ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన వికేంద్రీకరణకు చేపట్టిన చట్టాన్ని రద్దు చేయడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లో బిల్లును ప్రవేశ పెట్టి సభలో ఆమోదం సంపాదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ “శ్రీబాగ్ ఒడంబడిక” ను పేర్కొంటూ పాలన వికేంద్రీకరణ ద్వారా రాయలసీమకు, అదే విధంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు, మిగిలిన ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు సమన్యాయం జరిగేలాగా న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా నూతన పాలన వికేంద్రీకరణ చట్టం తీసుకొనివస్తామని ప్రకటించారు.
CRDA చట్టానికి హైకోర్టు ఏర్పాటు కు సంబంధం లేదు. గత ప్రభుత్వం రాజధానికి సంబంధించిన CRDA చట్టాన్ని 4.7.2016 న శాసనసభలో చేసింది. హైకోర్టు అమరావతిలో ఏర్పాటుకై నోటిఫికేషన్ ను గౌరవ భారత రాష్ట్రపతి జనవరి 1, 2019 చేపట్టారు. హైకోర్టు ప్రధాన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ విషయాన్ని మూడు రాజధానులపై హైకోర్టులో వాదనల సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టడం అత్యంత అవసరం అంటున్న ప్రభుత్వ వాదనతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాము. ఈ నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ చట్టంతో సంబంధం లేకుండా “హైకోర్టు ప్రధాన కేంద్రంను కర్నూలు” లో ఏర్పాటుకు గౌరవ రాష్ట్రపతి నుండి నోటిఫికేషన్ తీసుకొని రావడానికి వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం కార్యాచరణ తక్షణమే చేపట్టాలి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కర్నూలు డిక్లరేషన్ ను చేసిన బిజెపి, ఆ దిశగా క్రియాశీలకంగా అడుగులు వెయ్యాలి.
పాలన వికేంద్రీకరణను గౌరవించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తాము అంటున్న ముఖ్యమంత్రి గారు కృష్ణా నది పరివాహక ప్రాంతం మరియు కృష్ణా నది జలాల పంపిణీకీ కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలులో “కృష్ణా నది యాజమాన్య బోర్డు” ఏర్పాటుకు ప్రతిపాదనలను కేంద్రానికి తక్షణమే పంపాలి.
రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన “తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ, ముచ్చుమర్రి, సిద్దాపురం, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాలకు” అనుమతించింది. కాని కృష్ణా నది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో ఈ ప్రాజెక్టులను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొన్నది. ఈ ప్రాజెక్టులు 6 నెలల కాలంలో అనుమతులు పొందక పోతే, ఈ ప్రాజెక్టులు నిర్వహణలో ఉన్న వీటికి నీటిని విడుదల చేయమని నోటిఫికేషన్లో పేర్కొనడమైనది. ఈ నోటిఫికేషన్లో సవరణలు చేపట్టకపోతే రాయలసీమకు కీలకమైన ఈ ప్రాజెక్టుల నుండి సాగునీటిని పొందడంలో చాలా న్యాయపరమైన ఇబ్బందులు సమీప భవీష్యత్తులో వస్తాయి. అభివృద్ధి వికేంద్రీకరణను కాంక్షించే పాలకులు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం “KRMB నోటిఫికేషన్లో పై ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా సవరణలు” చేయడానికి తక్షణమే ప్రత్యేక దృష్టి తో కార్యాచరణ చేపట్టాలి.
పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధికి ముందడుగు వేస్తున్న ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేని పై విధాన పరమైన నిర్ణయాలలో క్రియాశీలక కార్యాచరణ చేపట్టాలి. కర్నూలు లో హైకోర్టు, రాయలసీమ ప్రాజెక్టుల సంరక్షణకు కర్నూలు డిక్లరేషన్ చేసిన బిజెపి, డిక్లరేషన్ అమలుకు చిత్తశుద్దితో కృషి చేయాలి. న్యాయమైన రాయలసీమ డిమాండ్లకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి.
(బొజ్జా దశరథ రామి రెడ్డి, అధ్యక్షులు,రాయలసీమ సాగునీటి సాధన సమితి)