దేవాలయ నగరంలో మంటగలిసిన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం-టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులను చెదరగొట్టిన పోలీసులు
-సీపీఎం, సీఐటీయూ నాయకుల గృహనిర్బంధం
-14 రోజుల క్రితం ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
(రాఘవ శర్మ)
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నాడే తిరుపతిలో మానవహక్కులు మంటగలిశాయి.
ప్రపంచ మంతా శుక్రవారం మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ , తిరుపతిలో ధర్నా చేస్తున్న టీటీడీ పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు చెదరగొట్టారు.
పద్నాలుగు రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ముందు చేస్తున్న ధర్నా శిబిరాన్ని తొలగించారు.
వీరి ఆందోళనకు మద్దతు తెలిపారనే ముగ్గురు పర్మనెంట్ ఉద్యోగులను అంతకు ముందే సస్పెండ్ చేశారు.
ఈ పారిశుద్ధ్య కార్మికుల ధర్నాకు నాయకత్వం వహిస్తున్న సీపీఎం, సీఐటీయూ నాయకులకు గృహనిర్బంధం విధించారు.
తిరుమలకు ప్రతిరోజూ లక్షమంది భక్తులు వస్తుంటారు.
బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది.
కరోనా వల్ల దర్శనాలను పరిమితం చేయడంతో ఈ సంఖ్య కాస్త తగ్గింది.
ఇంత మంది యాత్రికులు వస్తున్నా, ఎక్కడా పారిశద్ధ్య సమస్య తలెత్త కుండా పారిశుద్ద్య కార్మికులు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు.
టీటీడీ లో దాదాపు మూడున్నర వేల మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.
వీరంతా అయిదారేళ్ళ నుంచి, దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి కూడా పనిచేస్తున్నారు.
టీటీడీ సత్రాలు, కాటేజీలను శుభ్రపరిచి, యాత్రికులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు.
టీటీడీ దృష్టిలో వీరెవరూ తమ ఉద్యోగులు కాదు.
చాలీ చాలని జీతాలతో వేరే కాంట్రాక్టరు ద్వారా టీటీడీలో కాంట్రాక్టు కార్మికులుగా వీరు పనిచేస్తున్నారు.
తాను అధికారంలోకి వస్తే టీటీడీలో కూడా తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
పదిరోజుల ముందు కూడా ముఖ్యమంత్రి వీరిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు.
దీనికి ముందు టీటీడీలో అటవీ కార్మికులు కూడా ఏడాదిగా ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ముఖ్యమంత్రి హామీ మేరకు తమకు కనీస టైం స్కేల్ ఇవ్వాలని పధ్నాలుగు రోజులల క్రితం టీటీడీ పరిపాలనా భవనం ముందు ధర్నా శిబిరాన్ని నెలకొల్పారు..
ఆందోళన చేస్తున్న కార్మికులకు పలువురు పుర ప్రముఖులు, వివిధ సంఘాల వారు మద్దతు తెలిపారు.
అలాగే పలువురు టీటీడీ ఉద్యోగులు కూడా మద్దతు ప్రకటించారు.
అలా మద్దతు ప్రకటించిన నాగార్జున, గుణశేఖర్, జి. వెంకటేష్ అనే ముగ్గురు టీటీడీ శాశ్వత ఉద్యోగులను ఈనెల 1వ తేదీన టీటీడీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.
సస్పెన్షన్ చేయడానికి ముందు వీరికి షోకాజ్ నోటీసులిచ్చి, వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
వారం కాదు గదా, ఒక్క రోజు కూడా వ్యవధి ఇవ్వకుండా, నోటీసు ఇచ్చిన మూడు గంటల కల్లా సస్పెండ్ చేశారు.
ఈ సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ, తమ విధులను బహిష్కరించిన తిరుపతి, తిరుమలలోని పారిశుద్ద్య కార్మికులు ధర్నాను ఉదృతం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఏడాది పైగా జరిగిన రైతుల ఆందోళనను వీరు స్ఫూర్తిగా తీసుకున్నారు.
రాత్రి, పగలు అనకుండా ధర్నా శిబిరంలోనే భజనలు చేస్తూ, పాటలు పాడుతూ కూర్చున్నారు.
ఎండని, వానని, చలిని లెక్క చేయకుండా పద్నాలుగు రోజులుగా ధర్నా కొనసాగించారు.
స్త్రీలు ఒక పక్క, పురుషులు మరొక పక్క కూర్చుని చేస్తున్నధర్నా పురప్రజలను కదిలించింది.
ప్రతి రో జూ వివిధ వృత్తి సంఘాల వారు, వివిధ రాజకీయ పార్టీల వారు వచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు.
జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని కలిసి సమస్యను వివరించారు.
అంతకు ముందు తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకర్ రెడ్డి ని కూడా కలిశారు. ఫలితం లేదు.
శని వారం టీటీడీ బోర్డు సమావేశం జరగనున్నది. ఆ సమావేశానికి ఈ ఆందోళన ఆటంకమనుకున్నారు.
తెల్లారే సరికల్లా సీఐటీయూ నాయకుడు కందారపు మురళిని, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజును గృహనిర్బంధం విధించారు.
దర్నా శిబిరంలో ఉన్న వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు చెదరగొట్టారు.
ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని టీటీడీ అధికారులు పోలీసుల సాయంతో ఇలా నిర్వహించారు!
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)