(రాఘవ శర్మ)
శ్రీశ్రీ మహాప్రస్థానం గీతాలు నినాదాలయ్యాయి. ఆ గీతాలు తిరుపతి వీధులలో ప్రతిధ్వనించాయి.
మావో రెడ్ బుక్ లాగా ముద్రించి ముస్తాబైన మహాప్రస్థానం మంగళవారం ఆవిష్కరణ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కవులు, రచయితలు, సాహితీవేత్తలతో తిరుపతిలో సోమవారం సాయంత్రం ఒక మహాప్రదర్శన జరిగింది. అందరి చేతుల్లో శ్రీశ్రీ చిత్రపటం, మహాప్రస్థానం గీతాలు రాసిన ఉన్న ప్లకార్డులు ఉన్నాయి.
ఏ పుస్తకానికి కూడా ఇంత గౌరవం లభించి ఉండకపోవచ్చు. ఏ రచయితకూ, కవికి గాని ఎప్పుడూ ఇంత గౌరవం జరిగి ఉండకపోవచ్చు. శ్రీశ్రీ కి జయజయధ్వానాలు పలుకుతూ ప్రదర్శన సాగింది.
కృష్ణాపురం ఠాణా నుంచి, గాంధీ రోడ్డు మీదుగా, బండ్ల వీధి నుంచి గ్రూప్ థియేటర్ల ముందు నుంచి, ఆర్టీసీ బస్టాండు ముందున్న అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన సాగింది.
శైలకుమార్ ఇచ్చిన మహప్రస్థానం నినాదాలను అంతా అందుకున్నారు. మానవ వికాస వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో వేదిక అధ్యక్షులు , తిరుపతి ఎమ్మెల్లే భూమన కరుణాకర రెడ్డి, రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, వేదిక కన్వీనర్ సాకం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సాయంత్రం 4 గంటలకు మొదలైన ఈ ప్రదర్శన అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసే సరికి 5 గంటలైంది. గంటపాటు జరిగిన ఈ ప్రదర్శన పుర ప్రజలను విశేషంగా ఆకర్షించింది.
మహాప్రస్థానం తొలిసారిగా 1950లో అచ్చయి, ఆ గీతాలు తెలుగు వారిని ఊగించి శాసించి, నడిపించాయి. మహాప్రస్థానం అనేక సార్లు పునర్ముద్రణ జరిగింది. డెబ్బై ఏళ్ళ తరువాత మళ్ళీ ఇలా చిన్న సైజులో రావడం విశేషమే.
ఈ మధ్యనే శ్రీశ్రీ విశ్వేశ్వరరావు కాఫీటేబుల్ బుక్ అనబడే చేటంతసైజులో మహాప్రస్థానాన్ని అచ్చేశారు. ప్రముఖ సాహితీ దిగ్గజం వేల్చేరు నారాయణ రావు ఈ మహాప్రస్థానాన్ని మంగళవారం ఉదయం ఉదయూ ఇంర్నేషనల్‌లో ఆవిష్కరించనున్నారు. ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. శివారెడ్డి ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
వేల్చేరు, శివారెడ్డితో పిచ్చాపాటి
ప్రదర్శన ముగిసిన అంబేద్కర్ విగ్రహం సమీపంలోనే వేల్చేరు నారాయణ రావు, కె. శివారెడ్డి బసచేశారు. నేను, భూమన్, శైలకుమార్, సాకం నాగరాజు, పల్లిపట్టు నాగరాజు వారితో కాసేపు పిచ్చాపాటిగా మాట్లడాం.
అమెరికాలోని విస్కాన్‌సిన్ యూనివర్సిటీలో తెలుగు ఆచార్యులుగా పనిచేసిన వేల్చేరు నారాయణ రావు తెలుగు సాహితీ లోకానికి సుపరిచితులు. వారు రాసిన ‘ తెలుగులో కవితా విప్లవాల స్వరూపం ‘ ప్రసిద్ధ గ్రంథం ఇటీవల పునర్ముద్రణ జరిగింది. వేల్చేరు నారాయణ రావుకు తొంభై ఏళ్ళు.అయినా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్టొనడానికి తిరుపతి వచ్చారు.
‘ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?’ అని అడిగితే ఏలూరు సమీపంలో ఉన్న కొప్పాకలో అని చెప్పారు. ‘కొంత కాలం నూజివీడు రోడ్డులో కూడా ఉంటాం’ అని చెప్పారు. అమెరికా నుంచి తిరిగి వచ్చేశారా? అని అడిగితే అప్పుడప్పుడూ వెళ్ళి వస్తుంటా అని తెలిపారు. విస్కాన్‌సిన్ తరువాత అమెరికాలో వేరే విశ్వవిద్యాలయాలకు కూడా వెళ్ళానని వివరించారు.
‘అక్కడ బాగా డబ్బున్న తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాలుగు రోజులు సాహిత్య సభలు పెడతారు. అక్కడితో అయిపోతుంది. తెలుగు భాషకు ఏదీ శాశ్వతంగా చేయరు. అక్కడి విశ్వవిద్యాలయాలలో తెలుగు విభాగం ఉన్నా, తెలుగు ఉన్నట్టు కాదు. అక్కడ ఉన్న ఒక తెలుగు వ్యక్తి ఒకరు బాగా సంపాదించారు. తెలుగు భాషంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఆయన పోయారు. తన తదనంతరం తెలుగు భాషకు ఏదైనా చేయమని కొడుకులకు చెప్పారు. ఆ పిల్లలకు తెలుగు రాదు. అక్కడి విశ్వవిద్యాలయానికి డబ్బులిచ్చి ఊరుకున్నారు.’ అక్కడి తెలుగు పరిస్థితిని వివరిస్తూ వేల్చేరు నారాయణ రావు తెలిపారు.
‘పుస్తకాలు కొనుక్కోవాలి. ఉచితంగా తీసుకోకూడదు. ఉచితంగా ఇవ్వకూడదు కూడా. పుస్తకాలు బజారులో అమ్మాలి. మీరు కూడా ఉచితంగా ఇస్తారా?’ అని వేల్చేరు శివారెడ్డిని అడిగారు.
‘కనపడ్డ వారికల్లా పంచం కదా! కవి కనిపిస్తే ఇస్తా. మీ పుస్తకం రెండు కాపీలు నాదగ్గర ఉన్నాయి. బాగా చదివే వారికి ఒక కాపీ ఇచ్చాను. చదివాక ఇమ్మన్నా. అతను చదివాక ఇవ్వలేదనుకోండి, అతనికి పుస్తకం పైన ప్రేమ ఉన్నట్టు లెక్క.’ అన్నారు శివా రెడ్డి.
‘స్థానిక చరిత్ర పైన పేటశ్రీ బాగా రాస్తున్నారు’ అన్నారు వేల్చేరు. ‘గంగ జాతర చాలా మంచి జాతర. మొగ వాళ్ళు ఆడ వేషం వేసే వారు.
ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు. కాస్త అల్లరి కూడా ఉంది’ అని వేల్చేరు అంటుం డ గా భూమన కరుణాకరరెడ్డి వచ్చి చేరారు.
వేల్చేరు తన భార్య మొక్కపాటి లలితను పరిచయం చేస్తూ, ‘ఆవిడ చూడకపోతే నేను ఇంతకాలం బతికే వాణ్ణి కాను . నాకు ఎప్పుడు ఏం కావాలో మందుల దగ్గర నుంచి ఆమే ఇస్తుంది. ఆమె పీహెచ్‌డీ చేశారు. కర్ణాటక సంగీతం బాగా పాడతారు. కచ్చేరీలు కూడా చేసేవారు అంటూ చెప్పుకొచ్చారు.
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్టు తిరుపతి)