తిరుపతి, 2021 నవంబరు 30: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉదయం 9.45 నుండి 10 గంటల మధ్య ధనుర్లగ్నంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ సలహాదారు మరియుకంకణభట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
గజపట ప్రతిష్ఠ :
ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు. ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు.
సకలదేవతలకు ఆహ్వానం :
ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు. ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు సకలదేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహించినట్టు తెలిపారు. ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇందులో భాగంగా డిసెంబరు 4న రాత్రి గజవాహనం, డిసెంబరు 5న రాత్రి గరుడవాహనం, డిసెంబరు 8న పంచమితీర్థం, డిసెంబరు 9న పుష్పయాగం నిర్వహించనున్నట్లు చెప్పారు.అమ్మవారి కరుణతో ప్రపంచ మానవాళి సుభిక్షంగా ఉండాలని, బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని సంకల్పం చేసినట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.