రాజకీయ విలువలకు ఆయన మారుపేరు

ఎర్రజెండా నీడన తిరుగులేని ప్రజాసేవ
పదవుల్లో వున్నన్నాళ్లూ అభివృద్ధి మంత్రమే
(ఎ.రజాహుస్సేన్)
రాజకీయాల్లో సిన్సియారిటి, అవినీతి రహిత పాలనకు… నిస్వార్థ ప్రజాసేవకు బ్రాండ్ అంబాసిడర్…నిమ్మగడ్డ రామ్మోహన్ రావు. మంగళగిరి పంచాయతీ సమితి ప్రెసిడెంట్ గా ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయ అరంగేట్రం చేశారు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు. ఈయన భూస్వామి కుటుంబం నుంచి వచ్చినా, కామ్రేడ్ గా మారి ప్రజాసేవ చేయడం విశే‌షం. పేరుకే… ఫ్యూడల్. భావజాలంలో మాత్రం కమ్యూనిస్టు. ఎర్ర జెండా నీడన తిరుగులేని ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాను ఏ పదవిలో వున్నా…ఆ పదవికి వన్నె తెచ్చాడు. ఏ ఊరెళ్ళినా ప్రతీ ఒక్కరినీ‌ పేరుపెట్టి పిలిచేటంతగా జనంతో మమేకమయ్యాడు. అవినీతి రహిత రాజకీయాలకు కేరాఫ్ గా, మిస్టర్ క్లీన్ గా పేరు తెచ్చుకున్నాడు.
రామ్మోహన్ రావు సమితి ప్రెసిడెంట్ గా వున్నప్పుడు నేను ఈనాడు దినపత్రిక మంగళగిరి విలేకరిగా పని చేస్తున్నాను. ఆయనతో నాకు సన్నిహిత సంబంధం వుండేది. రాజకీయాల్లో మంచీ, చెడుల గురించి మాట్లాడుకునేవాళ్ళం.. అప్పుడు సమితి కార్యాలయంలో పైరవీలు గానీ, ఆమ్యామ్యాలు గానీ లేవంటే అతిశయోక్తి కాదు.
నేపథ్యం…
నిమ్మగడ్డ రామ్మోహన్ రావు బాల్యమంతా మంగళగిరి లోనే‌ గడిచింది. అయితే కిష్టాయపాలెంలో తాతగారితో అనుబంధం కారణంగా అక్కడ వుండేవారు. పెనుమాక, మంగళగిరి సీకే హైస్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం. విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పీయూసీ లో ఆయన క్లాస్ మేట్. ఇక్కడ ఇంజనీరు సీటు రాకపోతే ఉత్తర భారత దేశంలోని గ్వాలియర్ కు వెళ్ళి ఇంజనీరు విద్యను పూర్తి చేశారు. చదువులో అంత చురుగ్గా…. లేకున్నా, చదివినంత వరకు బుద్ధిగానే చదువుకున్నాడు.

 

