రాయలసీమకు 93 వసంతాలు, ఎలాగంటే..

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
రాయలసీమ ప్రాంతం ఆదినుంచి అనాథకాదు. 1800 సంవత్సరం ముందు, తర్వాత నైజాం ఆదీనంలోకి వెల్లిన తర్వాతనే నాటి నిజాం,ఆంగ్లేయుల పాలన, పాలేగాళ్ల వ్యవస్ద తోనే రాయలసీమ కరువు సీమగా మారింది. అంతకు ముందు విజయనగర రాజుల కాలంలో రతనాలసీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా, దత్తమండలాలుగా పిలవబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబర్ 18. అలా సీమ రాయలసీమగా ఆత్మగౌరవంతో నిలబడింది.
చరిత్రలోకి వెలితే……..
1800 కి పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాలసీమ. రాక్షసి తంగడి యుద్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం కావడం వరుస దాడులు కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠ వారితో యుద్ద బయంతో ఉన్న నిజాము ఆంగ్లేయులతో సైనిక సహరం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహరం ఇవ్వలేని నిజాము సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలివేసినారు. ఆ మొత్తం వ్యవహరంలో సీమ ప్రజల మనోబావాలను లెక్కలోకి తీసుకోలేదు. ఫలితంగా పాలేగాళ్లు ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతంలో ప్రారంబంలో ఆంగ్లేయులకు పాలేగాళ్ల నుంచి ప్రతిఘటన వచ్చింది. బలమైన సైనిక సామర్ద్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమపాలేగాళ్లు నిలువలేకపోయినారు. అలా ఆంగ్లేయుల ఆదిపత్యాన్ని వ్యతిరేకించిన సీమ పాలేగాళ్లు తొలి స్వతంత్యోద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచినారు. కాని ఈ నాటికి చరిత్రలో ఆ స్దానం మనకు లభించలేదు. ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీ డె డ్ జిల్లాలుగా పివబడింది. దీన్నే తెలుగు అర్దంలో దత్తమండలం అని పిలిచినా నిజానికి సీ డె డ్ అన్న పదానికి దత్త మండలం అన్న అర్దం సరికాదు. వదిలి వేయించుకున్న ప్రాంతం అన్న దానికన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్దే సీమ ప్రజల మన్నలనను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు. అలా సీమ ప్రాంతం దత్తమండలాలుగా, సీ డె డ్ ప్రాంతంగా పిలవబడింది.
నంద్యాల సభలో కీలక నిర్ణయం…….
1913 లో ప్రారంబమైన ఆంధ్ర మహా సభలు 1928న 17,18 తేదీలలో నంద్యాలలో జరిగాయి. రెండు రోజుల సభలలో ఒక రోజు కచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశానికి అవకాశం ఇస్దేనే తాము సహకరిస్దామన్న ఈ ప్రాంతనేతల వత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రథమ దత్తమండలం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు ( అనంతపురం కాలేజి అధ్యాపకుడు, శ్రీకాకులం వాసి) గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదని రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందని ప్రతిపాదించినారు. ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా రాయలసీమ అన్న ప్రతిపాదనను ఆమోదించడంతో నాటి నుంచి రాయలసీమగా మారింది.
అనుభవాల గుణపాఠం నేర్చుకోకపోవడం రాయలసీమ చరిత్రలో తీరని అన్యాయం…..
1928లో రాయలసీమ అని నామకరణం జరిగిన సమయంలోనే ఆంధ్ర ప్రాంతంతో కలిపి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలన్న చర్చలు నడుస్తున్న రోజులలో ఆంధ్రవిశ్వవిద్యాలయం అనంతలో స్దాపించాలని1926 లో జరిగిన ఆంధ్రమహసభ తీర్మాణాన్ని, మద్రసు శాశనసబ తీర్మానాన్ని సైతం ఉల్లంగించి అనంతలో ఉండాల్సిన ఆంద్రవిశ్వవిద్యాలయాన్ని మొదట విజయవాడ అటు పిమ్మట వైజాగ్ తరలించారు. ఆ సంస్దకు తెలివిగా సీమకు చెందిన కట్టమంచిని వైస్ చాన్స్ లర్ గా నియమించి వారితోనే వై జాగ్ లో ఉండటం మంచిదని చెప్పించినారు. గత అనుభవాన్ని మరిచి అమాయక సీమ పెద్దలు శ్రీభాగ్ ఒప్పందం అవగాహణతో వారితో కలిపి ఆంద్రరాష్ట్రాంగా ఉండటానికి ఇష్టపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాలకే పెద్దమనుషుల ఒప్పందం ప్రాతిపదికన తెలంగాణతో కలిపి ఆంద్రప్రదేశ్ గా మారినపుడు కర్నూలు రాజధానిని వదులుకుని కనీసం పెద్దమనుషుల ఒప్పందంలో శ్రీభాగ్ ఒప్పందాన్ని ప్రస్దావించనూ లేదు. కాని ముఖ్యమంత్రిగా మాత్రం రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డిని నియమించినారు.
అలా పదవులు సీమకు పనులు మాత్రం సర్కారు, హైదరాబాదు వారికిగా మారింది. పెద్దమనుషుల ఒప్పందం అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన తెలంగాణ సమాజం రాష్ట్రం కోసం పోరాడి సాదించుకుంది. ఆ సందర్బంలో జరిగిన సమైఖ్య ఉద్యమంలో కీలక సమయం వచ్చినపుడు తప్పుడడుగుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాయలసీమ పరిస్దితి ఏమిటి అన్న విషయం వదలి సమైఖ్యమత్తులో మునిగిపోయాము. విడిపోవడం కాయం మీకు ఏమికావాలో అడగండి అని కేంద్రం అడిగినా మాకు ఏమీ వద్దు సమైఖ్యమే ముద్దు అన్న నినాదంతో గుడ్డిగా ముందుకు వెల్లినాము. కాని సీమ ప్రజల చేత సమైక్య ఆందోళన చేయించిన సర్కారు పెద్దలు వారు మాత్రం ఆందోళన వదలి డిల్లీలో చక్రం తిప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత వారి అబివృద్ది ఉపయోగపడే పోలవరం, రాజధానికి నిదులు. కోస్దాకారిడార్ లాంటి విలువైన విషయాలను చట్టంలో పొందుపరుచుకున్నారు. రాయలసీమ కోసం కనీసం ఒక్కటంటే ఒక్కటి చట్టబద్దంగా చేయించుకోలేకపోయినాము. పోలవరం పూర్తి అయినా దుమ్ముగూడెం నాగార్జున సాగర్ పధకం అమలు కాకపోతే రాయలసీమ ప్రయోజనం ఉండదు అని తెలిసినా దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కానీ విభజన చట్టంలోగాని పేర్కొనలేదు. విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దుమ్ముగూడెం పధకాన్ని రద్దు చేసినా మన ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉండటం వల్ల పోలవరం ఫలితం సీమకు తక్కడడం కష్టమే. 2014 లో రాజధాని ఎంపికలో రాయలసీమకు అన్యాయం జరిగింది. శ్రీభాగ్ ఒప్పందంలో కీలకమైన అంశం కృష్ణా , తుంగభద్ర నీటిని రాయలసీమ అందించేలా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలి. అది జరగాలంటే సిద్దేశ్వరం , గుండ్రేవుల , పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్ధ్యం పెంపు , చెరువుల పునరుద్ధరణ పనులు జరగాలి. ముఖ్యంగా కృష్ణా నీటిలో ఏపీ వాటానుంచి తమకు అధికంగా కేటాయింపులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న సమయంలో రాయలసీమ ప్రాజెక్టులు గాలేరు నగరి , హంద్రీనీవా , వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి రాష్టానికి నీటి అవసరాల ప్రాధాన్యతను కోర్టులు ముందు ఉంచాలి లేక పోతే రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాల కేటాయింపు ప్రశ్నగా మిగిలిపోతుంది. అటువైపు చర్చ కూడా జరగక పోవడం రాష్ట్రం అంటే పోలవరం , అమరావతి మాత్రమే అన్నట్లుగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి.తొలి భాషా ప్రయోక్త రాష్ట్రం కోసం సమీపంలో ఉన్న మద్రాసును , విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని మరో త్యాగం చేసిన రాయలసీమకు హైకోర్టు కేటాయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై ఏపీలో ఎంత రాద్దాంతం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. రాజకీయ పార్టీలు , మీడియా ఎంత ఏకపక్షంగా రాయలసీమ పట్ల తమ వ్యతిరేకతను బహిరంగంగా తెలుపుతున్నాయి.
అందుకే 93 సంవత్సరాల క్రితం అవమానకరంగా పిలిచుకున్న దత్తమండలం నుంచి ఆత్మగౌరవంతో కూడిన రాయలసీమగా మారిన మన సీమ మన ప్రాంత నేతల పదవి వ్యామోహం మూలంగా పాలకుల వివక్షపూరిత పాలన కారణంగా మరింతగా పతనం కాబడి కువైట్ లో చెన్నై, కేరళలో బిక్షాటన చేసుకునే అవమానకర పరిస్దితి ఎదుర్కొంటున్నాము. వేల మంది రైతులు ఆత్మహత్యలు, లక్షల మంది వలసలు, సీమలో పుడుతున్న 100 మంది పిల్లలలో 45 మంది బలహీనంగా పుతున్నారన్న ఐక్యరాజ్యసమితి గణాంకాలు మన సీమ నేతల నుంచి కనీస స్పందన ఉండటంలేదు. నేతల తీరుతోబాటు ప్రజలు సైతం కులం, మతం, పార్టీల అబిమానం పేరుతో గుడ్డిగా సమర్దిస్తున్నాము పలితం ఒకనాటి రతనాల సీమ నేడు రాళ్లసీమగా మారింది. ఆత్మగైరవ నినాదంతో ప్రారంబమైన రాయలసీమ ప్రజల ప్రస్దానం చైతన్యంతో వివక్ష అంతం అయ్యేదాక ఆత్మాబిమానంతో మన జీవితాలు ఉండేరోజు కోసం పోరాడుతూనే ఉండాలి.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం, 9490493436)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *