శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న  పుష్కరిణిలో ఉద‌యం 11.52 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారి  పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన మండపానికి వేంచేపు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె బయల్దేరి ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను  అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు:
    825 గ్రాములు బ‌రువుగ‌ల కెంపులు,పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తిరుప‌తి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. అక్కడి నుండి తీసుకొచ్చిన సారెను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డికి జెఈవో అందించారు.
శోభాయ‌మానంగా స్న‌ప‌న‌ తిరుమంజ‌నం
      వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
కుంకుమ పూవు, యాలకులు, ఆప్రికాట్ గ్రేప్స్, నెమలి ఈకలు, కొబ్బరి ఆకు, రోజా పూలు, తులసి మాలలు, కిరీటాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.
ఆకట్టుకున్న ఫలపుష్ప మండపం:

టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, ద్రాక్ష, పైనాపిల్, రోజా, సంపంగి, కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

       కాగా రాత్రి బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో  ఊరేగించిన అనంతరం శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.
       ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
డిసెంబ‌రు 9న పుష్పయాగం
బ్ర‌హ్మోత్స‌వాల మ‌రుస‌టి రోజైన డిసెంబ‌రు 9వ తేదీ గురువారం సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం జరుగనుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ‌ముఖ మండ‌పంలో స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *