తెలుగు రాజకీయాల్లో చాలా ఎత్తయిన నేత

శారీరకంగా ఆయన ఆరడుగుల ఎత్తు, రాజకీయాల్లో ఆయన ఇంకా ఉన్నతుడు. రోశయ్య రాజకీయ ప్రస్థానంలో ఒడిదుడుకులు పెద్దగా లేకపోవడానికి, అందరికి ఆయన విస్మరించ వీలులేని వ్యక్తి కావడానికి ఇదే కారణం
ఆయన కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు. అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. చిన్ననాటి నుంచే చొరవ చూపడం అలవాటుగా మారిందాయనకు. స్కూల్లో ఎస్పీఎల్ గాను, డిగ్రీలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఆచార్య ఎన్జీ రంగాతో ఏర్పడిన పరిచయం ఆయన్ను రాజకీయంగా ఉన్నత స్థితికి బాటలు వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ముఖ్యమంత్రుల కేబినెట్ లలో మంత్రిగా సేవలందించి ఏకంగా 16 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి తమిళనాడు గవర్నరుగాను ఉన్నత పదవులు అలంకరించి.. ఆ పదవులకే వన్నె తెచ్చారాయన. అంతటి దిగ్గజ రాజకీయవేత్త.. కొణిజేటి రోశయ్య.
కొణిజేటి రోశయ్య స్వగ్రామం గుంటూరు జిల్లా వేమూరు. తల్లిదండ్రులు అద్దెమ్మ, సుబ్బయ్య. తొలి నుంచి వ్యాపారకుటుంబం. 1933 జూలై 4న జన్మించిన రోశయ్య ప్రాథమిక విద్య స్థానికంగాను, ఇంటర్, డిగ్రీ గుంటూరు హిందూ కళాశాలలోనూ అభ్యసించారు. తొలినుంచి చక్కటి చొరవను కనబరిచే రోశయ్య.. ఆచార్య ఎన్జీ రంగాతో ఏర్పడిన పరిచయం దశలవారీగా ఆయన్నో ఉత్తమ రాజకీయవేత్తగా తీర్చిదిద్దింది. ఆచార్య రంగా కావూరు వినయాశ్రమం వీరి గ్రామానికి దగ్గరగా ఉండడంతో ఎక్కువ సార్లు కలుస్తుండేవాళ్లు.
ప్రజాప్రతినిధిగా
1968లో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృషికార్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా రోశయ్య ఎన్నికయ్యారు. అప్పటి శాసనమండలి రద్దయ్యే వరకు సభ్యుడిగా ఉన్నారు. మండలిలో ప్రతిపక్ష నేత రోశయ్య తాకిడిని తట్టుకోలేక నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఏకంగా మండలినే రద్దు చేశారంటారు.
1989, 2004 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యలో 1998లో నరసరావుపేట ఎంపీగా గెలుపొందారు. 2009 నుంచి 2011 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ముఖ్యమంత్రులుగా డాక్టర్ చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురమల్లి జనార్ధనరెడ్డి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిల హయాంలో రోశయ్య కేబినెట్ మంత్రిగా విశేష సేవలందించారు. మంత్రిగా హోం, ఆర్థిక, ఆర్ అండ్ బీ, రవాణా, హౌసింగ్, ఉన్నత విద్య, చేనేత, జౌళి, విద్యుత్, ఆరోగ్య శాఖలతోపాటు శాసనసభా వ్యవహారాలు చూశారాయన. కాంగ్రెస్ పార్టీ పరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గాను, పీసీసీ అధికార ప్రతినిధిగా, ఏఐసీసీ సభ్యుడిగా, పీసీసీలో అనేక పదవులు నిర్వర్తించారాయన.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2009 సెప్టెంబరు 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య సేవలందించారు. తదుపరి 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నరుగా కొనసాగారు. ఈ మధ్యలో రెండు నెలలు కర్నాటక ఇన్చార్జి గవర్నర్ గాను పనిచేశారు.
రాష్ట్ర విభజనపై చిదంబరం 2009 డిసెంబరు 9న చేసిన ప్రకటన అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రమేయం లేకుండా రావడం గమనార్హం. ఆ తర్వాత ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమ స్వరూపం మారిపోయింది. ఈ దశలో రోశయ్య ఇబ్బంది పడాల్సివచ్చింది. చట్టసభల్లో కొనసాగిన మూడు దశాబ్దాల్లో ఆయన్ను చిదంబరం ప్రకటన తర్వాత జరిగిన పరిణామాలు ఇబ్బంది పెట్టాయి.
రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా.. గాడ్ ఫాదర్లు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని సగర్వంగా చెప్పే రోశయ్య… అంది వచ్చిన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుని తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
కుటుంబ నేపథ్యం
కొణిజేటి రోశయ్య ఇంటర్ పూర్తికాగానే తెనాలికి చెందిన దూరపు బంధువు శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె రమాదేవి. కుమారులు శివసుబ్బారావు, త్రివిక్రమ్ రావు, శ్రీమన్నారాయణమూర్తి ఉన్నారు. ఇద్దరు కుమారులు హైదరాబాద్ లో, ఒక కుమారుడు తెనాలిలో వ్యాపారరంగంలో ఉన్నారు. కుమార్తె, అల్లుడు విశాఖపట్నంలో ఉంటారు.
రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా స్వయంశక్తితో ఎదిగిన రోశయ్య తెలుగురాష్ట్రాల్లో ఉత్తమ రాజకీయ వేత్తగా, ప్రజాసేవకుడిగా పేరొందారు. వారసత్వ రాజకీయాలు నడపకుండా కొణిజేటి కుటుంబంలో రోశయ్య దిగ్గజ రాజకీయవేత్తగా చిరస్థాయిలో నిలిచిపోతారు.
– అవ్వారు శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *