ముగిసిన అయోధ్య‌కాండ పారాయణం

ముగిసిన అయోధ్య‌కాండ పారాయ‌ణ‌ దీక్ష
27 రోజుల పాటు 4,308 శ్లోకాల పారాయ‌ణ 
తిరుమ‌ల వ‌సంత మండ‌పం, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లలో 27 రోజుల పాటు నిర్వ‌హించిన అయోధ్య‌కాండ‌ పారాయ‌ణదీక్ష మంగ‌ళ‌వారం ముగిసింది. అయోధ్య‌కాండ‌లోని మొత్తం 119 స‌ర్గ‌ల్లో గ‌ల 4,308 శ్లోకాలను పండితులు పారాయ‌ణం చేశారు. అక్టోబ‌రు 21వ తేదీ నుండి జ‌రుగుతున్న ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.
చివ‌రి రోజున వసంత మండ‌పంలో పండితులు శ్రీ సీతారామల‌క్ష్మ‌ణుల ఉత్స‌వ‌మూర్తుల‌ను కొలువుదీర్చి పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం సంక‌ల్పం, శ్రీ‌రామ ప్రార్థ‌న‌, శ్రీ ఆంజ‌నేయ ప్రార్థ‌న‌, శ్రీ వాల్మీకి ప్రార్థ‌న చేప‌ట్టారు. చివ‌రి రోజున అయోధ్య కాండ‌లోని 111వ స‌ర్గ నుండి 119వ స‌ర్గ వ‌ర‌కు గ‌ల 274 శ్లోకాల‌ను 16 మంది పండితులు పారాయ‌ణం చేశారు. అనంత‌రం క్ష‌మా ప్రార్థ‌న‌తో ఈ పారాయ‌ణం ముగిసింది.
అదేవిధంగా, చివ‌రి రోజున‌ ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లోని యాగ‌శాల‌లో 16 మంది ఉపాస‌కులు శ్రీ‌ సీతా ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామి స‌మేత శ్రీ రామ‌చంద్ర‌మూర్తి మూల మంత్ర జ‌ప‌-త‌ర్ప‌ణ‌- హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా త్రికాల‌పూజ‌, వేద‌పారాయ‌ణం, ప్ర‌బంధగోష్టి చేప‌ట్టారు. ఆ త‌రువాత మ‌హాపూర్ణాహుతితో ఈ దీక్ష ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *