(సలీమ్ బాషా)
“నాజీ”ల కన్నా ప్రమాదకరమైన మనుషులు
ఒకప్పుడు హిట్లర్ నేతృత్వంలోని నాజీలు అంటే. ప్రజలు వణికిపోయారు. నియంతృత్వ పాలనకు పరాకాష్ట నాజీలు(Nazis). ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ తో వాళ్లు ఉండేవారు. వారి దురాగతాలు అన్నీ ఇన్ని కావు. మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు నాజీలు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో మామూలు మనుషుల్లాగే ఉన్నప్పటికీ ఒక మానసిక రుగ్మతతో బాధపడుతూ మన మధ్యనే తిరిగే మనుషులు నాజీల కన్నా ప్రమాదకరమైన వాళ్ళు! వాళ్ళనే నార్సిసిస్ట్ (narcissists) లు అంటారు. నార్సిసిజం (Narcissism) అనే ఒక మెంటల్ డిజార్డర్ (మానసిక రుగ్మత)వారికి ఉంటుంది. హిట్లర్ నాజీ లను సులభంగా గుర్తుపట్టవచ్చు, జాగ్రత్తగా ఉండవచ్చు. కానీ నార్సిసిస్ట్ (narcissists) ల ను చూస్తేనే అంత సులభంగా గుర్తుపట్టలేము. దానికి కొంత సమయం పడుతుంది.
“ఈ ప్రపంచానికి జరిగిన హాని లో సగం, తామే ముఖ్యమని భావిస్తు, ఇతరులు కూడా అలాగే భావించాలి అనుకునే వ్యక్తులతోనే జరిగింది. అటువంటి వ్యక్తులు నిరంతరం తమ గురించి ఆలోచించడం లో మునిగిపో పోవటం వల్ల, అది సమంజసమే అని కూడా భావిస్తారు” అన్నాడు ప్రముఖ రచయిత T.S. Eliot
(”Half the harm that is done in this world is due to people who want to feel important … They justify it because they are absorbed in the endless struggle to think well of themselves.” — T.S. Eliot.)
ప్రపంచ ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయం ప్రకారం:
” తనని తాను ముఖ్యమైన వ్యక్తిని అని ఎవరైనా భావించడానికి (Narcissist గా మారడానికి) కారణం చిన్నప్పుడు తాను ముఖ్యమైన వాడిని అని భావించినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం . అంటే ఒక పిల్లవాడు చిన్నప్పుడు కోల్పోయిన దాన్ని పెద్దయ్యాక పొందడం కోసం చేసే ప్రయత్నమే నార్సిసిజం (Narcissism)”
Narcissist అన్న పదం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ఇది గ్రీకు పురాణాల నుంచి ఆవిర్భవించింది. దీని వెనుక అనేక కథనాలు ఉన్నప్పటికీ ఓవిడ్ అనే గ్రీకు కవి రాసిన Metamorphoses అనే పుస్తకం నుంచి తీసుకున్న కథ ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. అందులో Narcissus అనే అందమైన యువకుడు ఎంతోమంది ప్రేమను నిరాకరించి తనను తాను ప్రేమించుకున్నాడన్నది కథ. అతన్ని ఎకో అనే ఒక అప్సరస ప్రేమిస్తుంది. అయితే అతను ఆమె ప్రేమను కూడా నిరాకరిస్తాడు. అది తెలిసిన Nemesis అని దేవత అతన్ని ఒక చిన్న మడుగు దగ్గరికి తీసుకెళ్ళి అందులో అతని ప్రతిబింబాన్ని చూసుకునేలా చేస్తుంది. అప్పుడు తన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూసిన Narcissus అది తనే అని తెలుసుకోలేక ఆ ప్రతిబింబం తో ప్రేమలో పడిపోతాడు. అయితే ఆ ప్రతిబింబం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అలాగే కరిగిపోయి ఒక తెలుపు బంగారు రంగు కలగలిసిన పువ్వు గా మారిపోతాడు. అలా అతని పేరు మీద Narcissist అనే పదం వచ్చేసింది.
సింపుల్ గా నార్సిసిస్ట్ లు అంటే “స్వయంమోహితులు”. దాని అర్థం తమని తాము విపరీతంగా ప్రేమించుకునే వారు లేదా తమని తప్ప వేరే వాళ్ళని అస్సలు ప్రేమించే లేని వాళ్ళు. స్వయంమోహితులను కొంతకాలం తర్వాత గుర్తుపట్టవచ్చు.
మానసిక శాస్త్ర పరిభాషలో దీన్ని ” Narcissistic personality disorder (NPD)” అంటారు. తెలుగులో అనువదిస్తే ” స్వయం మోహిత వ్యక్తిత్వ రుగ్మత” అని అనుకోవచ్చు. ఈ రుగ్మత ఉన్న వారిలో ఉండే కొన్ని లక్షణాలు వీరికే ప్రత్యేకం. అలాంటి లక్షణాలలో ఎక్కువ భాగం లక్షణాలు ఎవరిలోనైనా కనబడితే వాళ్లను నార్సిసిస్ట్ లు అనొచ్చు. సాధారణంగా వీరితో ఎటువంటి ప్రమాదం లేకపోయినా వీరితో సంబంధ బాంధవ్యాలు సవ్యంగా నడపడం మామూలు మనుషులకు సాధ్యం కాదు.
స్వయం మోహిత వ్యక్తులలో ఉండే ముఖ్యమైన లక్షణాలు చూద్దాం….
* తమను తాము గొప్పవారు గా భావించుకోవడం. ఇలా అనుకోవడం వల్ల త మకు ప్రత్యేకతను ఆపాదించుకుని, ఎక్కువ గౌరవాన్ని కోరుకోవడం
* ఎక్కువభాగం కల్పనలో జీవించడం. గొప్ప విజయాలు సాధించినట్లు కలలు కనడం
* అందరి దృష్టి తమవైపే ఉండాలని అనుకోవడం. అందరూ తమను ప్రశంసించాలి అనుకోవడం
* నలుగురిలో ఉన్నప్పుడు ఎక్కువ భాగం వాళ్లే మాట్లాడడం
* తమని పట్టించుకోకపోతే అవమానంగా భావించడం, కోపం తెచ్చుకోవడం
* అవసరాన్నిబట్టి స్నేహాలు, బంధాలు నెరపడం. ఇతరులను బాగా వాడుకోవడం.
సంబంధాలలో నటన ఎక్కువగా ఉండడం
* ఇతరుల ఉద్వేగాలను, ఫీలింగ్స్ ను అసలు పట్టించుకోకపోవడం
* గుర్తింపు కోసం ఆరాటం (Identity crisis) ఉండటం
* ఎవరితో కూడా సన్నిహితంగా ఉండకపోవడం.
* తాము అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే తొందరగా నిరాశ పడడం,
చికాకుగా ఉండడం.
* * చిన్న విమర్శను కూడా తట్టుకోలేకపోవడం
* వాస్తవికతకు చాలా దూరంగా ఉండటం.
* ప్రతిదాన్ని తమ హక్కుగా భావించడం
* అణువణువునా అహంకారం, గర్వం తొణికిసలాడే ప్రవర్తన.
* సులభంగా ఎదుటివారిని కించపరచడం
* ఇతరుల పట్ల అసూయ ఉండడం, ఇతరులు తమను చూసి అసూయ పడుతున్నారు అనుకోవడం
ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. పైన చెప్పిన ఈ లక్షణాలలో ఒకట్రెండు, లేదా కొన్ని మాత్రమే ఉంటే ఉంటే పర్వాలేదు. కానీ 75% పైన ఉన్న వ్యక్తులు NPD తో బాధపడుతున్నట్లు భావించవచ్చు.
ఇంకో విషయం ఏంటంటే పైన చెప్పిన లక్షణాలు ప్రతి ఒక్కటి ఏదో ఒక సందర్భంలో ఎవరైనా ప్రదర్శిస్తే పర్వాలేదు. ఎక్కువ భాగం లక్షణాలు ఎక్కువ కాలం ఎవరైనా ప్రదర్శిస్తూ ఉంటే వారు NPD తో బాధపడుతున్నట్లు భావించాల్సి వస్తుంది అని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం.
NPD తో బాధపడే వాళ్లలో మితవాదులు(Mild),అతివాదులు(Moderate), తీవ్రవాదులు (Severe) ఉంటారు. వీళ్లలో తీవ్రవాదులతో సమస్య. దాదాపు వారిని భరించలేని పరిస్థితి ఉంటుంది. మొదటి రెండు కేటగిరీ వాళ్ల తో పెద్దగా ఇబ్బంది ఉండదు.
మన బంధువుల్లో, స్నేహితుల్లోnarcissists ఎవరైనా ఉంటే, వారిని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో ఎలా వ్యవహరించాలి, వారి అంతర్గత స్థితి ఎలా ఉంటుంది అన్నది మరో సారి చూద్దాం.
(సలీమ్ బాషా, పర్సనాలిటీ డెవెలప్ మెంట్ నిపుణుడు, ఫోన్ 93937 37937)