Nimmagadd Rammohan Rao
మంగళగిరి కమ్యూనిస్టు నేత నిమ్మగడ్డ రామ్మోహన్ రావు (ఎర్రకండువా)
మార్క్సిజమ్ ఆకర్షణలో
సీకే హైస్కూలులో అప్పటి ఉపాధ్యాయులు శిరందాసు లక్ష్మీనారాయణ మార్క్సిజం గురించి చెప్పిన పాఠం నిమ్మగడ్డ రామ్మోహన్ రావులో బలంగా నాటుకుంది. తాను భూస్వామి అయినా కూడా క్రమంగా కమ్యూనిస్టు వైపునకు ఆకర్షితుడయ్యాడు. ఏఐఎస్ఎఫ్ లో క్రియాశీలకంగా పనిచేశాడు. ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నాక  1964 లో ఆయన వ్యవసాయం చేశాడు. అప్పట్లోనే ట్రాక్టర్ కొని ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం విశేషం.
రాజకీయ కుటుంబం
నిమ్మగడ్డది రాజకీయ కుటుంబం. ఆయన తాతగారు జిల్లా బోర్డు మెంబర్ గా పని చేశారు. అయితే నిమ్మగడ్డ కు మాత్రం రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదు. అయితే డాక్టర్ ఎమ్ ఎస్‌ఎస్ కోటేశ్వరరావు, గోలి గోపాలరావు ప్రభృతు
లతో ఏర్పాటైన గెట్ టు గెదర్ క్లబ్ లో జరిగే చర్చల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చేది. అప్పట్లో మంగళగిరిలో…. వేములపల్లి శ్రీకృష్ణ ఎమ్మెల్యే గా వుండేవారు. మంగళగిరిలో మంచినీటి ఇబ్బందుల్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్ళి, మొత్తం మీద ఆ సమస్య పరిష్కారంలో భాగస్వాములయ్యారు.
మంగళగిరి పంచాయతీ సమితి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రతిపక్షాల‌ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు నిమ్మగడ్డ. ఆ తర్వాత మండల పరిషత్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా తెలుగు దేశం మద్దతుతో పోటీచేసి గెలుపొందారు. ఇదే కాంబినేషన్లో 1994 ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే గా విజయం సాధించారు.
Nimmagadd Rammohan Rao
ఒక సభలో నిమ్మగడ్డ రామ్మోహన్ రావు (ఎడమ)
సమితి ప్రెసిడెంట్ గా వున్న అయిదేళ్లలో 148 పాఠశాల లకు పక్కా భవనాలు నిర్మించారు.(NREP Funds తో) ఈ భవనాల్లో ఎక్కువగా హరిజన వాడల్లోని పాఠశాలలు వుండటం విశేషం. అప్పట్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మెన్ గా వున్న స్వామి నాథన్ ఈ భవనాలను చూసి ముచ్చటపడ్డారు. ఢిల్లీ వెళ్ళి జిల్లా కలెక్టర్ ద్వారా నిమ్మగడ్డ కు ఓ ప్రశంసాపత్రం పంపారు. తాను దేశంలో ఎక్కడా హరిజన వాడల్లోఇన్ని పక్కా భవనాలున్న పాఠశాలలు చూడలేదని…. సమితి అధ్యక్షుడిగా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు పనితీరు భేష్….. అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.!
కాగా అప్పట్లో పాఠశాలల్లో గ్రూపు రాజకీయాలు ఉండేవి. టీచర్లు పాఠశాలలకు వెళ్ళేవారు కాదు. తమకు సమస్యలు వున్నాయని, అవి తీరే వరకు బళ్ళకు వెళ్ళబోమని భీష్మించేవారు. నిమ్మగడ్డ వారందరినీ పిలిచి, మాట్లాడి 3 నెలల్లో సమస్యలన్నీ పరిష్కరించారు. ఆ తర్వాత పంతుళ్ళను పాఠశాలలకు వెళ్ళేలా చర్యలు తీసుకున్నారు. స్వతహాగా క్రీడాభిమాని అయిన నిమ్మగడ్డ మంగళగిరి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డెవలప్ మెంట్ సొసైటీ గౌరవాధ్యక్షుడిగాను సేవలందించారు. మండల పరిషత్ ఆవరణలోని మోతుకూరి మాలకొండయ్య ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించడంలో నిమ్మగడ్డ సహకారం ఎంతో ఉంది.
మండల పరిషత్ అధ్యక్షుడిగా….. గ్రామాల్లో నీటిపారుదల కాల్వల్లో పూడిక తీయించి, రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. వడ్డేశ్వరం వంతెన, కిష్టాయపాలెం… పెనుమాక వంతెనలను నిర్మించారు.
ఎమ్మెల్యేగా గెలిచినా సంతోషం వుండేది కాదట. అసెంబ్లీలో సభ్యుల తీరుకు బాధపడేవారు. ‘ ఎందుకొచ్చాం రా…దేవుడా ’! అని చాలా సార్లు అనిపించిందట.. అయినా.. తన పని తాను చేసుకుంటూ పోయారు. అప్పట్లో……30 లక్షల రూపాయలతో నూతక్కి రోడ్డు వేయించారు. ప్రతీ గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించారు. మొత్తం మీద పదవి ఏదయినా.. తాను చేసిన పనికి పూర్తి సంతృప్తి వుందనే వారు. ఎక్కడా అవినీతి లేకుండా జాగ్రత్త పడేవారు.. మరో విశేషమేమంటే… ఆయన ఏ పదవిలో వున్న కాంట్రాక్టర్లను దగ్గరకు రానిచ్చేవారు కాదు… మెరిట్ ప్రకారమే టెండర్లు ఖరారయ్యేవి. అయితే మంచి పనులు చేస్తుంటే చాలామంది అడ్డుపడే వారట. అయినా తాను నమ్మిన సిద్ధాంతానికే లోబడి పని చేయించే వారు.
ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో ధన, మద్య ప్రవాహం ముందు …. ఓటమిని ఎదుర్కోక తప్పలేదు. కేవలం సీపీఎం అభ్యర్థి గా పోటీచేసి 34 వేల ఓట్లను తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆయనకు అయిన ఖర్చు కేవలం లక్షా 80 వేల రూపాయలు మాత్రమే కావడం విశేషం. కాగా ప్రత్యర్థులు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కాగా ఈ విషయంలో తాను ప్రజల్ని తప్పు పట్టడం లేదని అనేవారు. పేదరికం కారణంగా ప్రజలు డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగడం సహజమే అనేవారు.
షాపింగ్ కాంప్లెక్స్
అప్పట్లోనే సమితి కార్యాలయం ముందు షాపింగ్ కాంప్లెక్స్ ను కట్టించారు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు. అలాగే మంగళగిరి కో ఆపరేటివ్ సొసైటీ స్థలం, భవనాల్ని మార్కెటింగ్ శాఖ ద్వారా కొనిపించి, అక్కడ మార్కెట్ యార్డు ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. అప్పుడు నేను మార్కెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నాను. మా ఇద్దరి మధ్య వున్న పరిచయంతో … ఆయన ప్రతిపాదనను.. అప్పటి మా డైరెక్టర్ డి.సాంబశివరావు ( ఏపీ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు.) గారితో మాట్లాడి, ఒప్పించడంలో నా పాత్ర కూడా వుంది.!!
నిమ్మగడ్డ రామ్మోహన్ రావు స్నేహశీలి. ఎవరెళ్ళినా… కూర్చోబెట్టి మాట్లాడేవారు. ఏం చెప్పినా ఓపికతో వినే వారు… ఇలాంటి ఓ రాజకీయ నాయకుడు మన కాలం లో వున్నందుకు నిజంగా గర్వపడాలి.
*(డిసెంబర్ 12 న కీర్తిశేషులు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా…)
(ఎ.రజాహుస్సేన్, కవి, విమర్శకుడు,రచయిత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *