధార్మిక సంస్థను వ్యాపార సంస్థగా” మార్చడం కాదా?? ఇది ధర్మమేనా??
టీటీడీ అధికారులు ప్రారంభం నుంచి ఉదయాస్తమాన సేవ ప్రారంభం 1981 నుంచి టిక్కెట్లు ఇప్పటివరకు భక్తులకు ఎన్ని విక్రయించారు ఇప్పుడు 531 టిక్కెట్లు మిగలడానికి కారణాలు ఏమిటి? సేవా టికెట్ల గడువు ముగిసిందా లేక విదేశాలలో స్థిరపడిన భక్తులు గత కొన్ని సంవత్సరాలుగా సేవకు రావడం లేదా?? అన్నదానిపై టిటిడి భక్తులకు స్పష్టమైన ప్రకటన చేయాలి!
టిటిడి లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 531 టికెట్ల ధర ప్రకారం వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మరొక ధర్మకర్తల మండలి “ఉదయాస్తమాన సేవ” టికెట్లను మరిన్ని పెంచి ఆదాయం సమకూర్చే “అక్షయపాత్ర”లా చేస్తారా!
“ఉదయాస్తమాన” సేవ టిక్కెట్ల అమ్మకాల ద్వారా వచ్చే 600 కోట్ల రూపాయలతో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం చేపడతామని ప్రకటించిన టీటీడీ భవిష్యత్తులో మరో భారీ వైద్య ప్రాజెక్టు నిర్మాణం పేరుతో రాబోవు ధర్మకర్తల మండలి ఉదయాస్తమాన సేవ టికెట్లను “5 కోట్లు” “10 కోట్లకు” పెంచుకుంటూ పోతే అందుకు బాధ్యులు ఎవరు??
రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల నిర్మాణాల,నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వాల మీద ఉంది కానీ తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలలో ఇప్పటికే కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం విద్య,వైద్యం కోసం టీటీడీ ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తుంది కానీ 600 కోట్ల భారీ బడ్జెట్ ఆసుపత్రి నిర్మాణ బాధ్యతలను పూర్తిగా టీటీడీ భుజాలకు ఎత్తుకోవడంపై ఐఏఎస్ అధికారులు, ధర్మకర్తల మండలి పునరాలోచించాలి!
శ్రీ వాణి ట్రస్ట్ పేరుతో ఇప్పటికే ఒక టికెట్ దర ఒకరికి 10,500 రూపాయలకు విక్రయిస్తున్న టిటిడి నేడు ఉదయాస్తమాన టికెట్టు ధరను అమాంతం పెంచడం శ్రీవారి భక్తులకు ఆందోళన,ఆవేదన కలిగిస్తుంది!
తిరుమల శ్రీవారి సేవా టికెట్ల ధరల విషయంలో టీటీడీ తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై హిందూ ధార్మిక సంఘాలు,సంస్థలు మఠాధిపతులు, పీఠాధిపతులు శ్రీవారి భక్తులు ప్రశ్నించాలి!