ఆ అమ్మాయి చేతిలో ఉన్నది నిజంగా పామే…

ఆ మధ్య ఈ అమ్మాయి కృష్ణా కరకట్ట మీద వెళుతూ ఉంది. అక్కడొకచోట  తాబేళ్లను విక్రయిస్తుండటం చూసింది. ఆ ఆమ్మాయి మనసుగాయపడింది. ఆలస్యం చేస్తే అవి చచ్చిపోయే ప్రమాదం ఉంది.లేదా ఎవరైన కొనుక్కుపోయి చంపే ప్రమాదం ఉంది. ఎవరో కొనుక్కోవడం ఎందుకు?తానే అక్కడి రెండు తాబేళ్లను రూ.600కు కొనుగోలు చేసి ఆ రెండింటిని కృష్ణానదిలో వదిలిపెట్టి వాటిని కాపాడింది.

అలాగే ఇంటి వద్ద ఏవైనా పక్షులు జంతువులు  గాయపడితే ఆమె మనస్సు చివుక్కుమంటుంది. వెంటనే వాటిని చేరదీసి వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుంది. ఇలా ఈ అమ్మాయికి ఉన్న భూత దయ అంతేలేదు.  విషసర్పాలన్నా భయంలేదు. పాములను కూడా అలాపట్టుకుని ముద్దాడుతుంది.  ఆడిస్తుంది ఈ ఫోటో చూస్తే తెలియడం లేదూ.
అంతేకాదు,  అమ్మాయి  గురించి తెలుసుకోవలిసి ఉంది చాలా ఉంది.


ఈ మధ్య విజయవాడ కేబీఎన్ కళాశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఇటీవల నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కళాశాల విద్యార్థినులకు సంప్రదాయ వస్త్రధారణ పోటీలు పెట్టగా.. వివిధ కళాశాలల నుంచి సుమారు 70 మంది పాల్గొన్నారు. వీరిలో తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్, పంజాబ్, కాశ్మీర్ తదితర ప్రాంతాలకు సంబంధించి యువతుల సంప్రదాయ వస్త్రధారణలకు దీటుగా పోటీల్లో పాల్గొన్న తెలుగమ్మాయి ఫస్టొచ్చింది. ఇంతకీ ఆ బాపుగారి బొమ్మే పై ఫోటోలు పాముతో ముచ్చటిస్తున్న సాయిపద్మ.
అందమైన రూపానికి తోడు మంగళగిరి చేనేత పట్టు చీర సోయగాలు జతకలవగా.. దానికితోడు ఏ మాత్రం తొణకని మనోధైర్యం ఆ యువతికి పెట్టని ఆభరణాలయ్యాయి. ఇంకేముంది పోటీదారుల్లో పైచేయిగా నిలిచింది. అందరి హృదయాలను కట్టిపడేసి ప్రథమస్థానంలో నిలిచిన సాయి పద్మ విజయవాడ లయోల కళాశాలలో బీఎస్సీ (బయోటెక్నాలజీ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సాయిపద్మ ప్రస్థానం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఆ యువతి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మంగళగిరికి చెందిన సాయిపద్మ తాతయ్య జొన్నాదుల పెద్దపుల్లయ్య, నాయనమ్మ అనసూయ. వీరి కుటుంబం తొలినాళ్లలో చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు. తదనంతర కాలంలో గోల్డ్ రంగంలోకి అడుగు పెట్టి రాణించడమేకాకుండా ఈ ప్రాంత చేనేత సంఘీయులు ఈ వృత్తిలోకి మళ్లేలా ఎందర్నో ప్రోత్సహించారాయన. స్వతహాగా మంగళగిరి అంటేనే మనషుల్లో అంతర్లీనంగా ప్రశ్నించేతత్వం ఉంటుంది. అయితే వీరి కుటుంబం వామపక్ష నేపథ్యంతో ముడిపడివుంది. వీరి కుమారుడు వెంకటరత్నం, రాజేశ్వరి దంపతులకు కుమార్తె సాయిపద్మ, కుమారుడు మోహనసాయి ఉన్నారు. వామపక్ష భావజాలం నరనరాన జీర్ణించుకుపోవడంతో వీరి పిల్లలిద్దరూ చిన్ననాటి నుంచి చురుకుగా వ్యవహరించేవారు.
సాయిపద్మ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ మీడియట్ వరకు స్థానికంగా చైతన్య కళాశాలలో చదివి ప్రస్తుతం విజయవాడ లయోల కళాశాలలో బీఎస్సీ (బయోటెక్నాలజీ) చదువుతోంది. తాను ప్రభుత్వ ఉన్నతోద్యోగి కావాలనే లక్ష్యంగా పెట్టుకున్న సాయిపద్మ చదువులో తొలినుంచి డిస్టింక్షన్ సాధిస్తోంది. చదువుతోపాటు వివిధ అంశాల్లోనూ ప్రావీణ్యం సంపాదించింది. ఆమెకు కరాటేలోనూ ప్రవేశం ఉంది. డ్రాయింగ్ లో తిరుగులేని చేయి అమెది. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లోనూ ముందేవుంటుంది. అన్నింటికి మించి సాయిపద్మ జంతుప్రేమికురాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *