సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా 19 న సాహితీస్రవంతి ‘జనకవనమ్’
మార్క్సిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర మహాసభ సందర్బంగా ఈ నెల 19న గుంటూరు బ్రాడీపేట గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో తెలుగు కవులు, కళాకారులతో రాష్ట్రస్థాయి ‘జన కవనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి సత్యాజీ తెలిపారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమంలో కవులు పాల్గొని సమకాలీన సమస్యలపై తమ గళాన్ని వినిపిస్తారు. కవులెవరయినా ఇందులో పాల్గొనవచ్చు.
మంగళవారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సాహితీవేత్తలు, పెనుగొండ లక్ష్మీనారాయణ, కొత్తపల్లి రవిబాబు, ప్రసాదమూర్తి, సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ఖాదర్ మొహిద్దీన్, అరసవెల్లి కష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శాంతిశ్రీ మాట్లాడుతూ పీడిత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జరుగుతున్న ఉద్యమాలకు, పోరాటాలకు కవులు, కళాకారులు తమ కలం, గళం ద్వారా అండగా నిలవాలని కోరారు.
మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న రైతు, కార్మిక, ప్రభుత్వరంగ వ్యతిరేక విధానాలు, సామాజిక రుగ్మతలు, అధిక ధరలు, అసమానతలు, కోవిడ్ ప్రభావాలు తదితర సమకాలీన సమస్యలపై కవులు తమ కవితలతో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న కవులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇతర వివరాలకు కె.మోహన్ (9493375447), సత్యాజీ (9490099167), శాంతిశ్రీ (8333818985), సుధాకిరణ్ (9490099225)లను సంప్రదించ వచ్చు.