“3 రాజధానుల చట్టం ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నా అమరావతి వివాదం సమసిపోలేదు. అందువల్ల అమరావతి సమస్య తెగే దాకా హైకోర్టు విచారణ కొనసాగించాలి.”
(టి.లక్ష్మీనారాయణ)
అమరావతి రాజధాని పరిరక్షణకు ఉపకరించే శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తాను తెరలేపిన రాజధాని వివాదానికి ముగింపు పలకలేదు. శాసనసభలో ఆయన చేసిన ప్రసంగం ద్వారా వివాదాన్ని కొనసాగించబోతున్నట్లు స్పష్టం చేశారు.
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించు కొన్నప్పటికీ మరొక పదునైన బిల్లును శాసనసభలో ప్రవేశపెడతామని విస్పష్టంగా ప్రకటించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో గౌరవ హైకోర్టు విచారణను కొనసాగించి, రాజధాని అంశంపై శాశ్వత పరిష్కారానికి దోహదపడే రీతిలో చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వాల్సిన ఆవశ్యకత నేడు మరింత పెరిగింది.
మూడు రాజధానుల చట్టం మరియు సీఆర్డీఏ చట్టం రద్దు చట్టం చెల్లుబాటుపై న్యాయసమీక్ష సందర్భంగా పలు అంశాలు తెరపైకి వచ్చాయి. అవి నేడు, రేపు కూడా చర్చనీయాంశాలుగా ఉంటాయి. వాటికి న్యాయస్థానం మాత్రమే ముగింపు పలకగలదు.
రాజధానికి సంబంధించి రాజ్యాంగంలో, పార్లమెంటు చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో స్పష్టత కొరవడిందని, వక్రీకరించే ప్రయత్నాలు జరిగాయి. ఉల్లంఘనలకు పాల్పడ్డారు. వాటికి హైకోర్టు తీర్పు ద్వారా మాత్రమే సమాధానం లభించాలి. తద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో రాష్ట్ర రాజధాని, హైకోర్టుకు సంబంధించి ఏమున్నదో స్పష్టం చేయాలి. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక పూర్వరంగంలో, 2014లో అమరావతిని రాజధానిగా శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవ తీర్మానాలతో చేసిన నిర్ణయానికి చట్టబద్దత ఉన్నదా? లేదా? ఒకసారి నిర్ణయించబడి, నిర్మాణానికి ఇప్పటికే దాదాపు రూ.10,000 కోట్లు ప్రజాధనాన్ని వ్యయం చేసి, అమరావతి నుండే పాలన సాగుతున్న నేపథ్యంలో పరిపాలనా వికేంద్రీకరణ ముసుగులో రాజధానిని విచ్చిన్నం చేసే విధానాన్ని రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అనుమతిస్తుందో! లేదో! తేల్చాలి.
హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో “ఏ” అంటే ఏకవచనమే కాదు, బహువచనంగా కూడా భావించవచ్చు! అన్న వ్యాఖ్యపైన, రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదన్న వాదన రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో! లేదో! హైకోర్టు న్యాయ సమీక్ష చేసి, తీర్పు చెప్పడం ద్వారా దేశ ప్రజలకు స్పష్టత కల్పించాలి.
6. సీఆర్డీఏ చట్టం మేరకు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలు, ఉల్లంఘనలపైన తీర్పు చెప్పాల్సి ఉంది.
అమరావతి రాజధాని పరిధిలో పెట్టుబడులు పెట్టిన ప్రయివేటు సంస్థలు – వ్యక్తుల హక్కులకు సంబంధించిన అంశాలు, దుష్పరిణామాలపై కూడా హైకోర్టు ధర్మాసనం విచారణను కొనసాగించి, తీర్పు చెప్పడం ద్వారా పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులకు విశ్వాసం కల్పించాలి.
ఈ తరహా వివాదాలు భవిష్యత్తులో తలెత్తకుండా ఒక చారిత్రాత్మక తీర్పును హైకోర్టు ఇవ్వడం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం కొలిక్కివస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి విఛ్చిన్నకర విధానానికి “పుల్ స్టాప్” పడుతుంది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు అమరావతి రాజధాని భవిష్యత్తును నిర్ధేశిస్తుంది.